Suryaa.co.in

Andhra Pradesh

అభినవ నీరోలాంటి జగన్ ను కీర్తించడానికి ఇది నియంతృత్వం కాదు

– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కాలవ శ్రీనివాసులు

రాష్ట్ర సమాచార శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ పాత్రికేయుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటాన్ని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కాలవ శ్రీనివాసులు తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కావాలంటే సీఎం జగన్ రెడ్డిని ఆరాధించాలని చెప్పడం మంత్రి దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. అభినవ నీరోలాంటి జగన్ ను కీర్తించడానికి ఇది నియంతృత్వం కాదని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న వాస్తవాన్ని మంత్రి మర్చిపోయినట్లున్నారన్నారు.

ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, ఆరా తీయడం పాత్రికేయుల విధి అని పేర్కొన్నారు. వైకాపా బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల ఇప్పటికే అధికార పార్టీ అకృత్యాలు, ప్రభుత్వ అసమర్థ, అవినీతి చర్యలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. విధి నిర్వహణలో పాత్రికేయులు ప్రస్తుతం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారన్నారు.

నిజాలను నిర్భయంగా చాటే అవకాశం రాష్ట్రంలో లేదన్నారు. పౌర సమాజాన్ని చైతన్యం చేసే పనిలో జర్నలిస్టులు మరింత క్రియాశీలం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మూడేళ్ళ ముచ్చట ముగిసిందని ముందున్నదంతా మొసళ్ళ పండగేనన్న వాస్తవాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు. అయినా జగన్ ఆరాధనకు ఆస్థాన భజన బృందంగా మంత్రిమండలి ఉండనే ఉంది కదా అని కాలవ ఎద్దేవాచేశారు. జర్నలిస్టులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మంత్రి తక్షణం పాత్రికేయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కాలవ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE