-పరువు పోయిందని పగతో రగిలిన తండ్రి
-తాత ప్రశ్నించడంతో నిజం చెప్పిన తండ్రి
-నంద్యాలలో ఓ విషాదం
నంద్యాలలో దారుణం… కూతురి తలా మొండెం వేరు చేసి… నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో కూతురిని హత్య చేశాడు ఓ కిరాతక తండ్రి. కూతురు ప్రసన్న గొంతుకోసి చంపేశాడు. తల మొండెంను నల్లమల ఫారెస్ట్ లోని బొగడా టన్నెల్ వద్ద పడేశాడు. వివాహం చేసి సంవత్సరంన్నర అవుతున్నా కాపురానికి పోకపోవడంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత తండ్రి దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. మనవరాలు కనిపించపోవడంతో తాత శివారెడ్డి ఫిర్యాదు తో ఈ విషయం బయటకు వచ్చింది. శివారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నల్లమల ఫారెస్ట్ బొగడా వద్ద యువతి ప్రసన్న మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాగా.. కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రసన్నకు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తో పెళ్లి చేశారు. అయితే… పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించింది. అతనితో ఉన్న సాన్నిహిత్యంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేందర్ రెడ్డి కూమార్తెపై కోపం పెంచుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాల- గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తల, మొండెం వేరు చేసి తల ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చింది. ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. దేవేందర్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించడంతో పరుపు పోయిందని కుమార్తెను చంపినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.