Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పార్టీనా.. “చందా బాబు” పార్టీనా..

– బక్క బాబు మహా కామెడి షోలో… పక్క వాళ్ళ తొడ చరుపులు
– అది మహానాడు కాదు.. మోసపు నాడు.. బూటకపు నాడు..
– వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు
– రాష్ట్రానికి పట్టిన చీడ, అనేక మందిని కాటేసిన విష సర్పం బాబు”
– నిండు నూరేళ్ళు బతకాల్సిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు ద్వారా బాబు హత్య చేశారు
– డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ చారిత్రక తప్పిదం కాదా.. చర్చకు సిద్ధమా.. ఛాలెంజ్ చేస్తున్నా
– కోనసీమలో దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలేస్తే మహానాడులో ఖండించరా..?
– అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని మహానాడులో డిమాండ్ చేయని మీరు దళిత, బీసీ, మైనార్టీ ద్రోహులు
– కుటుంబాలను మోసం చేసిన మహా మోసగాడు చంద్రబాబే..
– బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో మహానాడు వేదిక మీద ఉన్న బ్యానర్ చూస్తే అర్థమవుతుంది.
– మూడు సార్లు ఓడిపోతే టికెట్లు ఇవ్వం అని ఓడిపోయిన లోకేష్ ఆదేశాలా..?
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు 

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
దుర్మార్గమైన రాజకీయాలకు బాబే ఆద్యుడు
పేరెన్నికగన్న మహానటుడు, రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాజకీయవేత్త ఎన్టీ రామారావుగారు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణం ఇది. ఇవాళ ఎన్టీఆర్‌ బతికుంటే వందేళ్ల కురువృద్ధుడిలా ఉండేవాళ్లు. కానీ ఆయన 27 సంవత్సరాల క్రితమే మరణించారు. 73 ఏళ్లకే ఆయనకు నిండు నూరేళ్లు నిండాయి. అది సహజ మరణం కాదు. చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురై, హత్యకు గురయ్యారని నిజమైన ఎన్టీఆర్‌ అభిమానుల భావన. మరోవైపు ఈరోజు మహానాడు వేదికగా ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆయనకు దండలు వేస్తున్న నారా చంద్రబాబు నాయుడు తీరును చూస్తే నవ్వాలో, ఏడవాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి.

ఎన్టీఆర్ పదవి లాక్కోవడంతోపాటు, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి, బయటకు గెంటేసి చెప్పులు వేశారు. చనిపోయన తర్వాత ఆయన శవం దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్‌ శత జయంతి జరుపుకుంటూ.. ఆయనను పొగుడుతుంటే.. ఇటువంటి సన్నివేశాలు బహుశా సినిమాల్లోనే కనిపిస్తాయి తప్పితే నిజ జీవితాల్లో అరుదు. ఇటువంటి సన్నివేశాన్ని చూసి.. ప్రజలు వారేవా చంద్రబాబు. చంపినవాడే ఈ రకంగా పొగడ్తలు కురిపిస్తూ, దండలు వేస్తున్నారంటే ఇంకొకళ్లు అయితే ఊరుకుంటారా? అని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ఇవాళ మనం చూస్తున్నాం.

అక్కసు, ఆరాటం తప్ప మహానాడులో ఏముంది..?
మహానాడు పేరుతో హంగామా చేస్తూ, అద్భుతం, బ్రహ్మండం అంటూ మీ జబ్బలు మీరే చరుచుకుని, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిని అంటూ చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాధి అయిన పార్టీకి రిపేర్‌ చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఏం చేశామనేది మహానాడులో చంద్రబాబు ఒక్క మాట అయినా చెప్పారా?. లేదు. కానీ కొంతమందిని చుట్టూ పెట్టుకుని, జగన్‌ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తూ, మూడేళ్ల పాలనను దూషించే ప్రయత్నాలే తప్ప, మీరు ప్రజలకు ఏం చేశామనేది చెప్పుకోలేవు. అక్కసు, తాపత్రయం, అధికారం లేదనే బాధ తప్ప మరొకటి కనిపించడం లేదు.

డయాఫ్రం వాల్ పై చర్చకు సిద్ధమా.. సవాల్
డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి రివర్స్‌ టెండరింగే కారణమని మహానాడు వేదిక మీద చంద్రబాబు ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దీనిమీద నేను సవాల్‌ చేస్తున్నా. చర్చకు సిద్ధమా చంద్రబాబూ? డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి మీరుచేసిన చరితాత్మకమైన తప్పిదమే కారణం. అది మా వల్ల కొట్టుకుపోయింది కాదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ లు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మించారు. ఎక్కడైనా డయాఫ్రం వాల్‌ మీద వరదలు ప్రవహిస్తాయా..? ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్‌ దెబ్బతినలేదు. కేవలం ఒక్క ఏపీలోనే ఇది జరిగింది. దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు, ప్రజలు నమ్మరు.

సోమవారం పోలవారం అంటూ మాట్లాడే చంద్రబాబు పోలవరం కోసం ఏం చేశారు? 2018కి పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళతామని శపథం చేసిన మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్‌గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. పైపెచ్చు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో కొత్తమంత్రి చెప్పలేకపోతున్నారని మాట్లాడుతున్నారు. మీరు చేసిన మహా పాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి మీరు కానీ, మీ అబ్బాయ్‌ అయినా, లేకుంటే మీ మాజీ ఇరిగేషన్‌ మంత్రి అయినా చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేస్తున్నాం. సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తే సహించేది లేదు.

కోనసీమ విధ్వంసాన్ని మహానాడులో ఖండించరా..?.. మీరు దళిత, బీసీ, మైనార్టీ ద్రోహులు
కోనసీమ విధ్వంసాన్ని మహానాడులో ఖండించరా?. ఒక దళిత మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగలబెడితే దాన్ని ఖండించరా?. కానీ మీరే, కోనసీమ వెళ్ళి కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తారా? మహానాడు వేదిక మీద దీన్ని ఖండించని మీరు, బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని తీర్మానం పెట్టని మీరు, దళిత, బీసీ, మైనార్టీ ద్రోహులు. ఈ మహానాడు అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్నదే. కేవలం ధనికుల కోసం జరుగుతున్న మహానాడు మాత్రమే అని చెప్పదలచుకున్నాం. ప్రజాస్వామ్యంలో దహన కాండ జరుగుతున్నప్పుడు బాధ్యతగల రాజకీయ పార్టీగా ఖండించాల్సిన అవసరం ఉంది.

తొడలు కొడుతుంటే బాబు తందానా..
మహానాడు చాలా కామెడీగా ఉంది. మహానాడులో ఒకామె తొడ కొడుతోంది. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర చేస్తున్న మా పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను లాగి కొడుతుందట. దానికి చంద్రబాబు తందానా అంటున్నారు. సామాజిక న్యాయం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు ప్రజల చెంతకు బస్సుయాత్ర చేస్తుంటే, వాళ్లను లాగి కొడతానని ఓ మహిళ తొడ కొడుతూ సవాల్‌ చేస్తుంటే చంద్రబాబు మహా భారతం విన్నట్లు వింటున్నాడు. మీకు, ఏం పోయే కాలం వచ్చింది చంద్రబాబూ. ఇలాంటి దుర్మార్గపు మాటలు వినటానికా మహానాడు ఏర్పాటు చేసింది. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.

ఆమెతో పాటు ఇంకో ఆయన వచ్చాడు. తమిళ సినిమాలో వడివేలులా ఉన్నాడు. రాగానే శోకాలు పెడుతున్నాడు. కుటుంబాన్ని మోసం చేసేవాడు మీకు న్యాయం చేస్తాడా అని అంటున్నాడు. కుటుంబాలను మోసం చేసిన మొదటి మోసగాడు చంద్రబాబు, అక్కడే ఉన్నాడు. మామకు వెన్నుపోటు, బామ్మార్దిని బయటకు నెట్టాడు, తమ్ముడిని తన్ని తగలేశాడు. తోడల్లుడి తోక కత్తిరించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేసింది చంద్రబాబే కదా. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థం అయ్యాయి కాబట్టే, చంద్రబాబు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహానాడులో చందా.. బాబు అవతారం
మహానాడులో పార్టీ సిద్ధాం‍తాలు, చేసిన, చేయాల్సిన పనులు గురించి చెప్పుకోవాలేగానీ, మీ గొడవంతా అధికారం కోసమే అన్నట్టు ఉంది. మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చే సత్తా ఉన్న నాయకుడి గురించి మీరు దిగిపోండి.. నేను ఎక్కుతాను అనేదానికేనా మీ మహానాడు. ఇంతవరకూ తన జీవితంలో ఇలాంటి అద్భుతమైన మహనాడును చూడలేదని చెబుతున్న చంద్రబాబు… మరి గతంలో జరిగిన వాటి మాటేంటి? అవన్నీ బుస్సేనా?

ఎప్పటికప్పుడు కొత్తగా మాయ మాటలు చెప్పి కార్యకర్తల దగ్గర క్యాష్‌ కొట్టేద్దామన్నదే బాబు పన్నాగం. చాలామంది చందాలు ప్రకటిస్తున్నారుకానీ, పైకం ఇవ్వడం లేదని, నిజమైన కార్యకర్తలు ఆన్‌లైన్‌లో చందాలు ఇవ్వమని చంద్రబాబు అడుక్కుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే అది మహానాడులా లేదు. చందాలు అడుక్కునే నాడులా ఉంది. డబ్బులు ఇవ్వమంటున్నావే? మీ దగ్గర డబ్బులు లేవా? అధికారంలో ఉండగా, ఎన్ని లక్షల కోట్లు కాజేశావ్‌. హెరిటేజ్‌లో ఎంత పెట్టుబడులు పెట్టావ్‌. కార్యకర్తలు డబ్బులు ఇవ్వాలి, వాటిని తీసుకుని జగన్‌ గారి మీద పోటీ చేయాలనే తాపత్రయం మీది. అధికారం లేదనే చంద్రబాబుకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. అబ్బాయ్‌ పైకి రాలేకపోతున్నాడని, అధికారం లేదని నిద్ర పట్టక చంద్రబాబు గిలగిలాడుతున్నాడు. ఇప్పుడే కాదు మళ్లీ వచ్చే అయిదేళ్ల వరకూ చంద్రబాబుకు నిద్ర పట్టనే పట్టడు. అధికార ఆశ చస్తేగానీ బాబుకు నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు వంద మహానాడులు చేసినా అధికారంలోకి రాలేదు. రాబోడు. ఎందుకంటే రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రబాబు. అనేక మందిని కాటువేసిన విష సర్పం చంద్రబాబు.

కొన ఊపిరితో కొట్టుకుంటున్న విష సర్పంలా టీడీపీ
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం అనే విష సర్పం ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో కొన ఊపిరితో, తోకలో ప్రాణంతో విలవిలా కొట్టుకుంటోంది. ‘కిల్‌ తెలుగుదేశం.. సేవ్‌ ఆంధ్రా పాలిటిక్స్‌’ అని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో దుష్ట రాజకీయాలు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడే. ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇష్టమొచ్చిన దుష్ట సంప్రదాయాలను రాజకీయాల్లో ప్రవేశపెట్టడం, డబ్బులు పెట్టి ప్రజాప్రతినిధులను కొనడంలాంటి దుష్ట సంప్రదాయాలు తీసుకువచ్చిన టీడీపీని చంపేయండి .. రాష్ట్ర రాజకీయాలను కాపాడండి అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నాం. నిన్న, ఇవాళ జరుగుతున్నది మహానాడు కాదు … పెద్ద మోసపు నాడు, దొంగమాటలు చెప్పేనాడు, చందాలు అడుక్కునే నాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్నాడనే భ్రమను వాళ్ల కార్యకర్తల్లో కల్పించడానికి చేస్తున్న మహనాడు తప్ప మరొకటి కాదు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం అనేది చంద్రబాబుకు సాధ్యమయ్యే పని కాదు.

అద్భుతంగా సామాజిక న్యాయ భేరి యాత్ర
అదేమంటే సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర మీద విమర్శలు చేస్తున్నారు. మా బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతోంది. బస్సు యాత్రపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతుంటే వారికి జనాలు జేజేలు పలుకుతున్నారు. జయహో జగన్‌ మోహన్‌ రెడ్డి… అంటూ నినదిస్తున్నారు. ఆ యాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా, దానిని చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని, దయచేసి ఎవరూ నమ్మవద్దు. మహానాడు అంతా బూటకపు నాడు. అధికారం కోసం అర్రులు చాచుకునే ప్రయత్నం ఎంత చేసినా, ప్రజలు మీకు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నాం.

బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో మహానాడు వేదిక మీద ఉన్న బ్యానర్ చూస్తే అర్థమవుతుంది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ అచ్చెన్నాయుడిని నియమించి.. ఆ వేదిక మీద మాత్రం ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్, మధ్య లో ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. లోకేష్ ఏం పొడిచాడని..?. బీసీ నాయకులకు టీడీపీ ఇస్తున్న గౌరవం ఇదేనా..?
మరోవైపు మూడు సార్లు ఓడిపోతే టికెట్లు ఇవ్వం అని ఓడిపోయిన లోకేష్ పార్టీ నేతలకు ఆదేశాలు ఇస్తున్నాడు. ఇటువంటి ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకోరా మరి..?

LEAVE A RESPONSE