– లబ్దిదారులు పెరిగినప్పుడు సాయం కూడా పెరగాలి కదా?
– నెల కూడా కాలేదు అప్పుడే 2లక్షల 20 వేల మంది లబ్దిదారులు ఎలా పెరుగుతారు?
-తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్యసాయి జిల్లాలో జగన్ అబద్ధాల తుంపరకు తెరలేపారు. మే 16వ తేది ఇచ్చిన ఫుల్ పేజి ప్రతికా ప్రకటనలో రైతు భరోసాకింద 50,10,000ల మందికి రూ.23, 870 కోట్లు సాయం చేసినట్లు పేర్కొన్నారు. నేడు ఇచ్చిన ప్రకటనలో 52,38,000 మందికి 23,870 కోట్లు సాయం చేశామని ప్రకటించుకున్నారు. లబ్దిదారులు పెరిగినప్పుడు సాయం కూడా పెరగాలి కదా?. నెల కూడా కాలేదు అప్పుడే 2లక్షల 20 వేల మంది లబ్దిదారులు ఎలా పెరుగుతారు? రైతులకు జరిగిన నష్టానికి, ప్రభుత్వం చేసిన సాయానికి, ఇస్తున్న ప్రతికా ప్రకటనలకు పొంతన కుదరడంలేదు.
వైసీపీ నాయకులు లెక్కలేనితనంతో పత్రికల్లో తప్పుడు లెక్కలు చూపిస్తు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రధానమంత్రి పశుబీమాయోజన పథకం రాష్ట్రంలో ఎక్కడా అమలు జరగడంలేదు. ఎస్ఎల్ బీసీ కమిటి లెక్కల ప్రకారం రూ.2లక్షల 637 కోట్లు బకాయిలు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సివుంది. రైతులకు ఉన్న బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్ పై ఉన్న ఈడీ కేసుల మాఫీ కోసం జగన్ పడరాని పాట్లు పడుతున్నాడు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికి పడని పాట్లు లేవు. కొత్త అప్పులు తెచ్చి పబ్బం గడుపుకోవడానికి చేయరాని పనులన్నీ చేస్తున్నాడు. పనికిమాలిన జీవో తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు బిగిస్తానమడం అన్యాయం.
18లక్షల 57 వేల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించి నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తాననడం రైతులను మోసం చేయడమే. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు పెట్టి 27 వేల పంపుసెట్లకు మీటర్లు బిగించారు, నాణ్యత ఏమాత్రం పెరిగిందో తెలపాలి? 9 గంటలు పగలు నిరాటంకంగా కరెంటు ఇస్తామని చెప్పి మూడు దఫాలుగా మార్చారు. 5 గంటలకు కుదించారు. ప్రశ్నిస్తే ట్రాన్స్ ఫార్మర్ పోయిందని, లైన్ ట్రిప్ అని వంకలు చెబుతున్నారు. రాష్ట్రంలో బిందు తుంపర సేద్యానికి జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మంగళంపాడారు. తుంపర సేద్యం వల్ల కలిగే లాభాలు, రైతులకు కలిగే లబ్ధి గురించిప్రజలకు తెలిపి మోటివేట్ చేయాలి.
అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయం చర్చలోకి వచ్చే విధంగా మార్పులు చేసిన ఘనత చంద్రబాబుది. దీన్ని కూలదోయడం జగన్ రెడ్డి విధానం. ఆంధ్రప్రదేశ్ లో రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయిల్ టెక్నాలజీని ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు 7లక్షల 38 వేల 659 ఎకరాల్లో బిందు తుంపర్ల సేద్యం అమలు జరిగింది. జగన్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు బిందు తుంపర సేద్యాన్ని పడుకోబెట్టారు. టీడీపీ హయాంలో 2017-18లో రూ.12వందల కోట్లు ఖర్చు చేసి బిందు తుంపర సేద్యాన్ని దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లాం.
నేడు ఈ ప్రభుత్వం 2021-22లో 1190 కోట్లను కేటాయిస్తూ లక్షా 25 వేల ఎకరాలు టార్గెట్ పెట్టింది. 22-23లో 12 వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆనాటి మంత్రి కన్నబాబు శాసనసభలో ప్రకటించారు. కానీ పథకాన్ని పడుకోబెట్టారు. పథకాన్ని పూర్తిగా నిలిపేశారు. ఈ పథకానికి ఖర్చు పెట్టింది సున్న. కోనసీమ జిల్లాలో 20 లక్షలు ఖర్చుచేసి సీ మౌత్ లోని సీమౌల్ట్ ని నిరూపించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ధాన్యం సేకరణలో 44.3 కోట్ల డబ్బు చెల్లించామనడం శుద్ధ అబద్ధం. రైతు నష్టపరిహారం చెల్లించడంలో 16 కోట్ల రూపాయలు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకున్నారు. దోచుకున్న డబ్బును అడగకుండా ఉండటానికి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ లు వేసుకుంటున్నారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు.