తొర్రూరు, అక్టోబరు 30: గ్రామీణ క్రీడలతో పాటు క్రికెట్ వంటి అంతర్జాతీయ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ వచ్చాకే క్రీడలకు సైతం మంచి గుర్తింపు గౌరవం దక్కాయని మన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఆయన చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొబ్బరికాయ కొట్టి, క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. అలాగే బ్యాట్ పట్టి బంతులను బాది, క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహదారుఢ్యా నికి మాత్రమే కాక కెరీర్ గా ఎంచుకున్న వాళ్లకి అద్భుతమైన భవిష్యత్తును కలిగిస్తున్నాయని అన్నారు. ఇందుకు ఉదాహరణగా క్రికెట్ క్రీడలు, క్రీడాకారులను తీసుకోవాలని మంత్రి చెప్పారు.
క్రికెట్ క్రీడా అంతర్జాతీయంగా క్రేజీని సంపాదించుకుందని ఈ క్రీడలో రాణించిన వారికి ఆర్థికంగా పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తున్నాయని మంత్రి అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి మంచి అవకాశాలు కలిగిస్తాయని ఇలా ఈ క్రీడల్లో ఆడుతున్న వాళ్లు భవిష్యత్తులో జాతీయస్థాయిలో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ గ్రామ ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.