నెల్లూరు: నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ని అతడితో కలిసి నమ్మి నిర్జన ప్రాంతానికి వెళ్లిన ఉషను కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె గాజులు పగిలి రక్తం కారుతున్న ఆ దుర్మార్గుడు కనికరం చూపించలేదు. అంతటితో ఆగకుండా ఈ కీచక పర్వాన్ని అతని మిత్రుడిచే వీడియో తీయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కలువాయి ప్రాంతంలో వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మరో నిందితుడు శివకుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శివకుమార్‌పై గతంలో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని కఠినంగా శిక్షించాలని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్పీని కోరారు.