– జనంపై దండెత్తుతున్న కూటమి ఎమ్మెల్యేలు
– ఇసుక, మైనింగ్, పేకాట క్లబ్‌లలో వాటాలు
– పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల ఇలాకాల్లో ఇంకా ‘పాత వాసన’లే
– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తమ అర్హత చెప్పుకునే దుస్థితి
– టీడీపీ కార్యకర్తలను పట్టించుకోని పాత వైసీపీ ఎమ్మెల్యేలు
– టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలదే హవా
– సోమిరెడ్డిని వేధించిన పోలీసులకు పెద్దపీట
– కాకాణిని మెప్పించిన అధికారులకు పోస్టింగులు
– బాబును అర్ధరాత్రి నడిపించిన పోలీసులకు కీలక పోస్టింగులు
– అనపర్తి, అమలాపురంలో ఆ మంత్రిదే హవా
– గోదావరిలో పనులు ‘సాన’బెడుతున్న ఆ నేత
– మైనింగ్, శాండ్, ల్యాటరైట్‌లో ‘సాన’బెడుతున్న వైనంపై ఆగ్రహం
– జనసేన ఎమ్మెల్యేలున్న చోట అనాధగా మారిన టీడీపీ శ్రేణులు
– ఎన్నికల్లో కోట్లు ఖర్చయినందున రికవరీ చేసుకుంటున్నారట
– కూటమిని బద్నామ్ చేస్తున్న ఎమ్మెల్యేలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
బాబు రెక్కల కష్టం.. పవన్-లోకేష్ అవిశ్రాంత ప్రచారం.. అగ్రనేతల ఫేస్‌వేల్యూ.. కలగలసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వందరోజులయింది. మరి పార్టీ శ్రేణులు సంతోషంగా ఉన్నారా? ఆత్మగౌరవంతో ఉన్నారా? ‘ఇది మన ప్రభుత్వం’ అని సగర్వంగా ఫీలవుతున్నారంటే అంటే.. లేదు అన్నదే క్షేత్రస్థాయిలో వస్తున్న సమాచారం. దానికి కారణం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల తీరు!
ఏళ్ల తరబడి పార్టీకి పనిచేస్తున్న నేతలు.. ఎన్నికల ముందు పార్టీలో చేరి, ఎమ్మెల్యేలైన వారికి తమ అర్హతలు, శీలపరీక్ష నిరూపించుకోవలసిన దుస్థితి. ఇసుక, క్వారీ, బార్లలో వాటాలు దండుకుంటున్న కొందరు కూటమి ఎమ్మెల్యేలతో పరువు పోతున్న పరిస్థితి. పాలనలో కొడుకులు, కూతుళ్లు, బావలు, బామ్మర్దులదే పెత్తనం. ఇదీ నియోజకవర్గాల్లో కూటమి పాలనలో వందరోజుల క్షేత్రస్థాయి రిపోర్టు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వందరోజులవుతున్నా, టీడీపీ క్యాడర్ ఏ మాత్రం సంతృప్తి చెందని వైచిత్రి. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి చేరి, ఎమ్మెల్యేలయిన వారికి.. పార్టీ నేతల త్యాగాలు తెలియని పరిస్థితి. దానికి కారణం కూటమిలో సమన్వయలోపమేనన్నది నేతల వ్యాఖ్య. గోదావరి జిల్లాల్లో అసలు పార్టీతో ఏమాత్రం సంబంధం లేని ఓ లాబీయిస్టు, ఇప్పుడు అన్నింటా పెత్తనం చేస్తున్నారట.
జిల్లాలో ఇసుక, ల్యాటరైట్ సహా ఏ పనులుకావాలన్నా ఆయన దగ్గరకే వెళ్లాలట. ఎప్పటినుంచో పార్టీలో పనిచే స్తున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల స్థాయి నేతలు ‘సాన’బెడుతున్న ఆయన పెత్తనంపై ఫైరవుతున్నారు. గోదావరి జిల్లాల్లో సీనరేజీ సెస్ కాంట్రాక్టు వేరేవారికి వచ్చినప్పటికీ, అనధికారికంగా ఆయనే వసూలు చేస్తున్నారట.
ఇక పార్టీ అధినేత చ ంద్రబాబు విపక్ష నేత హోదాలో అనపర్తికి వెళ్లినప్పుడు.. ఆయనను అడ్డగించి, అర్ధరాత్రి నడిచివెళ్లేలా చేసిన ఒక సీఐ, ఇంకో ఎస్‌ఐలకు కీలకపోస్టింగులివ్వడంపై , స్వయంగా ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. మంత్రి సుభాష్ దన్నుతోనే వారికి ఆ పోస్టింగులు వచ్చాయన్నది వారి ఆగ్రహానికి కారణం. ఎన్నికలకు నెలరోజుల ముందు పార్టీలో వచ్చిన మంత్రి సుభాష్ , వైసీపేయులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన దగ్గర అంతా వైసీపీ వాసనలేవస్తున్నాయన్న చర్చ బహిరంగంగానే జరుగుతోంది.
ఇక నెల్లూరు జిల్లాలో.. టీడీపీకి మూలస్తంభమైన మాజీ మంత్రి సోమిరెడ్డిని ఐదేళ్లు వే ధించి, అప్పటిమంత్రి కాకాణిని మెప్పించిన సీఐ, ఎస్, రెవిన్యూ అధికారులకు కీలక పోస్టింగులు దక్కడంపై, పార్టీ వర్గాల ఆత్మస్థైర్యం దెబ్బతింది. కాకాణితో సత్సంబంధాలున్న అప్పటి వైసీపీ- ఇప్పటి టీడీపీ కీలకనేత, సిఫార్సుతోనే వారికి పోస్టింగులు వచ్చాయన్న చర్చ, నెల్లూరు జిల్లా పార్టీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతమంది పార్టీలో చేరి, తర్వాత పార్టీలు మారినా.. ఇప్పటివరకూ పార్టీ జెండా మోస్తున్న సోమిరెడ్డి లాంటి సీనియర్లకే ఈ పరిస్థితి ఉందంటే.. ఇక మిగిలిన వారి విషాదం గురించి చెప్పనక్కర్లేదంటున్నారు.
ఉభయ గోదావరి, ఇతర జిల్లాల్లో జనసేన గెలిచిన చోట, తాము అనాధలుగా మారమని టీడీపీ శ్రేణులు మొత్తుకుంటున్న పరిస్థితి. అసలు తమకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వారి ఫిర్యాదు. రాయలసీమలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేలైన వారి నియోజకవర్గాల్లో వారితో వచ్చిన వైసీపీ నేతలదే హవా. వారంతా టీడీపీ వారిని దగ్గరకు రానీయడం లేదన్నది ఫిర్యాదు. కాగా ప్రపంచంలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన ఓ నగరంలో, జనసేన ఎమ్మెల్యే చేస్తున్న వసూళ్లకు, జనం నెత్తీనోరూ బాదుకుంటున్నారట.
స్వామివారి దర్శనానికి తనతో తీసుకువెళుతున్న వీఐపీ భక్తులకు రేట్లు పెడుతున్నారట. తనకు స్పెషల్ ప్రొటోకాల్ ఇవ్వాలని ఈఓ, జేఈఓపై ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పటికే ఈ దర్శనాల వ్యవహారంలో మాజీ మంత్రి రోజా భ్రష్టు పట్టిపోగా, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఆ జాబితాలో చేరారట. ఇసుక యవ్వారంలో కూడా సారు చాలా ఫాస్టుగా ఉన్నారట. ఎన్నికల ముందు 80 కోట్లు పెట్టా. మరి రికవరీ చేసుకోవాలి కదా అని సెలవిస్తున్నారట.
ఇక వైసీపీ సర్కారు పేకాట క్లబ్‌లను తెరవకుండా కఠినంగా వ్యవహరిస్తే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేలదే ఇష్టారాజ్యమయింది. వారి అనుమతితో రాష్ట్రంలో అనేకచోట్ల అనధికార పేకాటక్లబ్బులు నడుస్తున్న పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర రాజధానిలోని రెండు జిల్లాల్లో, ఎమ్మెల్యేలదే ఇష్టారాజ్యమయిపోయింది. చివరకు ఇల్లు కట్టుకున్నా ఆపేయిస్తున్న దిగజారుడు పరిస్థితి. రియల్‌ఎస్టేట్ వెంచర్లు ఆపేయిస్తున్న వైనం. విజయవాడ నగరంలో ఏ ఎమ్మెల్యే బిల్డర్లకు టార్గెట్లు పెట్టారన్న ఆరోపణలున్నాయి.
కాగా వైసీపీ హయాంలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ మాజీ జర్నలిస్టు.. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకు సలహాదారుగా చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద.. ఐదేళ్లు టీడీపీపై విష ప్రచారం చేసిన ఓ టీవీ చానెల్ ప్రతినిధి పీఆర్వోగా చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా పార్టీ కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకుండా.. కే వలం కులం ప్రాతిపదికన జరుగుతున్న నియామకాలతో కార్తకర్తలు-నేతల మనోభావాలు గాయపడుతున్నాయన్నది కూటమి వర్గాల్లో జరుగుతున్న చర్చ.