Suryaa.co.in

మార్గశిర మాసం విశిష్టత
Devotional

మార్గశిర మాసం విశిష్టత

హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది.
మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని ‘గీత’లో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు పండితులు చెబుతున్నారు.ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మార్గశిరం అంటే..
‘బృహత్సామ తథాసామ్నాం – గాయత్రీ ఛందసా మహం
మహం – మాసానాం మార్గశీర్షోహ -రుతూనాంకుసుమాంకం’
అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరంఅంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట.
‘మాస సంక్రమణం’
సూర్య భగవానుడు 12 నెలల్లో అంటే ఒక్కో నెలకు ఒక్కో రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉండడాన్ని ‘మాస సంక్రమణం’ అంటారు. ఇలా ఒక ఏడాది 12 సంక్రమణలు వస్తాయి. సూర్యుడు తులరాశి నుండి వ్రుశ్చికరాశిలోకి ఆగమనం చేయడాన్ని వ్రుశ్చిక సంక్రమణం అంటారు. ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకు, సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనది.
‘భగవద్గీత’ జననం
హిందువులందరికీ ‘భగవద్గీత’ జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. శుక్ల పక్ష ద్వాదశినాడు పంచామ్రుతాలతో అభిషేకం చేయాలి.
శ్రీమహా విష్ణువుతో పాటు సూర్యభగవానుడిని పూజించి.. ఈ మాసంలో ఏ పని చేస్తున్నా ‘ఓం దామోదరయ నమః, ఓం నమో నారాయణయ నమః’ అనే మంత్రాలను జపించాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో తులసి సన్నిధిలోని మట్టి, ఆకులను తీసుకుని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని స్తుత్తిస్తూ శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.
మార్గశిర లక్ష్మీవార వ్రతం
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ.. ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ చేయడంతో పాటు, ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూదనుడు’ అనే నామంతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.
మోక్షం తథ్యం
మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గ శిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’ అని ..దీనినే ‘మోక్ష ఏకాదశి’ అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE