ఇదేం అత్యుత్సాహంరా బాబూ..

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనో పోలీసాఫీసర్. కర్నాటకలో రోడ్డుపక్కనున్న కూరగాయల మార్కెట్‌కు సతీసమేతంగా వచ్చి, కూరగాయలు కొనే పనిలో ఉన్నారు. ఇంతలో పోలీసు వాహనం చూసి ఓ చానెల్‌కు చెందిన రిపోర్టరు..

‘ఈయన సర్కారు వాహనాన్ని ఎలా వాడుకుంటున్నారో చూడండీ’ అంటూ కెమెరాను అటు ఫోకస్ చేశాడు. అంతే.. సదరు పోలీసాఫీసరు పాపం.. కారులో భార్య ఉన్నదన్న విషయం కూడా మరచిపోయి, పరుగులు తీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

పాపం.. ఆ ఆఫీసరెవరో సత్తెకాలపు సత్తయ్యలా ఉన్నాడు. అదే మన హైదరాబాద్‌లో డజన్ల సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల దగ్గర కెమెరాలు కన్నేస్తే.. డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపిఎస్ వాహనాల నుంచి తమ పుత్ర-పుత్రికారత్నాలు దిగుతూ కనిపిస్తుంటారు. స్టేడియం, జిమ్ముల దగ్గర సర్కారు వాహనాలు దర్శనమిస్తుంటాయి. షాపింగ్ మాల్స్ దగ్గర ఐఏఎస్-ఐపిఎస్ భార్యలు సకుటుంబ సపరివార సమేతంగా, సర్కారు వాహనాలను రోడ్డు పక్కన పెట్టి షాపింగ్ చేస్తూ కనిపిస్తుంటారు.

బహుశా ఇలాంటి న్యూసులు తెలియకనే, సదరు కర్నాటక పోలీసాఫీసరు రిపోర్టరును చూసి పరుగులు తీసి ఉంటారు. అదే ముదురు ఆఫీసరు అయి ఉంటే.. ఏందిరా భాయ్ నీ కత? ముందు ఆ కెమెరా ఇటువ్వు’ అని గుంజేసుకునేవారు. సదరు ఆఫీసరు పాపం ఇంకా అంత ముదిరినట్లుగా కనిపించలేదు.

ఆయన పరుగుల వార్త కాసేపు పక్కనపెడితే.. అయినా.. సదరు ఆఫీసరుకు కేటాయించిన కారులో వెళ్లి, కూరగాయలు కొంటే తప్పేమిటన్నదే అందరి సందేహం. కారులో పుణ్యానికి పెట్రోలు, కూరగాయలు కొని డబ్బులు ఎగ్గొడితే విమర్శించాలే తప్ప, దారిలో కూరగాయలు కొంటే ఈ శూలశోధనేమిటన్నదే అర్ధంగాని విషయం. ఇలాంటి అతి చేష్టల వల్లే ప్రజల్లో మీడియాకు గౌరవం తగ్గిపోతోందనన్నది కొందరు నెటిజన్ల కామెంట్. కానీ.. తానేదో తప్పు చేసినట్లు.. అతగాడు కూడా కెమెరాను చూసి, పరుగులు తీయడమేమిటన్నది మరో ఆశ్చర్యం.

పాపం.. సదరు కన్నడ పోలీసాఫీసరుకు మర్యాద-భయం ఎక్కువా? లేక కొత్తగా సర్వీసులో చేరారో తెలియదు గానీ… చాలా సున్నిత మసస్కుడిలా కనిపిస్తున్నారన్నది నెటిజన్ల ఉవాచ. ఏది ఏమైనా పోలీసు ఆఫీసర్ నుంచి రాజకీయ నేతల అవతారమెత్తిన వాళ్లే, నిస్సిగ్గు-నిర్లజ్జగా వీడియోల్లో అన్నీ ‘విప్పి చూపిస్తున్న’ ఈ కలికాలంలో.. ఇలాంటి అమాయకపు పోలీసు అధికారి కూడా ఉండటమే వింత. ఏమంటారు?

Leave a Reply