కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటన
టౌన్‌లోని కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని పరిశీలించిన లోకేష్, మృతిచెందిన నాగరత్నమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం అందజేశారు.
రత్నాల చెరువు ప్రాంతంలో పర్యటించిన లోకేష్
టౌన్‌లోని రత్నాల చెరువు ప్రాంతంలో కూడా నారా లోకేష్ పర్యటించారు. అక్కడ ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. అధికారులు, పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపడుతున్న తీరు గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. రత్నాల చెరువులో మోకాటి లోతు నీటిలోకి దిగిన లోకేష్, నీరు చేరిన ఇళ్లను పరిశీలించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మసీదు లైన్‌లో ఒక చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి, నీట మునిగిన మగ్గాన్ని పరిశీలించిన లోకేష్, ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్ల సహాయంతో తొలగించేందుకు అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల వాసులకు ఆహారం, తాగునీరు అందించాలనే సూచనలు కూడా ఇచ్చారు.
డిడి నగర్ ప్రాంతంలో పర్యటించిన లోకేష్
మంగళగిరి రూరల్‌లోని చినకాకాని డిడి నగర్‌లో మంత్రి లోకేష్ పర్యటించారు. వర్షాల కారణంగా నీట మునిగిన కాలనీల్లో పరిస్థితిని సమీక్షించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి, కాలనీల్లోకి చేరిన నీటిని వీలైనంత త్వరగా పంపింగ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు శాశ్వత పరిష్కారం కోసం కోరగా, లోకేష్ అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందంటూ లోకేష్ హామీ ఇచ్చారు.