– దాసరి రాజా మాష్టారు
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాష్టర్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ పార్టీ ఇంచార్జ్ లందరు వారు చేసే కార్యక్రమాలు, అభివృద్ధి విషయంలో జీరో పర్సెంట్ గా ఉన్నారని, కేవలం ప్రతిపక్షాల పై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో వైసిపి నాయకులు చేసిన దమనకాండ ఈ రాష్ట్రం లోనే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా వైసిపి యొక్క దౌర్జన్యాలను గమనిస్తున్నారన్నారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దగ్గర నుంచి, నేటి వరకు రాష్ట్రం లో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని వైసిపి వారు చేసే అరాచకం, విధ్వసం, అవినీతి ఈ మూడు ఎజెండాల తోనే పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి లో ఉన్న మంత్రులకు ఏ ఒక్కరికి వారి శాఖల పై అవగాహనా లేదని విమర్శించారు. ఏ ప్రాంతంలోకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి బాధితులే కనిపిస్తున్నారన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు “శవాల మీద పేలాలు ఏరుకునేలా” రాజకీయం చేస్తున్నారన్నారు. మంత్రి అంబటి రాంబాబు విషయానికి వస్తే తన నియోజకవర్గంలోని గత ఆగస్టు నెలలో బిసి కుటుంబానికి చెందిన అనిల్ సెప్టిక్ ట్యాంక్ లో పడి మృతి చెందితే, వారి తల్లిదండ్రులకు సి.ఎం సహాయ నిధి కింద 5 లక్షల చెక్కు మంజూరు కాగా, వాటిని బాధితులకు అందజేయటానికి స్థానిక అధికారులు కమీషన్ అడిగారని, మంత్రి అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లగా తానూ కూడా 50% కమిషన్ ఇవ్వాల్సిందే అని అనటం చూస్తుంటే జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో అర్ధం అవుతుందన్నారు.
పైగా అంబటి రాంబాబు తానూ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరారని, ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రజలందరూ తన అవినీతిని చూస్తున్నారన్నారు. పలానా మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అనటం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కాదని, వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా మీరేం నిర్ణయాలు తీసుకుంటున్నారో మీరే చెప్పాలన్నారు. నవరత్నాల పేరుతో, గ్లోబల్స్ ప్రచారాలు చేస్తూ ఆచరణకు సాధ్యం కానీ హామీలతో, రాష్ట్రం లో ఒక్క అవకాశం ఇవ్వమని మీరు అడిగినందుకు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే వారిని అంధకారం లోకి నెట్టారన్నారు. మంత్రి అంబటి రాంబాబు కాపులకు ఏమి చేయాలకుండా కాపులను బలిచేస్తున్నారని, గత టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా 3 కోట్లు ఖర్చు పెట్టామని, విదేశీ విద్య ద్వారా 378 కోట్లు ఖర్చు చేశామని, ఈ వైసిపి ప్రభుత్వం కాపులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
అమ్మఒడి కింద 19,617 కోట్లు ఖర్చు పెట్టి, నాన్న బుడ్డి కింద 66,878 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. కాపులకు ఉద్యోగాలలో 4% ఉన్న రిజర్వేషన్ ను రద్దు చేశారన్నారు. రాష్ట్రం లో దాదాపు 25 శాతం ఉన్న కాపులను వివిధ బడ్జెట్ లేని కార్పొరేషన్ లు వేసి కాపులను విచ్చిన్నం చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపులను అనగదొక్కుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, సీనియర్ నాయకులు కొల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.