ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు
– అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన.
2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ . అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరం ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయి.
దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి…కానీ తెలంగాణకు ఆయన ఆత్మబంధువు. తెలంగాణకు పురుడుపోసిన వ్యక్తిగా అయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయం. దేశానికి ఆయన చేసిన సేవలకు మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మన్మోహన్ పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.
మన్మోహన్ సింగ్తో జైపాల్ రెడ్డి కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాంటి ఆయనకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యుల సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని మేం భావిస్తున్నాం.