Suryaa.co.in

Andhra Pradesh

రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా చర్యలు

  • ఎరువుల స‌ర‌ఫ‌రాలో ఎటువంటి లోపాలు ఉండ‌కూడ‌దు
  • విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పర్యవేక్షణ ఉండాలి
  • స‌మీక్ష‌లో వ్య‌వ‌సాయ‌ రంగంలో డ్రోన్ల వినియోగంపై ప్ర‌ధాన చ‌ర్చ‌
  • డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి
  • ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

రైతుల‌కు ఎరువులు అందించ‌డంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. రైతన్న అధిక లాభాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్య‌వ‌సాయ శాఖ‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అంతేకాదు ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాల‌న్నారు.

ఈ-క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలని, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాల‌న్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ప్రధానంగా చర్చించారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాల‌న్నారు. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సూచించారు.

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మీక్ష‌లో వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE