– హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్నికలిగించిందని, ఆధ్యాత్మికంగా అనిపించిందని, మనస్సుకు శాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని, జీవితం ధన్యమవుతుందని భావిస్తారని భక్తులందరు ఎంతో భక్తి తో, ఆత్రుతతో స్వామి వారి దర్శనానికి వస్తారని దత్తాత్రేయ అన్నారు. ఈ పర్వదినానికి ఒక రోజు ముందు స్వామి దర్శన టిక్కెట్ల కోసం ఆశతో వచ్చిన ఆరుగురు భక్తులు మరణించిన విషాదకర సంఘటన తనకు బాధ కలిగించిందని, ఇది మానవ తప్పిదమేనని అభిప్రాయపడ్డారు. అధికారులు, ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల నమ్మకాన్ని కాపాడాలని కోరుతున్నట్టు తెలిపారు.
దేశంలో భారతీయ సాంస్కృతీసంప్రదాయాలు, ఆచారాలు అన్నింటినీ కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, ఇది పాతతరం వారు కొనసాగిస్తున్నప్పటికీ కొత్త తరం వారు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ సాంస్కృతీసంప్రదాయాలు సరైన విధంగా బోధపడాల్సిందని, వాటి కోసమే మాతృభాషలోనే విద్యా బోధన చేస్తేనే సరైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
రామాయణ, మహా భారత, భాగవతం, పురాణాలు, వేమన శతకం, సుమతి శతకం, వేదాలు వంటి నీతి శాస్త్రాలు అధ్యయనం కావాలంటే దేవభాష ఐన సంస్కృతమే ప్రధానమని, ఇది అందరికీ సులభం కాదు కనుక మాతృభాషలోనే వాటి సారాంశం గ్రహించకలుగుతాయన్నారు. అందుకనే జాతీయ విద్య విధానం-2020 లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక, మాధ్యమిక బోధనలలో మాతృభాషలోనే బోధించాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషిచేస్తున్నారని దత్తాత్రేయ గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ మాతృభాషలో విద్యాబోధనకు చొరవ తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మరింత శక్తిని కల్పించి, వారు సంకల్పించిన 2047 లో వికసిత్ భారత్ విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్దించినట్టు బండారు దత్తాత్రేయ తెలిపారు.