– ఫోర్త్ ఎస్టేట్ ని పరిరక్షించుకోవాలి
– తెలుగు – సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్
విజయవాడ: ఏ వ్యవస్థ కూలిన ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది గానీ ప్రజాస్వామ్యం కి మూల స్తంభమైన మీడియా విఫలం అయితే మానవ హక్కులు ధ్వంసం అవుతాయని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ అభిప్రాయ పడ్డారు. జాప్(జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్) ముప్పై మూడవ పౌండేషన్ డే సందర్బంగా విజయవాడ లోని ఆ సంస్థ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం కి ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్ట్ గా మొదలైన తన అనుభవాలు ప్రస్తావించారు.
నెల్లూరు జిల్లా లోని కావలి లో తుఫాన్ కి తన నివాసం పడిపోతే తాను తీర ప్రాంతం లోని ప్రజల కడగళ్ల ను కవర్ చేయడానికి వెళ్ళాను అని, మిగతా జర్నలిస్ట్ లు పోలేని పరిస్థితుల్లో తాను వెళ్లి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చాను అన్నారు. అభాగ్య మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగినప్పుడు తన కలం విస్ఫు లింగాలు వెదజల్లిoదన్నారు. అవినీతి పై తన కలం కరాళ నృత్యం చేసింది అన్నారు.ఇప్పటి జర్నలిస్టు ల్లో చాలా మందికి వృత్తి నైపుణ్యం లోపించింది అన్నారు.
అయినప్పటికీ నేటికీ ప్రజాస్వామ్యం ని కాపాడేది మీడియానే అన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట లో ఒకసారి వరదలు ముంచెత్తుతున్నప్పుడు కొంతమంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోడానికి బస్సు టాప్ పై చేరారు అని, ఆ దృశ్యాలను మీడియా ఛానళ్ళు కవర్ చేశాయి అని, అప్పుడు ఆ జిల్లా అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలు నిలిచేవి అన్నారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ గుర్తుకు వచ్చి మనసు భారం అవుతుంది అన్నారు. ప్రజాస్వామ్యం లో అధికార యంత్రాంగం సరిగ్గా వ్యవహరించకపోతే, ప్రజల జీవితాలు చీకటి మయం అవుతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజానికి మంచి నేతలు అవసరం అని అందులో భాగం గానే నావంతు ప్రయత్నం చేయడానికి రాజకీయ రంగ ప్రవేశం చేశాను అన్నారు. గతం లో ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా చేసినా, తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం లో భాగంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ గా తనకు వచ్చిన పదవీ బాధ్యతలు ద్వారా భాషాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జర్నలిజం లో మెళకువల గురించి.. విలువల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ ఒక పుస్తకం రాస్తే , తాను అకాడమీ ద్వారా ప్రచురిస్తాను అన్నారు. సమావేశం లో జాప్ జాతీయ స్థాయి నాయకులు ఉప్పాల లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ జాప్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సంపత్ తదితరులు మాట్లాడారు.