Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తా!

-నా మెజారిటీ తగ్గించేందుకు 300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు
-అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పం నియోజకవర్గంతో పోటీపడి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. గత పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభల్లో పాల్గొంటూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న లోకేష్… గురువారం తల్లి భువనేశ్వరితో కలిసి కురగల్లు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పుడు కుప్పం, హిందూపూర్, మంగళగిరి నియోజకవర్గాల నడుమ పోటీనడుస్తోంది. ఎక్కువ మెజారిటీ ఎక్కడ వస్తుందనే విషయంలోనే మా మధ్య ప్రధాన పోటీ నెలకొందని లోకేష్ చమత్కరించారు. ఇక్కడ చేపట్టిన 29 అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు కుప్పంలో కూడా అమలుచేయాలని అమ్మ కోరుతున్నారు. అయిదేళ్లుగా సొంత కుటుంబసభ్యుడిలా నియోజకవర్గ ప్రజలకు వెన్నంటి నిలచి సేవలందించాను. పాతికేళ్లు అధికారం అనుభవించిన మురుగుడు హనుమంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10శాతమైనా చేశారా? కురగల్లు ప్రజలు ఆర్కేకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఇక్కడి ప్రజల ఇళ్లపైకి పొక్లయినర్లు పంపాడు, ఆ సమయంలో నేను కోర్టుకువెళ్లి స్టేతెచ్చి ప్రజలకు అండగా నిలిచాను. ఎమ్మెల్యే ఆర్కే అయిదేళ్లుగా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు.

మూడుముక్కలాటతో అమరావతి నాశనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడుముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేశారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులకు కనీసం కౌలు డబ్బు కూడా అందించకుండా ఇబ్బంది పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు ప్రారంభిస్తాం, మంగళగిరి బిడ్డలకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ లో నేను ఏర్పాటుచేసిన పై కేర్ సాఫ్ట్వేర్ కంపెనీలో 580మంది పనిచేస్తున్నారు. నన్ను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎంత అభివృద్ధి చేస్తానో ఆలోచించండి. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం. కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తా.

ఓటుకు 10వేలు ఇస్తారట… అదంతా మీడబ్బే
మంగళగిరిలో నా మెజారిటీ తగ్గించేందుకు జగన్ 300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు, ఓటుకు 10వేలు ఇస్తారట, తీసుకోండి… అదంతా మీ డబ్బే. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసి చార్జీలు, ఇసుక, మద్యం, పెట్రోలు, డీజిల్, ఇంటిపన్ను, చెత్తపన్ను వంటి రకరకాల పేరుతో జగన్ ఒక్కో కుటుంబం నుంచి రెండున్నర లక్షలు కొట్టేశారు. అందులో పదిశాతం దోపిడీ సొమ్ము ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారు. బిడ్డల భవిష్యత్ మీ ఓటుపైనే ఆధారపడి ఉంది. మరోమారు మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికే వచ్చా. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. మరో 40ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చా. అయిదేళ్ల తర్వాత మీతో శబాష్ అన్పించుకుంటా, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.

బిడ్డల భవిష్యత్తుకు లోకేష్ ను గెలిపించండి: సుహాసిని
ఇక్కడి పరిస్థితులు చూశాక అయిదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోందని శ్రీమతి నందమూరి సుహాసిని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, వైసిపి ప్రభుత్వం వచ్చాక నాశనం చేసింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం యువనేత లోకేష్ ను ఎన్నికల్లో ఆశీర్వదించండి. రాబోయే మూడురోజులే కీలకం, మంగళగిరిలో పసుపుజెండా ఎగరాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములు కొట్టేయడానికి వైసిపి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈసారి తేడా జరిగితే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉండదు. చంద్రబాబు మాదిరే లోకేష్ కూడా విజన్ ఉన్న వ్యక్తి. ఆయనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని సుహాసిని అన్నారు.

యువనేత దృష్టికి కురగల్లు వాసుల సమస్యలు
ఈ సందర్భంగా కురగల్లు రైతులు పలు సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ అందించాలి, దీర్ఘకాలంగా పెండింగ్ లో పెట్టిన కౌలు బకాయిలు ఇప్పించాలి. శ్మశానవాటిక లేక ఇబ్బంది పడుతున్నాం. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించలేకపోతున్నాం. స్కూలు భవనం శిథిలావస్థకు చేరుకుంది. దేవాలయంలో విద్యార్థులు చదువుకుంటున్నారు. టిడ్కో ఇళ్లను సకాలంలో అందించకపోవడంతో వడ్డీలకు చక్రవడ్డీలు పెరిగి అధిక భారం పడుతోంది, విముక్తి కల్పించాలి. గ్రామంలో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు వెళ్లే రోడ్డు మాయమైంది, సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో రాజధానిరైతులకు కౌలు బకాయిలు చెల్లిస్తాం. భూసేకరణ చేసి దామాషా ప్రకారం శ్మశానానికి స్థలం కేటాయిస్తాం. గ్రామంలో నూతన స్కూలు భవనాన్ని నిర్మిస్తాం. కబ్జాకు గురైన రోడ్డును తిరిగి ఏర్పాటుచేస్తాం. అధికారులతో మాట్లాడి టిడ్కో లబ్ధిదారుల సమస్య పరిష్కరిస్తాం. ఎసైన్డ్,కొండ పోరంబోకు ప్రాంతాల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిస్తాం. అండర్ గ్రౌండ్ భూగర్భ డ్రైనేజి, ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువనేత లోకేష్ కోరారు.

లోకేష్ దృష్టికి నిడమర్రు ప్రజల సమస్యలు
నిడమర్రులో జరిగిన రచ్చబండలో స్థానికులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వితంతు పెన్షన్ కట్ చేశారు, కురగల్లు, నిడమర్రు రైతులకు జరీబు రైతులకు మాదిరి ప్యాకేజి ఇవ్వాలి. మంగళగిరికి ఐటి కంపెనీలు తీసుకురావాలి. పసువుల హాస్పటల్ కు డాక్టర్ ను నియమించాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రిని 10పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని విన్నవించారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ… కొర్రీలతో నిలిపివేసిన పెన్షన్లను తిరిగి అందజేస్తాం. 3వేల పెన్షన్ ను 4వేలకు పెంచుతాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పశువుల హాస్పటల్, ప్రభుత్వాసుపత్రి విస్తరణ అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు

LEAVE A RESPONSE