Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా?

-నాదెండ్ల మనోహర్

•రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు
గిట్టుబాటు ధరలు రాక… పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతుంటే నీటి తీరువా వసూలు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అప్రజాస్వామికంగా ఉంది. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం, కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం, భవిష్యత్తులో పంట నష్ట పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అనాలా? అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి గారు పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? గత నెలలో ఆస్తి పన్ను కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేశారు. ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారు. ఇప్పుడు రైతుల మీద పడ్డారు. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారు. పంట కాలువల నిర్వహణకు… కనీసం పూడిక తీతకు వైసీపీ ప్రభుత్వం పైసా కూడా ఖర్చుపెట్టలేదు. స్థానికంగా రైతులే ఆ పనులు చేసుకొంటున్నారు. గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలి.

•రూ.7లక్షల పరిహారాన్ని 6శాతం వడ్డీతో చెల్లించాలి
రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తామని ఊరూరా చెప్పిన సిబిఐ దత్తపుత్రుడు వారాలు, నెలలు గడిచినా డబ్బులు చెల్లించడం లేదు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు- రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికీ వడ్డీ లెక్కగట్టి చెల్లించాలి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలి.

ప్రణాళిక లేకుండా, రైతులపట్ల కనీస బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఈ పాలన వైఫల్యం వల్లే 2019 నుంచి ఇప్పటి వరకూ 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని ఆదుకొనే ఉద్దేశం లేని ఈ ప్రభుత్వం వసూళ్లు మాత్రం వడ్డీతో సహా చేస్తోంది. వడ్డీ వ్యాపారం విడిచిపెట్టి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వానికి సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE