– గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టినా.. మళ్ళీ ఇదేం ఖర్మరా బాబూ..!
– టూరిస్ట్ బాబు.. వీకెండ్ బాబులను 2024లో మరోసారి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధం.
– తాను పుట్టిన చిత్తూరు జిల్లాకు, రాయలసీమకు ఏ మేలూ చేయని సీమ ద్రోహి బాబు
– కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలన్న బుద్ధి, జ్ఞానం బాబుకు ఎందుకు కలగలేదు?
– బాబు పేరు చెబితే గుర్తొచ్చేవి వెన్నుపోటు, దగా, మోసం, వంచనలే..
– అన్ని సామాజికవర్గాలనూ దగా చేసిన బాబు
– 30 ఏళ్ళల్లో బాబు చేయలేని మేలును.. జగన్ పాలనలో 3 ఏళ్ళలో సాకారం
– రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
గత ఎన్నికల్లో తరిమికొట్టినా.. మళ్ళీ ఇదేం ఖర్మరా బాబూ..!
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు టూరిస్టుల్లా వస్తున్నారు ‘ఇదేం ఖర్మరా.. బాబూ’ అని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారు. తన పాలనను చూసి ఓటెయ్యండని చెప్పే దమ్ము, ధైర్యం లేని చంద్రబాబు, తన భార్యను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డ్రామాలు ఆడి, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చినా సింపతీ రాలేదు. దాంతో, బాదుడు అంటూ పర్యటనలు చేస్తే.. తనపై రాళ్లు వేశారంటూ మరో డ్రామా ఆడాడు. అది కూడా సక్సెస్ కాలేదు. చివరకు… తనకు ఇదే చివరి అవకాశం అని, ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు చంద్రబాబు అడుగుతున్నాడు.
1995లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 30 ఏళ్ల తర్వాత మళ్లీ చివరి ఛాన్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అని అంటుంటే.. రాష్ట్ర ప్రజలు ఇదేమి ఖర్మరా బాబు.. అని అంటున్నారు. ఎన్టీఆర్ తన జీవితంలో, తన జీవిత చరమాంకంలో ఏమనుకున్నాడు. ఇదేం ఖర్మరా చంద్రబాబూ అనే కదా..?తన కుప్పంలో శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం చూపించలేని చంద్రబాబు- ఈ రాష్ట్రంలో తాను ప్రారంభించి, తానే పూర్తి చేసిన ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే దానర్థం ఇదేం ఖర్మరా బాబు అనే కదా..?చంద్రబాబు పేరు చెబితే.. గుర్తుకు వచ్చే స్కీము ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే.. దాని అర్థం ఏమిటి, ఇదేం ఖర్మరా బాబు అనే కదా..?44 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు, రైతులకు చేసిన న్యాయం గానీ, మంచిగానీ ఒక్కటి కూడా గుర్తుకు వచ్చే పరిస్థితి లేదంటే… దాని అర్థం ఏమిటి.. ఇదేం ఖర్మరా బాబు అనే కదా..?
బాబు పేరు చెబితే గుర్తొచ్చేవి వెన్నుపోటు, దగా, మోసం, వంచనలే..
చంద్రబాబు పేరు చెబితే.. గుర్తుకు వచ్చేదేమిటి అంటే.. వెన్నుపోటు, దగా, మోసం, వంచన మాత్రమే అయినప్పుడు, ప్రజలంతా అదే చంద్రబాబును, ఈరోజు మళ్ళీ చూడాల్సి వస్తుంటే, అదికూడా ఒక టూరిస్టు బాబును, ఒక వీకెండ్ బాబును చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు..ఇదేం ఖర్మరా బాబు అనే కదా..?
టీడీపీకి 23 సీట్లు కూడా ఇవ్వడం తప్పైపోయిందని ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిని పూర్తిగా తరిమి కొట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళలు చంద్రబాబు గురించి ఏమనుకుంటున్నారు.. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని మోసం చేసి, డ్వాక్రా సంఘాలన్నింటినీ దెబ్బతీసిన చంద్రబాబు చూసి, మళ్ళీ ఇదేం ఖర్మరా బాబు అనే కదా..?
సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరుకుగానీ, సొంత ప్రాంతం రాయలసీమకుగానీ, ఏనాడూ మేలు చేయలేదని అక్కడి ప్రజలు 2014లో కూడా తిరస్కరించిన మాట నిజమే కదా.. కాబట్టి, రాయలసీమ అంతా ఇదేం ఖర్మరా బాబు అని అనుకుంటున్నారు.
బాబు వస్తే కరువు వస్తుందన్నది… ఆయన ప్రభుత్వం 2014-19 మధ్య ప్రకటించిన కరువు మండలాలను చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి, సగం మండలాలు కరువు ఉండే పరిపాలన చూసి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు.. తాగునీరు, సాగునీరు దొరక్కపోవడం.. పశువులు చనిపోవడం.. మనుషులు వలసపోవడం చూసి.. ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు.
రైతుల వడ్డీ భారం రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబుదే కదా.. ఉచిత విద్యుత్ ఇస్తే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న ఫిలాసఫీ చంద్రబాబుదే కదా.. మరి ఇలాంటి బాబు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే… ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే.. అరకొర ఫీజు రీయింబర్స్ మెంటు, అదికూడా బకాయిలు పెట్టి, ఎగ్గొట్టి, ఆ పథకాన్నే నిర్వీర్యం చేసిన చంద్రబాబును చూసి.. ఇదేం ఖర్మరా బాబు.. అనుకున్నారే తప్ప, ఏరోజు అయినా, విజనరీగా భావించారా..?
అన్ని సామాజికవర్గాలనూ దగా చేసిన బాబు
ఇక సామాజిక వర్గాలపరంగా చూస్తే.. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. బీసీలను మోసం చేశాడు. ఎస్సీలనూ మోసం చేశాడు. ఎస్టీలను దగా చేశాడు. మైనార్టీలకు భవిష్యత్తే ఉండకూడదనుకున్నాడు. మరి ఇలాంటి బాబుని సామాజికవర్గాలన్నీ ఇదేం ఖర్మరా బాబు.. అనుకున్నాయే తప్ప, అది గొప్ప పరిపాలన అని ఎవరన్నా అనుకున్నారా..?
– మరి, పార్టీ వ్యవస్థాపకుడికే నచ్చని, పార్టీ వ్యవస్థాపకుడికే ద్రోహం చేసిన, అధికారం వచ్చినప్పుడల్లా మోసం చేసిన చంద్రబాబు- ఈరోజు బయటకు వచ్చి, 30 ఏళ్ళల్లో తనవల్ల కానిది, 3 ఏళ్ళలో జగన్ గారి పాలనలో సాకారం అవుతుంటే… ఇదేం ఖర్మరా అని తనకుతానే అనుకుంటుంటే- ఎవరైనా బాబు గొప్పవాడని భావిస్తారా.. నమ్ముతారా..?
కర్నూలును న్యాయ రాజధాని చేయాలన్న బుద్ధీ, జ్ఞానం ఎందుకు కలగలేదు బాబూ?
కర్నూలు వెళ్ళి.. న్యాయ రాజధానికి వ్యతిరేకం కాదని అంటాడు. మరి, రాష్ట్రం విడిపోయినప్పుడైనా, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అయినా రాయలసీమ ప్రజల మనోభావాలను గౌరవించి, వారికి న్యాయం చేసేలా న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే బుద్ధి, జ్ఞానం ఎందుకు చంద్రబాబుకుకలగలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
జగన్ కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని హామీ ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం వికేంద్రీకరణ బిల్లు పెడితే.. దాన్ని వ్యతిరేకించింది మీరు కాదా. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, బాదుడు అని, ఖర్మ అని.. పర్యటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. కర్నూలులో విద్యార్థులు, న్యాయవాదులు.. గో బ్యాక్ బాబూ.. అంటే వారిపై ఏవిధంగా నోరు పారేసుకున్నాడో అందరూ టీవీల్లో చూశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన భాషా అది? ఆ బాడీ ల్వాంగేజ్ ఏవిధంగా ఉందో చూశాం. ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబుకు ఫ్యూజులు ఎగిరిపోయి, బుర్ర పనిచేయడం లేదు. అందుకే నోటికి ఏది వస్తే అది, ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు. చివరకు ప్రజలను కూడా దూషిస్తున్నాడు. దీనినిబట్టి చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
98 శాతం హామీలను నెరవేర్చాం..
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జగనన్న.. ఒక కొడుకులా తోడున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలను దూరం చేసేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 98శాతం మూడున్నరేళ్ళలోనే నెరవేర్చారు. సంక్షేమం, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ… రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. ఇటువంటి మనసున్న నాయకుడి జన్మదినం సందర్భంగా… సంబరాలు చేస్తే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపు మంట..?. ఏమీ చేయలేనివాళ్లు చేస్తున్నవాళ్లను చూసి ఏడుస్తుంటారు.
వైయస్సార్ ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయకుండా, మట్టికట్టలను చూపించేందుకు వందలకోట్లు ఖర్చు పెట్టి బస్సుల్లో జనాలను తీసుకువెళ్లి ‘జయము జయము చంద్రన్నా..’ అని భజన చేయించుకుంటే అది అతి అవుతుంది. పేద కళాకారుల ప్రతిభను ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడం తప్పంటే అది వారి కడుపు మంటకు నిదర్శనం.
ప్రధాని మోదీగారు సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారు. సచివాలయాల వ్యవస్థ, ఆర్బీకే, నాడు-నేడు కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలనుకోవడం చూస్తే.. ఒక నాయకుడికి అంత కన్నా గొప్పతనం ఇంకేముంటుంది.
జగనన్న పుట్టినరోజు పండుగను అందరం కలిసి చేసుకుందాం. జగనన్న సాంస్కృతిక సంబరాలతో పాటు, జగనన్న క్రీడా సంబరాలకు రాష్ట్రంలోని క్రీడాకారులు, కళాకారులు ఉత్సాహంగా ముందుకు రావడం జగనన్న సుపరిపాలనకు నిదర్శనం.