Suryaa.co.in

Andhra Pradesh

మత్స్య సంపదకు విఘాతం కలగకుండా కాలుష్య నివారణ చర్యలు

* మత్స్యకారుల జీవనోపాధులకు భరోసా ఇస్తాము
* మత్స్యకార ప్రతినిధులతో సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి.. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధులకు ఇబ్బందులకు లేకుండా చూస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు.

శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. చమురు సంస్థలు సహజ వాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాల మూలంగా చేపల వేటకు ఇబ్బందులు వస్తున్నాయని, మత్స్య సంపద దెబ్బ తింటుందనీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పరిహారం ఇచ్చారని… మరికొన్ని చోట్ల ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారులకు గత ప్రభుత్వంలో సబ్సిడీలు కూడా సక్రమంగా అందలేదని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకార ప్రతినిధులు తెలిపిన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. చమురు కంపెనీలు నుంచి ప్రభావిత ప్రాంతాలు అన్నింటా పరిహారం అందేలా చూస్తామని, అధికారులతో సమీక్ష చేపడతామని తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు, మత్స్య శాస్త్ర నిపుణులు, సంబంధిత అధికారులతో అధ్యయనం చేయించడంతోపాటు, ఫిషరీష్, ఇండస్ట్రీస్, పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE