-చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరం
-కేసీఆర్ దయతో భీంగల్ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న 100 పడకల ఆసుపత్రి
-పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భీంగల్: భీంగల్ మండల కేంద్రము లో చేయూత స్వచ్చంద సేవా సంస్థ స్థాపకులు డాక్టర్ మధుశేఖర్, 45 నిష్ణాతులైన వైద్యులతో ఏర్పాటు చేసిన ఉచిత సర్జికల్ మరియు మల్టీ స్పెషాలిటీ హెల్త్ చెకప్ మెగా క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్బంగా శిబిరంలో అందనున్న వైద్య సదుపాయాలు, శస్త్ర చికిత్సలు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 2001 సంవత్సరం నుండి చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా పేద ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ వైద్యం అందిస్తున్న డాక్టర్ మధు శేఖర్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ డాక్టర్ వసంత్ రెడ్డి పనితీరు,పేద ప్రజల పట్ల వారు చూపించే ఔదార్యం పట్ల మంత్రి ప్రశంసలు కురిపించారు.
వైద్య వృత్తి ఎంతో గొప్పది.. డాక్టర్ దేవునితో సమానమని మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు.చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కేసిఆర్ దయతో భీంగల్ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రి వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
అప్పటి వరకు డాక్టర్లు ఇట్లాంటి హెల్త్ క్యాంపులు పెడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,తన వంతుగా సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి వారితో అన్నారు. 100 పడకల ఆసుపత్రి పూర్తి అయిన తర్వాత కూడా మల్టీ స్పెషాలిటీ సేవలు అందేలా నిస్టాతులైన డాక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయా విభాగాల ప్రత్యేక వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందేలా చూడాలని,అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిద్దమని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు శేఖర్,వసంత్ రెడ్డి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి,పలువురు డాక్టర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.