– అధికారంలోకి వచ్చాక లోతుగా దర్యాప్తు చేస్తాం
– ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు.. జైలుకు పంపుతాం
– స్టాఫ్‌కి రెండేళ్లు జీతాలు కూడా చెల్లిస్తారట
– ఆ లెక్కన 10 కాలేజీలకు ఏడాదికి రూ. 800 కోట్లు ముట్టజెప్పాలి
– ఇది మరో స్కాం.. దీన్ని కూడా వదిలిపెట్టబోం
– స్టాండింగ్ కమిటీ నివేదికపై బహిరంగ చర్చకు సిద్ధమా ?
– మీడియాతో మాజీ మంత్రి విడదల రజని
తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందని, ప్రైవేటు వ్యక్తుల నుంచి అందే కిక్ బ్యాక్‌ల కోసం సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను, వాటికి చెందిన విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడమే కాకుండా ప్రైవేటు కాలేజీల నిర్వహణకు, స్టాఫ్ జీతాలకు రెండేళ్లు ప్రభుత్వమే నిధులు సమకూర్చడం చూస్తే ఎన్నివేల కోట్లు చేతులు మారుతున్నాయో స్పష్టంగా తెలిసిపోతుందని చెప్పారు. 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు జీతాల కోసం ఏటా రూ. 800 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని, ఆ డబ్బుతో ఏకంగా ప్రభుత్వ కాలేజీల నిర్మాణమే పూర్తిచేయొచ్చని వివరించారు.
అయినా చంద్రబాబు మాత్రం ప్రైవేటుకే మొగ్గుచూపుతున్నారంటే కిక్ బ్యాక్‌ల కోసమేనని ఆరోపించారు. అధికారంలోకి రావడంతోనే దోపిడీకి వ్యూహ రచన చేసిన చంద్రబాబు, పెండింగ్ పనులు పూర్తి చేయకుండా సేఫ్ క్లోజ్ పేరుతో పక్కనపెట్టేశారని ఆమె మండిపడ్డారు. ఏడాదికి రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని, ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆ డబ్బు వెచ్చించలేదా అని ప్రశ్నించారు.
నిధులు వెచ్చించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడే పీపీపీ మోడల్‌కి వెళ్లాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిందని, రూ. 2.66 లక్షల కోట్ల అప్పుల్లో రూ. 5 వేల కోట్లు ప్రభుత్వానికి భారమా అని నిలదీశారు. పీపీపీ విధానమే మేలని పార్లమెంట్ స్థాయీ సంఘం చెప్పినట్టు చంద్రబాబు, అండ్ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ విషయం నివేదికలో ఎక్కడుందో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టాండింగ్ కమిటీ నివేదికపై వైయస్సార్సీపీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకి మాజీ మంత్రి సవాల్ విసిరారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరుగుతున్న అవినీతిపై లోతైన విచారణ చేసి దోపిడీని వెలికితీస్తామని, అందులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల పీపీపీ ముసుగులో దోచుకోవాలని ముందస్తుగా వేసుకున్న దోపిడీ లెక్కల ప్రకారమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడని దీనికి భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని స్థాయీ సంఘం వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని అభిప్రాయపడింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు కృషి చేయాలని సిఫార్సు చేసింది.
పార్లమెంట్ స్థాయీ సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చెప్పలేదు. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించి, ఒక్కో కాలేజీకి 50 ఎకరాల భూమితోపాటు నిధులకు ఇబ్బంది లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌లతో టై అప్ చేయడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే.. వాటిని ప్రైవేటుపరం చేసుకోవచ్చని ఎక్కడా చెప్పలేదు. రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకునే ప్రభుత్వం ఏడాదికి రూ. 1000 కోట్లు ఖర్చు చేసి మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయొచ్చు.
ప్లగ్ అండ్ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి విపరీతంగా తాపత్రయపడుతున్నారు. మెడికల్ కాలేజీల ముసుగులో స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కాములపై లోతైన దర్యాప్తు జరిపిస్తాం. దీనివెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
పీపీపీ వద్దని నినదిస్తూ కోటి సంతకాలు చేసిన ప్రజల తీర్పును కూడా ధిక్కరించి దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీనివెనుక ఎవరున్నా వదిలేది లేదని మాజీ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు.