Suryaa.co.in

Editorial

మార్కెట్‌లో మెడి ‘కిల్‌’ మాఫియా

– బ్రాండెడ్‌ కంపెనీలకూ డూప్లికేట్ల ముద్ర
– హైదరాబాద్‌ టు నెల్లూరుకు నకిలీ మందుల రవాణా
– బెజవాడ వన్‌టౌన్‌లో డూప్లి‘కేట్ల’ డెన్‌
– హైదరాబాద్‌ నుంచి కారుచౌకగా డ్రగ్స్‌ కొనుగోలు
– హైదరాబాద్‌లో ఫ్యాక్టరీలను తనిఖీ చేయని అధికారులు
– బిల్లులు లేకుండానే నార్కొటిక్‌ డ్రగ్స్‌ అమ్మకాలు
– గతంలోనే కోడైన్‌ సిరప్‌ దుర్వినియోగం
– అధికారుల దాడుల్లో బట్టబయలైన అమ్మకాలు
– బెజవాడలో డ్రగ్‌ కంట్రోలర్‌ దాడుల్లో వెలుగుచూసిన నకిలీలలు
– గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, తెనాలి కేంద్రాలుగా అమ్మకాలు
– అక్కడి నుంచే దేశ వ్యాప్తంగా పంపిణీ
– కోట్ల రూపాయల్లో వ్యాపారం
– వందల సంఖ్యలో మెడికల్‌ కార్పొరేషన్లు
– మామూళ్ల మత్తులో అధికారులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మీరు తలనొప్పికి టాబ్లెట్‌ వేసుకుంటున్నారా? దగ్గుకు ఏమైనా సిరప్‌ వాడుతున్నారా? కడుపునొప్పికి ఏదైనా టాబ్లెట్‌ వాడుతున్నారా? సదరు మందుల కంపెనీ పేర్లు చూడకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఏదో ఒకటిలే అని ఏదో ఒక దగ్గు మందు ఇవ్వమని అడుగుతున్నారా?.. అయితే మీరు నూరుశాతం డేంజర్‌లో పడినట్లే. అంటే మీరు డబ్బులిచ్చి రోగాలు కొనుకుంటున్నట్లే లెక్క!

ఎందుకంటే మార్కెట్‌లో మెడికల్‌ మాఫియా మహత్యం అది. ఏది అసలు-ఏది నకిలీనో కనిపెట్టలేనంత రొంబ మోసం, మెడికల్‌ షాపుల్లో జరుగుతోంది. అధికారులు ‘మామూళ్ల టాబ్లెట్‌’ వేసుకుని పడుకోవడంతో, మార్కెట్‌లో డూప్లికేట్లు రాజ్యమేలుతున్నారు.

ఒకటి కాదు. రెండు కాదు. వందల మెడికల్‌ షాపులు నకిలీ మందుల అమ్మకాలతో కోట్లకు పడగలెత్తాయి. తాజాగా బెజవాడలో తమకు అందిన సమాచారం మేరకు.. మెడికల్‌ షాపులపై దాడులు చేసిన అధికారుల కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. బ్రాండెడ్‌ కంపెనీలకూ నకిలీ ముసుగేసి, హైదరాబాద్‌ టు నెల్లూరు వరకూ చేస్తున్న మందులు, కుప్పలు తెప్పలుగా దొరికాయి. మరి ఇన్నేళ్లూ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. ఈవిధంగా ఇన్నేళ్లూ ఏ స్థాయిలో మందులు చలామణి అయ్యాయో ఊహిస్తేనే గుండె బద్దలవుతుంది.

ఏపీలో నకిలీ మెడికల్‌ మాఫియా స్వైరవిహారం చేస్తోంది. అసలు కంపెనీలకు నకిలీ ముద్రేసి, జనాలకు అమ్మేస్తున్న మెడికల్‌ మాఫియా గుట్టురట్టయింది. అయితే, కొన్నేళ్లుగా విజయంతంగా సాగుతున్న ఈ దందాతో ఇప్పటికే కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, హైదరాబాద్‌ను తయారీకేంద్రంగా ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో ఉన్న, మెడికల్‌ తయారీ పరిశ్రమల నుంచి తయారవుతున్న ఈ నకిలీ మందులు గుంటూరు, తెనాలి, విజయవాడ, ఒంగోలు మీదుగా నెల్లూరు వరకూ ఉన్న మెడికల్‌ షాపుల్లో చేరుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వందల సంఖ్యలో మెడికల్‌ కార్పొరేషన్లు ఉండటం గమనార్హఐ.

అంటే దీన్నిబట్టి హైదరాబాద్‌లోని డ్రగ్‌ అధికారులు- మెడికల్‌ శాఖ అధికారులు కూడా.. మెడికల్‌ తయారీ ఫ్యాక్టరీలలో ఏం తయారుచేస్తున్నారో, తనిఖీలు చేయడం లేదని స్పష్టమవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. మార్కెట్‎లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ , డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా డూప్లికేట్ మందుల వ్యవహారం బయటపడింది.

ప్రముఖ బ్రాండ్స్‎కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్‎వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. రెగ్యులర్‎గా వాడే కార్డియాక్ ,ఫీవర్ ,అల్సర్ ,బీపీ, షుగర్, గ్యాస్, పెయిన్ లాంటి అన్ని మందులో కల్తీ వచ్చాయి. భారీ ఎత్తున డూప్లికేట్ మందులు గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు.

ఇందులో పలువురు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ నుండి విజయవాడ గుంటూరు ,నెల్లూరు లాంటి మేజర్ సిటీలకు ఈ డూప్లికేట్ మందులు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న మందుల శాంపుల్స్ తీసి అధికారులు ల్యాబ్ కు పంపుతున్నారు.

ఈ డూప్లికేట్ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాండెస్ బ్రాండెడ్ మందులంటూ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రీకాల్ చేయబడిన స్టాక్ అన్ని నమూనాలను విశ్లేషణ కోసం డ్రగ్ కంట్రోల్ లాబొరేటరీకి పంపారు. గతంలో కోడెయిన్ సిరప్స్ మిస్యూజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా నార్కోటిక్ డ్రగ్ ఉన్న మెడిసిన్స్ ను, ఎలాంటి బిల్స్ లేకుండా అమ్మేస్తున్నారు.

విచ్చలవిడిగా లైసెన్స్ లేని మెడికల్ షాప్స్ బిల్ లేని మందులు అమ్మకాలు ,కొనుగోలు జరుగుతున్నట్లు గుర్తించారు. మత్తుకు బానిసైన వారికీ బిల్స్ లేకుండానే డ్రగ్స్ కంటెంట్ ఉన్న మందుల అమ్మేస్తున్నారు. బెజవాడలో కూడా భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్ టౌన్ ,గొల్లపూడిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు చేశారు. తనిఖీల్లో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి.

గొల్లపూడి ,వాసవి ఫార్మా కాంప్లెక్ ,వన్ టౌన్ లో నకిలీ మందులు గుర్తించారు. తక్కువ ధరకు హైదరాబాద్ నుండి కొనుగోలు చేసి అమ్మకాలు జరుగుతున్నట్లుగా నిర్దారించారు. లైసెన్స్ లేని వ్యక్తులు వ్యాపారం చేసిన అనధికారికంగా మందులు అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఏ బిల్స్ లేకుండా మందులు కొనుగోలు చేసి హోల్ సెల్ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు . ఇలా అమ్మకాలు చేస్తున్న కృష్ణ మూర్తి ,నీలి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

బెజవాడలో బయటపడ్డ ప్రముఖ కంపెనీలకు సంబందించిన కల్తీ మందుల లిస్ట్

Zerodol SP టాబ్లెట్లు-FND08204, Omez D క్యాప్సూల్స్-E2202549, IPCA లేబొరేటరీస్-డా.రెడ్డీస్ లాబొరేటరీస్, పాన్‌టాప్ DSR క్యాప్సూల్స్- SPG22104, అరిస్టో ఫార్మాస్యూటికల్స్, రోసువాస్ 10-SID3056A, SIE0021A, SIEOL16A సన్ ఫార్మా లాబొరేటరీస్ లిమిటెడ్, రోసువాస్ 20mg మాత్రలుSID2213A, SIE0085A, రోసువాస్ 40mg టాబ్లెట్లు- SID1951A, SIE0022A, Gluconorm Gluconorm20 Gluconorm6
U300143, గ్లూకోనార్మ్ G2 టాబ్లెట్‌లు-U202610,U300577 లుపిన్ లిమిటెడ్, గ్లూకోనార్మ్ G4 ఫోర్టే టాబ్లెట్‌లుU201992,UJ00043,N2201549, గబాపిన్ NTటాబ్లెట్‌లు -ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్-201220200120 టెల్మా 40ఎంజి, మాత్రలు- 18220890 గ్లెన్‌మార్క్, టెల్మా హెచ్ టాబ్లెట్లు-18220172 18220197 గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, టెల్మా AM టాబ్లెట్లు-18230073, చైమోరల్ ఫోర్టే టాబ్లెట్లు-2KU6J025, 2KU6K003,
Flavedon MR టాబ్లెట్లు-RV052204,ME052202,RV052211 సర్వియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమరిల్ M2
టాబ్లెట్‌లు-3NG403 సనోఫీ ఇండియా లిమిటెడ్.

కాగా ఈ మందులు ఇప్పటికే ఎన్నో ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండాలి. ఆ బ్యాచ్‌ మందులు ఎక్కడెక్కడికి వెళ్లాయో విచారించి, వాటిని సీజ్‌ చేయాల్సిన అధికారులు.. ఇంకా దానిపై దృష్టి సారించనట్లు కనిపించడం లేదు. అసలు ఎన్ని బ్యాచ్‌లు మార్కెట్‌లో ఉన్నాయన్నది ఆందోళనకర ప్రశ్న.

అసలు ఇవి ఉప్పల్‌, రామంతపూర్‌ వంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలతోపాటు.. హైదరాబాద్‌లో ఇంకా ఏ ఫ్యాక్టరీలలో తయారవుతున్నాయి? వీటికి సూత్రధారులెవరన్న దానిని నిగ్గుతేల్చకపోతే.. మెడికల్‌ మాఫియాకు సామాన్యుడు సమిథగా మారే ప్రమాదం లేకపోలేదు.

LEAVE A RESPONSE