నీ వన్నె చిన్నెల
వయ్యారాలు చూసి
తొలి సంధ్యా సమయమే
నివ్వెర పోగా….
నీ కంటి మెరుపుల
కవ్వింతలకు
కలువ మనసు కలత చెందగా….
నీ చెంప కెంపుల
గుసగుసలకు
చామంతి చింతాక్రాంతం కాగా…
నీ సుతిమెత్తని
అడుగుల సవ్వడికి
నునులేత పచ్చిక బయళ్ళు
ఆశ్చర్యంగా తిలకించగా….
స్వేచ్ఛ వాగులలో
ఆనంద తాండవం చేస్తున్న
ముంగురుల విన్యాసాలకు
మలయ పవనమే మదన పడగా….
నీ హస్తముద్రికల
నాట్య భంగిమలలో
ప్రేమ లాస్యం
మందహాసమై చిందులు వేయగా….
ఈ పారాణి పాదాల
మాగాణి రాణికి
“మనసునేలే మారాజు “నేనేనని…..
నా హృదయ మందిరాన
అనురాగ దేవతగా కొలువైన వేళ
జీవితానికి
ఇంకా కావాల్సిందేముంది !!
వలచిన చెలి వలపు కాంతులే
నన్ను లాలించగా….
అర్థంలేని ఆస్తిపాస్తులు
పాలించగలవా నన్ను ??
నలిగల రాధికా రత్న.