Suryaa.co.in

Telangana

మేఘా కృష్ణారెడ్డి రేవంత్ గులాంగిరీ

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్
– సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే దమ్ముందా?
– మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా?
– నా అరెస్ట్ కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరు తున్నారు
– ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి’ అంటూ వచ్చిన వార్తను జత చేసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరు తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయ పడ్డారు. ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి..?’ అంటూ వెలుగు పత్రికలో వచ్చిన వార్తను తన ట్వీట్‌లో జత చేశారు.

తన అరెస్ట్ కోసం సీఎం వేచి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. కానీ, సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ముందా..? మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ముందా..? ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయడానికి దమ్ముందా..? పై వాటిని చేసే దమ్ముందా..? లేదా..? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి ‘మేఘా’కు గులాంగిరీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

అరెస్ట్‌ లను ఖండిస్తున్నా: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు చేస్తున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండి పడ్డారు. ఈ అరెస్ట్‌లను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు.

ప్రజా పాలన అంటూ అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌ల పేరుతో నిర్బంధానికి గురి చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ప్రభుత్వం కాల రాస్తోందన్నారు.

ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిర్బంధం లోకి తీసుకున్న తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.

LEAVE A RESPONSE