-ఆత్మీయ వాతావరణంలో సంబురంలా సాగిన సభలు
-రాష్ట్రంలోని ప్రతి జనావాసంలో ఎగిరిన గులాబీ జెండా
– పకడ్బందీగా ప్రణాళిక బద్ధంగా నిర్మాణాత్మకంగా జరిగిన సభలు
-ఒకేరోజు 119 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్లీనరీ తరహాలో ఘనంగా జరిగిన సభలు
-4 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను ఉత్తేజితులను చేసిన సభలు
-బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపైన, కేంద్ర వైఫల్యాల పైన విస్తృతంగా చర్చ-తీర్మానాలు
-ఈ సమావేశాల్లో అందుకున్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్
-నియోజకవర్గ ప్రతినిధుల సభలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలను అద్భుతంగా నిర్వహించిన పార్టీ యంత్రాంగానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో జరిగిన సభలను ఒక ఆత్మీయ వాతావరణంలో క్రమశిక్షణతో నిర్వహించడంలో కీలక పాత్ర వహించిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, పార్టీ పరిశీలకులకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జనావాసాల్లో ఈరోజు గులాబీ పతాకాన్ని ఎగురవేసి ..జెండా పండుగను సంబరంగా నిర్వహించిన లక్షలాది పార్టీ కార్యకర్తలందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జరిగిన పార్టీ ప్రతినిధుల సభ ద్వారా .. కీలకమైన దాదాపు నాలుగు లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాల విషయంలో ఒక గొప్ప నిర్మాణాత్మక సందేశం అందిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించిన తరహాలో ..ఇలా ఒకేరోజు పకడ్బందీగా నాలుగు లక్షల మంది కార్యకర్తలను కలుపుకుంటూ 119 నియోజకవర్గాల్లో ఇంత భారీగా సమావేశాలు నిర్వహించిన అంశం, దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన మైలురాయి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల ద్వారా తీర్మానాల రూపంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన విస్తృతమైన చర్చ జరిగిందని, దీంతోపాటు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు కూడా కూలంకషంగా చర్చకు వచ్చాయన్నారు.
119 నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో వందలాది తీర్మానాల రూపంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు గట్టి సందేశాన్ని ఇచ్చాయన్నారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో సమావేశాల్లో అందుకున్న సందేశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా.. పార్టీ శ్రేణులు తీసుకెళ్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం అయన చేశారు.
ప్రతినిధుల సభ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన విధానాలను, ముఖ్యమంత్రి నాయకత్వ పటిమను, వాటి ద్వారా అందుతున్న ఫలాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని, ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.