– ఓ వీధిరౌడీలా మంత్రి తీరు ప్రభుత్వానికి సిగ్గుచేటు
– వైసీపీ కుట్రపై పోలీసు ఉన్నతాధికారులకు సకాలంలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
– కుట్రపూరితంగా చంద్రబాబుపై దాడికి మంత్రి ఆదిమూలపు యత్నం
– ఎన్.ఎస్.జీ కమాండో తలకు గాయం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
– తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల.రామయ్య
మంత్రి ఆదిమూలపు సురేష్ ను గవర్నర్ తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తోంది.మంత్రి ఆదిమూలపు సురేష్ తన అధికారాన్ని హింసాకాండను ప్రోత్సహించేందుకు ఉపయోగించడం రౌడీ పాలనకు నిదర్శనం.శాంతిభద్రతలను కాపాడాల్సిన మంత్రే స్వయంగా రౌడీలా చొక్కా విప్పి రోడ్డుపై వీరంగం సృష్టించడం ప్రజాస్వామ్యానికి కళంకం.
కుట్రపూరితంగా జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మధ్య ఉన్న చంద్రబాబుపై దాడి చేసేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, తన అనుచరులు ప్రయత్నించారు. మంత్రి కుట్రపూరిత కార్యక్రమాలను తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని కమాండ్ కంట్రోల్ రూమ్, డీజీ, ప్రకాశంజిల్లా ఎస్పీ లకు మధ్యాహ్నం 3గంటల నుండి 4గంటల మధ్య మెసేజ్ రూపంలో వినతిపత్రం పంపాను.వాళ్లు నా మెసేజ్ చూసి కూడా ఎటువంటి ముందస్తు భద్రతా చర్యలూ తీసుకోలేదు.
మంత్రి కుట్రలో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం రాష్ట్రంలో శాంతిభద్రతలు అధికారపార్టీ కాలికింద నలిగిపోతున్నాయనడానికి నిలువెత్తు నిదర్శనం. మంత్రి, తన అనుచరులు చేసిన దాడిలో ఓ ఎన్.ఎస్.జీ కమాండో తలకి గాయమైంది. ఎన్.ఎస్.జీ అధికారులు అత్యవసర స్థితిలో తమ శైలిలో నిర్ణయాలు తీసుకుని ఉంటే రాష్ట్రం పరువు మంటగలిసేది-తీవ్రమైన శాంతిభద్రతలకు విఘాతం కలిగేది.
మాజీముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత పై కుట్రపూరితంగా దాడికి యత్నించిన మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలి.ఒక్క క్షణం కూడా ఆదిమూలపు సురేష్ కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు.చీటికి, మాటికి టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేసే పోలీసులు మంత్రిని ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదు?
వివేకా హత్య కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని మరల్చేందుకే మంత్రితో ఈ నీచమైన పని చేయించారు. ప్రభుత్వమే ప్రజాయుద్ధానికి బాటలు వేస్తే, ప్రజాయుద్ధాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రం ఏమైపోతుందో ముఖ్యమంత్రి ఆలోచించాలని కోరుతున్నాం.