ఈనెల 6న నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర జల శక్తిశాఖ వీడియో సమావేశం
విజయవాడ,2 డిశంబరు:కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం మరియు నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ,కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఎపి,తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారు లతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది.
ఈ అంశాలపై శనివారం ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో సమావేశం నిర్వహించారు.అయితే తెలంగాణా సిఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారని కావున ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.
అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఎపి ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీ సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు.అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు.
కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపి,తెలంగాణా రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
కావున ఈనెల 6వ తేదీన అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని ఆమె పునరుద్ఘాటించారు.
విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరించడం రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తా మని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇఎన్సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.