– ఆగస్టు 1న విడుదలైన డ్రాఫ్ట్ జాబితాపై సెప్టెంబర్ 1 వరకు క్లెయిమ్స్ & ఆబ్జెక్షన్లు దాఖలు చేసుకునే అవకాశం
– ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్ల వ్యత్యాసం మాత్రమే
– ఈ గడువు ఒక నెల సరిపోతుంది
– దీన్ని పెద్ద సమస్యగా చూపించడం తగదు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమవేశంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం “ఓటు చోరీ” అనే అంశం ప్రచారం జరుగుతోంది. కానీ “ఓటు చోరీ” అనేది కేవలం ఒక నినాదం మాత్రమే. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసపరచడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “చార్ సౌ పార్” అంటూ దేశాన్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరోవైపు ఒక కొత్త నెరేటివ్ మొదలైంది. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు “రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని రక్షించాలి” అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అంటూ మళ్లీ అదే తరహా ప్రయత్నం చేస్తున్నారు. గత 35 సంవత్సరాల ఎన్నికల లెక్కలు పరిశీలించినా, 2024 లో కాంగ్రెస్ పార్టీ గాని, ఇండీ కూటమి గాని ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ ఓట్లు సాధించలేదు. అయినప్పటికీ “ఓటు చోరీ” అంటూ బీజేపీపై ఆరోపణలు చేయడం చాలా తప్పు, దీన్ని తీవ్రంగా ఖండించాలి.
2018లో తెలంగాణ రాష్ట్ర ఓటర్ లిస్ట్‌లో ఇంచుమించుగా 2 కోట్ల 56 లక్షల మంది ఉన్నారు. ఆ సమయంలో మేము ఎన్నికల సంఘానికి 68 లక్షల వ్యత్యాసాలు ఉన్నాయని నిర్ధారణతో చూపించాము. వాటిలో ముఖ్యంగా .. 30 లక్షల డ్యూప్లికేట్ ఓట్లు, 12 లక్షలు – తెలంగాణలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన డూప్లికేట్లు, 18 లక్షలు – ఆంధ్రప్రదేశ్‌కు సంబంధమున్న డూప్లికేట్లు, ఒకే ఇంటిలో అనేక మంది ఓటర్లుగా నమోదు, ఇంటి నెంబర్ లేకుండా పేర్లు నమోదు.. ఒకే వ్యక్తి పేరు అనేక రకాలుగా నమోదు కావడం…. ఇలా కలిపి దాదాపు 60 లక్షల వ్యత్యాసాలు/తప్పులు ఉన్నాయని గుర్తించాం.
2025 జనవరిలో విడుదలైన ఓటర్ లిస్ట్ ప్రకారం బీహార్‌లో మొత్తం 7 కోట్లు 89 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 77,895 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తగ్గాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఈ 65 లక్షల తగ్గుదల అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పిన అంచనా మాత్రమే. మొత్తం ఓటర్లలో ఇది 1% కన్నా తక్కువ. ఎన్నికల లిస్టు రివిజన్లో ఇలాంటి సవరణలు సహజమైనవి. ఆగస్టు 1న విడుదలైన డ్రాఫ్ట్ జాబితాపై సెప్టెంబర్ 1 వరకు క్లెయిమ్స్ & ఆబ్జెక్షన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉండొచ్చు. ఈ గడువు ఒక నెల సరిపోతుంది. కాబట్టి దీన్ని పెద్ద సమస్యగా చూపించడం తగదు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న “ఓటు అధికార్ యాత్ర” అనే ఒక తమాషా చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఇప్పటివరకు లక్షలాది క్లెయిమ్స్ ఫైల్ అయ్యాయి. అదనంగా 4,30,000 పైచిలుకు ఫారం-6లు సబ్మిట్ అయ్యాయి. ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. వచ్చిన వాటన్నింటిని పరిశీలించే ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలి.
అయితే ఇలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన తప్పుడు నెరేటివ్‌ను ముందుకు తీసుకురావడం దురదృష్టకరం. గత 35 సంవత్సరాల్లో ఎప్పుడూ రాని విధంగా 2024 లో కాంగ్రెస్ పార్టీకి, ఇండీ కూటమికి ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అసలు ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం మాత్రమే.
కాంగ్రెస్ నాయకులు.. “రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, పేదలకు అన్యాయం జరుగుతుంది” అని తప్పుడు ప్రచారం చేసి, రిజర్వేషన్ పేరుతో ఓట్లు చోరీ చేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నో సార్లు బోగస్ ఓట్లు ఉన్నాయని మేము చెప్పాం. ఒక్కొక్క ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యారు. ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీకి చెందినవారు ఈ విధంగా చేయడం వల్ల న్యాయంగా ఎన్నికలు జరగడం కుదరదు. మేము దీనిపై నిరంతర పోరాటం చేస్తూ వచ్చాం.
హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో కామన్ సమస్య ఏమిటంటే— పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మొదలైన ప్రాంతాల్లో నివసించే వారి పేర్లను కూడా ఇక్కడ నమోదు చేశారు. ఇక్కడ నివసించని వారి పేర్లు ఉన్నాయ్, లేకపోయినా పేర్లు నమోదు చేశారు. ఇలాంటి అనేక పొరపాట్లు ఉన్నాయి.
ఇది బిజెపి మాట మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు 2024 ఫిబ్రవరిలో “6,69,000 బోగస్ ఓట్లు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. మళ్లీ ఆగస్టు 25న కూడా అదే మాట చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇదే విషయం చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీ బిజెపిపై “ఓటు చోరీ” ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదం. రాహుల్ గాంధీ అసలు ఏమి జరుగుతుందో నిజంగా తెలుసుకోవాలి. జిహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు మేము కేంద్ర ఎన్నికల సంఘానికి మెమోరాండం కూడా సమర్పిస్తున్నాం.
ఇది కేవలం ప్రతిపక్షం చెబుతున్న విషయం మాత్రమే కాదు. అధికార పార్టీలో ఉన్న నాయకులే బోగస్ ఓట్లు ఉన్నాయని అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా అధికారులు కూడా ముఖ్యమంత్రి ఒత్తిడి వలన సక్రమంగా పని చేయలేకపోతున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.
అదేవిధంగా, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఓటర్లుగా నమోదు అయ్యి ఓటు వేస్తున్నారు. నిర్మల్, బోధన్ వంటి ప్రాంతాల్లో ఇదే సమస్య ఇప్పటికే ఎదురైందని మేము అప్పుడే కంప్లయింట్ ఇచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసి పరిధిలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తప్పనిసరిగా జరగాలి.
డూప్లికేట్ ఓట్లు మాత్రమే కాకుండా, పక్క నియోజకవర్గాల నుంచి లేదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఓటర్లుగా నమోదైన వారిని పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం ఎంతమంది క్లెయిమ్స్, ఎంతమంది ఆబ్జెక్షన్లు ఫైల్ అయ్యాయో ప్రకటిస్తోంది. మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న “ఓటు అధికారి యాత్ర, ఓటు చోరీ” అనే ప్రచారం పూర్తిగా అసత్యం. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరేదీ కాదు.