Suryaa.co.in

Editorial

జగన్ జెండా పీకేస్తారా?

– కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం?
– షర్మిల అడ్డుకోవడంతో నిలిచిన విలీనం?
– వచ్చే ఏడాదికి కాంగ్రెస్‌లో కలవడం ఖాయమేనన్న బాలినేని
– బాలినేని వ్యాఖ్యలపై వైసీపీలో గందరగోళం
– అనుచరుల వద్ద బాలినేని వ్యాఖ్యలంటూ రచ్చ
-ఇప్పటిదాకా దానిని ఖండించని బాలినేని, జగన్
– అంటే మౌనం అంగీకరమేనా?
– విలీనం కంటే ముందే కాంగ్రెస్‌లో చేరాలా? కూటమిలో చేరాలానని చర్చ
– జాతీయస్ధాయిలో రక్షణ కోసమే జగన్ విలీనమా?
– ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో జగన్ భేటీలు?
– రాయబారం నిర్వహిస్తున్న ఓ తెలంగాణ మంత్రి?
– ఆ మంత్రి కంపెనీకే మళ్లీ ఏపీలో కాంట్రాక్టుల కొనసాగింపు
– అందుకే బెంగళూరులో మకాం?
– వైసీపీ విలీనంపై సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రా రాజకీయాల్లో తండ్రి ఇమేజ్‌తో తెరపైకొచ్చి.. తల్లి-చెల్లితో కాలుబెట్టి.. వందలు, వేలు, లక్షలమంది అభిమానులను సంపాదించుకుని.. సీఎం గద్దెనెక్కి అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత అడుగులు.. ఇకపై ఢిల్లీ సోనియా దస్ జనపథ్‌కు దగ్గరవుతున్నాయా?.. అంటే జగన్ జెండా పీకేస్తారా? జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, రాజకీయ రక్షణ కోసం కాంగ్రెస్‌లో ఒదిగిపోవడమే ఉత్తమనన్న నిర్ణయానికి వచ్చారా?

అంటే వైసీపీని కాంస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమవుతున్నారా? అందుకు ఇప్పుడు ‘చెల్లెలు పాప షర్మిల’ తాత్కాలికంగా అడ్డుపడినప్పటికీ, మరో ఏడాదికి వైసీపీ విలీనం ఖాయమేనా? జగన్‌కు సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విప్పిన ఆ గుట్టును, ఇప్పటివరకూ ఎవరూ ఖండించలేదంటే.. మౌనం సంపూర్ణాంగీకారమే! మరి వైసీపీ నేతల దారెటు? విలీనం కంటే ముందే ఎవరి దారి వారు చూసుకుంటారా? జగన్ తోనే కలసి కాంగ్రెస్ సముద్రంలో కలుస్తారా?.. ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైసీపీ జెండా పీకేస్తున్నారా? దాని స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారా? అన్న ప్రయత్నాలను చెల్లి షర్మిల అడ్డుకున్నారా? అయినా సరే వచ్చే ఏడాదిలోగా వైసీపీ దుకాణం మూసి, కాంగ్రెస్‌లో కలిసేందుకు జగన్ నిర్ణయించుకున్నారా?… జగన్‌కు సమీప బంధులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరుల వద్ద విప్పిన ఈ గుట్టు ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడి విజయం సాధించినప్పటికీ, జగన్ చెక్కుచెదరలేదు. కారణం తనకున్న రాజ్యసభ సభ్యుల బలం. ఎన్డీయేలో తనకున్న లైజనింగ్! అయితే ఆ కల కూడా చెదురుతోంది. ఇప్పటికి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

చివరకు పార్టీలో నెంబర్‌టూ, జగన్ కేసులో సహ ముద్దాయి విజయసాయిరెడ్డి సైతం.. తాను పార్టీ మారడం లేదు. జగన్‌తోనే ఉంటానని పాతివ్రత్యం నిరూపించుకోవలసిన పరిస్థితి. చివరాఖరకు జగన్‌తో ఎంతమంది ఎంపీలుంటారో తెలియని గందరగోళం.

ఇటు చూస్తే చెల్లెలు షర్మిల.. అధికార వియోగంలో ఉన్న తనపైనే ఇంకా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఇబ్బందికర పరిస్థితి. అటు చూస్తే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి మళ్లీ బలపడుతున్న వైనం. ఎన్డీఏలో టీడీపీ ఉన్నందున, ఇక బీజేపీపై ఆశలు వదులుకోవలసిందే. వ్యాపారస్తుడైన జగన్.. ఈ తీసివేతలు-కూడికలు బేరీజు వేసుకున్న తర్వాతనే, వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని మానసికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

అందులో భాగ ంగా జగన్ ఈపాటికే పలు విడతల్లో, కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తన తండ్రికి సన్నిహితుడైన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ లో తన పార్టీనుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి, ఇప్పుడు కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌తో సమానంగా చక్రం తిప్పుతున్న ఓ మంత్రితో, రాయబారం సాగిస్తున్నట్లు సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అసలు జగన్ తాడేపల్లి, హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో కాకుండా, బెంగళూరులోనే ఎక్కువకాలం ఉండటం వెనుక రహస్యం కూడా అదేనంటున్నారు. ‘జగన్ తాడేపల్లి, హైదరాబాద్ వస్తే ఆయన ఎవరిని కలుస్తున్నారో అందరికీ తెలుస్తుంది. పైగా హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో షర్మిల ఉండటంతో హైదరాబాద్‌లో ఉండలేని పరిస్థితి. అదే బెంగళూరులో ఉంటే ఎవరి దృష్టి పడదు. అందుకే ఆయన అక్కడే ఉంటున్నార’ని ఓ వైసీపీ కీలకనేత అసలు రహస్యం వెల్లడించారు.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు పొందడమే కాకుండా, ఆయన సిఫార్సుతో కేసీఆర్ సర్కారులో కాంట్రాక్టులు పొందిన ఆ మంత్రి సైతం, జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నది సోషల్‌మీడియా కథనాల సారాంశం. కాగా ఏపీలో జగన్ సర్కారు మారిన ప్పటికీ, జగన్ సన్నిహితుడైన ఆ తెలంగాణ మంత్రి కంపెనీకే మైనింగ్ సీనరేజీ కాంట్రాక్టులు కొనసాగిస్తుండటం మరో విశేషం.

కాగా.. వైసీపీ త్వరలో కాంగ్రెస్‌లో విలీనమవుతుందని.. జగన్ సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలుకు చెందిన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సోషల్‌మీడియాలో, గత రెండురోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘‘జగన్ వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడు. ఆమేరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ దానిని షర్మిల అడ్డుకోవడంతో ఇప్పటికి ఆగిపోయింది. కానీ వచ్చే ఏడాదికల్లా వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయమ’’ని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కానీ దానిని అటు బాలినేని గానీ, ఇటు జగన్ గానీ ఖండించకపోవడం బట్టి.. అది నిజమేనన్న ఆందోళన వైసీపీ నేతల్లో మొదలయింది. దానితో ముందుగానే కాంగ్రెస్‌లోకి వెళ్లాలా? జగన్‌తో వెళ్లాలా? అన్న చర్చ మొదలయింది. అయితే రాయలసీమకు చెందిన మెజారిటీ వైసీపీ నేతలు మాత్రం

అయితే ఇదంతా ఉత్తి ప్రచారమేనని, బీజేపీకి కాంగ్రెస్ బూచిని చూపి రాజకీయ రక్షణ సంపాదించేందుకు ఈ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘వాళ్లకు మతిభ్రమించింది. దానితో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్దం కావడం లేదు. ఏపీలో కాంగ్రెస్‌ను నాశనం చేసిన జగన్‌ను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారు? అసలు రాహుల్‌కు జగనంటేనే తగని కోపం’ అని కాంగ్రెస్‌లో ఓ కీలక నేత ప్రశ్నించారు.

LEAVE A RESPONSE