-మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతోనూ మాట్లాడతా
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 15: గుడివాడ పట్టణంలో కొలిమి పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాల గుర్తింపునకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కమ్మరం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కంచర్ల జాన్ బాబు, మాజీ కౌన్సిలర్ బూసి ప్రకాశరావు, నాయకులు బొమ్మిడి వెంకటేశ్వరరావు, మోపిదేవి రామరాజు, బీ దిలీపుమార్, బొమ్మిడి జగన్మోహనరావు, మేడా పరమేశ్వరరావు, కే తుఫాన్, టీ వెంకటేశ్వరరావు, బీ లక్ష్మీనారాయణ, శిరిపురపు ప్రకాష్, జమ్మలమూడి జింబో, జడా బాబూరావు తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బూసి ప్రకాశరావు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో కొలిమి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు కమ్మరం కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇందుకు అవసరమైన స్థలాలను కేటాయించాలని మంత్రి కొడాలి నానిని కోరారు. ఆటోనగర్ ఏర్పాటు సమయంలో కమ్మరం కార్మికులు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా స్థలాలను కొనుగోలు చేయలేకపోయారన్నారు. ఏపీఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీ ద్వారా భూమిని సేకరించి, మౌలిక సదుపాయాలను కల్పించి 40 ఏళ్ళుగా కమ్మరం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు అందజేయాలన్నారు. అభివృద్ధి చేసిన స్థలాలకు రేటును నిర్ణయిస్తే కొనుగోలు చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుడివాడలో కమ్మరం కార్మికులు తయారుచేసే వ్యవసాయ పరికరాలకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని, స్థలాలు ఇచ్చి ప్రోత్సహించాలని బూసి ప్రకాశరావు కోరారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పామర్రు రోడ్డులో గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు దగ్గర నుండి గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు ఫ్లై ఓవరు నిర్మిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం రోడ్డులో మల్లాయిపాలెం పరిధిలో దాదాపు 17 వేల మందికి ఇళ్ళపట్టాలను కేటాయించామన్నారు. ఈ ప్రాంతం కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతోందన్నారు. ఆటోనగర్ విస్తరణకు కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. రిజర్వ్ సైట్లను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం కుదరదని చెప్పారు. గుడివాడను ఆనుకుని, తక్కువ ధరకు భూమి లభిస్తే కమ్మరం కార్మికులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో మాట్లాడి కొలిమి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడతానన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం క్రాంతికుమార్, మన్నేపల్లి ప్రేమ్ కుమార్, చినసత్యానందం, సోలి, బీ సంపత్ కుమార్, కే జోసఫ్ రాజు, ఎం పౌలు, ఎం చిట్టిబాబు , టీ నాని, కే రామయ్య, కే విజయరాజు, వైసిపి నాయకులు మెండా చంద్రపాల్, కందుల నాగరాజు, నగుళ్ళ సత్యనారాయణ, తాళ్ళూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.