– భారతదేశంలో తెలంగాణ మీకు మరో ఇల్లు
– ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తా
– త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి
– హైటెక్స్ లో “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో
– కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం… తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుంది. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనది. పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం ఈశాన్య ప్రాంతం. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాల పౌరుల బాధను మన తెలుగు ప్రజలం సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1970”లు , 80లలో ఉత్తరాది వారు మన దక్షిణాది వాళ్లందరినీ ‘మద్రాసీలు’ అని పిలిచేవారు. తెలుగువారి కంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు, సంస్కృతుల మధ్య తేడాను వివరించడం దక్షిణాది వారికి కష్టంగా ఉండేది. అయినా ఎకానమీ పరంగా, సాంస్కృతిక పరంగా, ఇతర రంగాల్లో దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి సంస్కృతిని మరింత బాగా అర్థం చేసుకోవాలి. వారితో కనెక్టివిటీ పెంచుకోవాలి. అప్పుడే ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాలలో మన దేశానికి మరింతగా తోడ్పాటు అందించే రాష్ట్రాలుగా మారతాయి.
హైదరాబాద్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్‌కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్‌లు, క్రీడలు వంటి అన్ని రంగాలలో వారు సక్సెస్ అయ్యారు. తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ నా ధన్యవాదాలు. భారతదేశంలో తెలంగాణ మీకు మరో ఇల్లు లాంటిది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భారత్ ఫ్యూచర్ సిటీలో, భారతదేశపు మొట్టమొదటి ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటిస్తున్నాం ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తాం.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు వారి వారి ప్రత్యేక భవనంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆహారం, చేతివృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలు ఉంటాయి. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కు కల్చరల్ కనెక్ట్ ఈవేదికగా మొదలైంది. తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్నారు.త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్నారు. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళదాం “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో – కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లడానికి మీ సహకారం ఉండాలి.




