Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ గురుకులాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు

• విద్యార్థులందరికీ వైద్య నిపుణులతో పరీక్షలు
• అందుబాటులోకి అవసరమైన ఔషధాలు
• హెల్త్ సూపర్ వైజర్లు, కేర్ టేకర్ల నియామకానికి చర్యలు
• సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశాలు

అమరావతి, సెప్టెంబర్ 10: ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న హెల్త్ సూపర్ వైజర్లు, హాస్టల్ కేర్ టేకర్ల ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.

డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులతో సమావేశమై సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో గురుకులాల్లో తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గురుకులాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి ప్రాథమిక చికిత్సలు చేయడానికి అవసరమైన ఔషధాలను అందుబాట్లో పెట్టుకోవాలని కోరారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల నుంచి గురుకులాలకు ఇచ్చే ఔషధాలు సరిపోకపోతే అవసరమైన ఔషధాలను బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాలని చెప్పారు.

దీనికి అవసరమైన నిధులను గురుకులాల బడ్జెట్లో ప్రతిపాదించాలని సూచించారు. ప్రస్తుతం గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గురుకులం విద్యార్థులు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని కోరారు. వైద్యనిపుణులతో విద్యార్థులకు పరీక్షలు చేయించి వారిలో వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సలు చేయించాలని మంత్రి ఆదేశించారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సక్రమించే వ్యాధులు రావడానికి అవకాశం ఉన్న విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

విద్యాసంస్థల ఆవరణలో అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా చూడాలన్నారు. గురుకులం విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పారు. పిల్లలు తరగతుల నుంచి డార్మెంటరీలకు, మెస్ లకు వెళ్లే దారుల్లో బురద లేకుండా చూసుకోవడంతో పాటుగా పాఠశాలల ఆవరణలో రాత్రిళ్లు ఎక్కడా చీకటి ఉండకుండా అవసరమైన దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు.

గురుకులం విద్యార్థులకు ఇన్స్యూరెన్స్ చేయించాలని నాగార్జున సూచించారు. గతంలో సెర్ప్ ద్వారా విద్యార్థులకు అమలు చేసిన ఇన్స్యూరెన్స్ ను పునరుద్ధరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రతి విద్యాసంస్థలోనూ తప్పనిసరిగా హెల్త్ సూపర్ వైజర్, హాస్టల్ కేర్ టేకర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న హెల్త్ సూపర్ వైజర్, కేర్ టేకర్ పోస్టులను ఆప్కాస్ ద్వారా భర్తీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేర్ టేకర్లు తప్పనిసరిగా హాస్టల్ లోనే ఉండేలా చూడాలని గురుకులం అధికారులను నాగార్జున ఆదేశించారు. ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వం ప్రకటించిన మెనూ పటిష్టంగా అమలైయ్యేలా చూడాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు.

డీసీఓలు ఈ వ్యవహారాలను పర్యవేక్షించాలని సూచించారు. డీసీఓల పర్యవేక్షణా లోపం కారణంగా గురుకుల విద్యార్థులు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గురుకులాలకు సంబంధించి నిర్మాణాలు పూర్తయిన భవనాలను ప్రారంభించడానికి, అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని నాగార్జున అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఇంచార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి, గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE