Suryaa.co.in

Features

పంటలకు కనీస మద్దతు చట్టం కావాలి

పంటలకు కనేసమద్దటుధర కల్పిస్తూ చట్టంచేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా అన్నదాతలు మళ్లీ ఆందోళనబాట పట్టారు.పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలని, 60ఏళ్లు నిండిన రైతులకు,కూలీలకు నెలకు రూ 3వేలు పించన్ ఇవ్వాలని, రైతు రుణాల రద్దును కోరుతూ పంజాబ్,హర్యానా,యుపి తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు తమ ట్రాక్టర్లు ఇతరవాహనాలతో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో నిరవధికంగాధర్నా చేస్తున్నారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని కమలం పార్టీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను కాగితాలకే పరిమితం చేసి, అమలుకు చట్టం చేయకుండా విపరీత జాప్యం చేయడం, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కోక పోవడం వల్ల కర్షక వీరులు మళ్లీ ఉధృత ఆందోళన ప్రారంభించడానికి ప్రధాన కారణం. కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చాల పిలుపు మేరకు రైతు బృందాలు ఫిబ్రవరి 13న రాజధాని ఢిల్లీ వైపు కదిలాయి.

పంజాబ్ రైతులు హర్యానా మీదుగా శంభు – అంబాలా- ఖ నూరీ-జింద్ అంతర్రాష్ట్ర సరిహద్దులకు చేరుకోగా వారిని హర్యానాలో ప్రవేశించకుండా మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అడుగడుగునా ఇనుప తీగెలుముల్లకంచెలు, ఇతర అడ్డుగోడలు నిర్మించి అన్నదాతలు ముందుకు రాకుండా అడ్డుకున్నది.అయినా ఈ అవరోధాలను లెక్క చేయకుండా చొచ్చుకు వస్తున్న రైతులను చె దరగొట్టడానికి డ్రోన్ల ద్వారా బాష్పవాయుగోళాలు,జలఫిరంగులు ప్రయోగించారు.

ఈ నిర్బందాలను అధిగమించి కర్షక వీరులు ఢిల్లీ వైపు ముందుకు రాగా పలుచోట్ల సాయుధ పోలీసులను,పారామిలిటరీ దళాలను మోహరించి బలప్రయోగం చేయగా పలువురు అన్నదాతలు గాయపడ్డారు. హర్యానా పోలీసులతో జరిగిన ఘర్షణలో సుభాకరన్ సింగ్ అనే 23 ఏళ్ల రైతు యువకుడు మరణించడంతో ఆందోళన కారులలో ఆగ్రహావేశాలు మిన్నుముట్టాయి.

దీంతో తాజా ఆందోళనలో మరణించినవారి సంఖ్య 4కు పెరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా,పీయూష్ గోయల్,నిత్యానంద రాయ్ లతో కూడిన మంత్రుల బృందం నాయకులు జగ్జిత్ సింగ్,స్వరన్ సింగ్ పాంథర్ ప్రభృతులతో 4సార్లు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

– పతకమూరు దామోదర్ ప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
9440990381

LEAVE A RESPONSE