( ఇంద్రాణి)
జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఒక్కటే, ఎదుటివారిపైన బురదజల్లే ప్రయత్నం చేయటం. రెండు పరస్పర విరుద్ధమైన గమ్యాలను నిర్దేశించుకున్న రాజకీయపార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఘన చరిత్రను చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
జగన్మోహన్ రెడ్డి ఏదైనా విషయం మాట్లాడే ముందు, తాను మాట్లాడే విషయానికి కౌంటర్ ఏం వస్తుందో అనే ఆలోచన చేయరేమో అనిపిస్తుంది. ముఖ్యంగా హత్యా రాజకీయాల విషయాలు మాట్లాడే ముందు తనను, తన కుటుంబ నేపథ్యాన్ని మరచిపోయి మాట్లాడుతారు. మొన్న సెలెక్టెడ్ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు మాట్లాడారు. అందులో కొన్ని విషయాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో జరుగుతున్న అవకతవకల గురించి కూడా ఉన్నాయి.
కానీ, ప్రజాబాహుళ్యంలోకి వెళ్లిన అంశం ఒక్కటే—ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ కుటుంబం సాగించిన హత్యా రాజకీయాలు. సూది కోసం సోది కి పోతే పాత విషయాలన్నీ బయటపడే పరిస్థితి కల్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్లింట్లో జరిగిన మూడు హత్యల గురించి మాట్లాడితే, ఆ ముగ్గురూ చేసిన, చేయించిన ముప్పై హత్యల గురించి ప్రచారం జరుగుతున్నది. ఇలా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండడా? అంటే ఖచ్చితంగా ఊహించి ఉండాలి.
ఊహించి ఉండకపోతే, 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారో లేదో అనే ఆలోచనను విరమించుకుని, యుద్ధప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి డాక్టర్‌ను సంప్రదించవలసిందే. ఆ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజశేఖరరెడ్డికి మూడవసారి ద్రోహం చేశారు. తనపై ఉన్న సీబీఐ కేసుల్లో రాజశేఖరరెడ్డిని ముద్దాయిని చేయటం ద్వారా మొదటిసారి ద్రోహం చేశారు.
రాజశేఖరరెడ్డి తాను సంపాదించిన సొత్తును నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్పిన మాటను కొట్టిపడేసి, షర్మిలకు అన్యాయం చేసి రెండవ ద్రోహం చేశారు. ఇక మూడో ద్రోహం అయితే వైఎస్ ఆత్మ కూడా ఉలికిపడేటంత ద్రోహం. ఇప్పటివరకు రాజారెడ్డి మాట ఎలా ఉన్నా, ముఠాకక్షలకు రాజశేఖరరెడ్డి దూరంగా ఉన్నారనే చాలామంది నమ్మకాన్ని పోగొట్టి, ఆయన రాజారెడ్డి కంటే తెలివిగా హత్యలు చేయించేవారు అని ప్రపంచానికి తెలియజేసి వైఎస్ కు ఆపాదించుకున్న ‘దేవుడు’ ఇమేజ్ను పోగొట్టారు. వివేకానందరెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందో లేదో తరువాత విషయం.
హత్యకు గురైన తరువాత వివేకాలో ఉన్న సద్గుణాలే జనంలోకి వెళ్ళాయి. ఎంపీ సీటు విషయంలో జగన్, వివేకా పైన దౌర్జన్యం చేసినప్పటి నుండి ప్రజలకు ఆయన పట్ల సానుభూతి కలిగింది. కానీ ఇప్పుడు వివేకా ఎన్ని హత్యలకు ప్లాన్ చేశారో బయటపడేలా చేసి, ఆయన హత్య కంటే పెద్ద దెబ్బతీశారు జగన్. నాలుగు రోజులుగా రాజారెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబం ఎన్నెన్ని హత్యల్లో పాత్రధారులో, సూత్రధారులో చెబుతూ ఆ కుటుంబ బాధితులు అందరూ టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ మాట్లాడుతున్నారు.
జగన్ కుటుంబ హత్యా రాజకీయాలు చూస్తున్న వారికి, ఇటువంటి వ్యక్తులకు సభ్య సమాజంలో చోటు కల్పించటమే కాక వారిని నెత్తిమీద పెట్టుకుని ఊరేగినందుకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించాడు జగన్. మరోవైపు తన శ్రీమతి భారతి వాళ్ల నాన్న గంగిరెడ్డి, కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వాళ్ల నాన్న భాస్కరరెడ్డి ఎన్ని హత్యల్లో పాలుపంచుకున్నారో ప్రపంచానికి తెలియజేశారు.
రాజశేఖరరెడ్డి చనిపోయే నాటికి ఉన్న ఇమేజ్ను ఒక్క విలేకరుల సమావేశంతో పోగొట్టారు జగన్. కుటుంబంతో తనకున్న ప్రగాఢ అనుబంధాన్ని చెప్పబోయి, కుటుంబం పట్ల ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆయనే బయటపెట్టుకున్నారు.
తల్లీ, చెల్లితో ఆస్తి గొడవలు మాత్రమే అనుకున్నారు జనం. తాత అంటే జగన్ కు అత్యంత అభిమానం అనుకునేవారికి, రాజారెడ్డి హంతకుల్లో ఒకరైన సతీష్ రెడ్డిని తన వెంటే తిప్పుకుంటున్న విషయాన్ని పెద్దగా తెలియని వారికి కూడా తెలియజేశాడు. రక్తచరిత్రను వైఎస్ కుటుంబం తమ రాజకీయ జీవితానికి ఎలా సోపానంగా మార్చుకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ముక్కుపచ్చలారని పిల్లల తలలను, మొండాలను వేరుచేసిన ఆ కుటుంబం కావించిన హత్యాకాండ వింటుంటే హారర్ సినిమాను తలపించింది.
ఇళ్లల్లో ఉన్న స్త్రీలను అసభ్యంగా బయటకు లాగి, డైనమైట్లతో ఇళ్లను పేల్చివేసి, సామాన్లు లూటీ చేసిన ఆ కుటుంబ గాథ విన్నవారికి.. తల్లీ, చెల్లిని జగన్ హింస పెట్టడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. తాత హత్యకేసులో ముద్దాయిలను అక్కున చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డికి, సొంత బాబాయి కేసులో ముద్దాయిలుగా ఉన్న అవినాష్ రెడ్డిని, భాస్కరరెడ్డిని సమర్థించుకోవటం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
మామగారితో సహా కుటుంబం మొత్తం హత్యా రాజకీయాలలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆ మరకను చంద్రబాబు నాయుడుకు అంటించే ప్రయత్నంలో రంగా హత్యను ప్రస్తావిస్తారు. కానీ, ఆ హత్యలో ముద్దాయిగా ఉన్న నెహ్రూను వాళ్ల నాన్న వెంటబెట్టుకుని తిరిగితే, నెహ్రూ కొడుకు అవినాష్‌ను జగన్ వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు. ఇక పరిటాల రవి హత్య గురించి, ఆ హత్యలో ముద్దాయిలుగా తండ్రీకొడుకుల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని ప్రసారమాధ్యమాల ముందుకు వచ్చినవారు ఘంటాపథంగా నొక్కి చెబుతున్నారు.
ఎందుకు జగన్మోహన్ రెడ్డి తేనెతుట్టెను కదిలించారో అనేది ఆయనకైనా తెలుసని అనుకోలేము. చంద్రబాబు నాయుడుకు కొన్ని విషయాలలో మరకలు అంటించటం కష్టం, అందులో హత్యా రాజకీయాలు అంటించటం మరీ కష్టం. హత్యా రాజకీయాల పట్ల ఆయనకు ఇష్టం లేకపోయినా, వ్యతిరేకత లేకుండా ఉండి ఉంటే ఈరోజు పరిటాల రవి ప్రజల మధ్యనే ఉండేవాడు.
జగన్ మంచోడు కాబట్టే వారి తాతగారిని చంపిన హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని పదే పదే తనకు తానే చెప్పుకుంటున్నాడు. రాజారెడ్డి హత్య కేసును అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. రాజశేఖరరెడ్డి స్వయంగా ఆ కేసును పర్యవేక్షించి, ముద్దాయిలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశారు. తన తండ్రి హత్యలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కానీ, ‘నారాసుర రక్తచరిత్ర’ టైటిల్స్‌తో చంద్రబాబుకు హత్యా రాజకీయాల బురద అంటించే ప్రయత్నం కానీ చేయలేదు.
అందుకు ఆయన రాజకీయ అనుభవం ఉపయోగపడింది. చంద్రబాబుకు అటువంటి బురదను చిమ్మి ఉపయోగం లేదని రాజశేఖరరెడ్డి కి తెలుసు. రాజారెడ్డి హత్యకేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. కానీ జగన్ ఎప్పుడూ అదే ప్రస్తావన చేస్తుంటారు. అంటే కంటికి కన్ను సిద్ధాంతాన్ని అమలు చేయలేదు అని బాధపడుతున్నారా?
రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తన తాతను హత్య చేసిన వారిని తాను హత్య చేయకపోవటాన్ని గొప్పగా భావిస్తున్నారా? అటువంటి మాటతోనే ఆయనలోని రక్తచరిత్ర వారసత్వం కనిపిస్తున్నది. జగన్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన పతనం అంచున నడుస్తున్నారు అని చెప్పటానికి సందేహమే అవసరం లేదు.!