Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని గ్రామాలలో మంత్రి నారాయ‌ణ‌ పర్యటన

-అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను పరిశీలించిన మంత్రి
-వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్, ఈ-హెల్త్ సెంటర్, మంద‌డంలో నిర్మాణంలో ఉన్న అంగ‌న్వాడీ భ‌వ‌నాన్ని ప‌రిశీలించిన నారాయ‌ణ‌

గ‌త ప్ర‌భుత్వం మూడు ముక్క‌లాటతో అమ‌రావ‌తిని నాశనం చేసింద‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్, సీఆర్డీయే క‌మిష‌న‌ర్ కాటంనేని భాస్క‌ర్ తో క‌లిసి రాజ‌ధానిలో ప‌లు గ్రామాల్లో జ‌రుగుతున్న వివిధ అభివృద్ది ప‌నుల‌ను మంత్రి నారాయ‌ణ ప‌రిశీలించారు. సుస్థిర‌, స‌మీకృత‌, ఆవిష్కృత న‌గ‌రాల ప్రాజెక్ట్ (CITY INVESTMENTS TO INNOVATE INTEGRATE & SUSTAIN – CITIIS) సిటీస్ లో భాగంగా చేప‌డుతున్నభ‌వ‌నాల నిర్మాణ‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు.

సీఆర్డీఏలోని అమ‌రావ‌తి స్మార్ట్ అండ్ స‌స్టెయిన‌బుల్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌నులు జ‌రుగుతున్నాయి. రాజ‌ధానిలో నిరుపేద‌ల కోసం అత్యాధునిక వైద్యం,నాణ్య‌మైన విద్య అందించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్ర‌భుత్వం.. దీనికోసం మొత్తం 138 కోట్ల 62 ల‌క్ష‌ల వ్య‌యంతో రాజ‌ధానిలోని 15 గ్రామాల్లో పాఠ‌శాల‌లు, ఈ హెల్త్ సెంట‌ర్లు, అంగ‌న్వాడీలు, అత్యాధునిక స్మ‌శాన వాటిక‌ల‌ను నిర్మాణంతో పాటు ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నారు….

వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్, ఈ-హెల్త్ సెంటర్, మంద‌డంలో నిర్మాణంలో ఉన్న అంగ‌న్వాడీ భ‌వ‌నాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితి అంద‌రికీ తెలుస‌ని…ప్ర‌భుత్వ ఖజానా ఖాళీ అయిపోయింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌….మూడు ముక్క‌లాట‌తో అమ‌రావ‌తిని మొత్తం నాశ‌నం చేసింద‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం రాగానే క్షేత్ర‌స్థాయిలో అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న చేసిన ముఖ్య‌మంత్రి, ఈ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని త‌న‌కు ఆదేశాలిచ్చార‌న్నారు. ముందుగా ఆర్ధిక ప్ర‌ణాళిక‌లు చేస్తున్నామ‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. శాఖ‌ల‌వారీగా చేసిన కేటాయింపుల‌ను కూడా ఇత‌ర అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు పెట్టేసింద‌ని ఆరోపించారు. 2015 జ‌న‌వరి ఒక‌టో తేదీన ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేష‌న్ ఇస్తే సీఎం చంద్ర‌బాబు మీద న‌మ్మ‌కంతో కేవ‌లం 58 రోజుల్లో 34 వేల ఎక‌రాల‌ను ఎలాంటి లిటికేష‌న్ లేకుండా రైతులు ఇచ్చార‌ని మంత్రి చెప్పారు. ప్ర‌పంచంలోనే టాప్ 5 న‌గ‌రాల్లో అమ‌రావ‌తిని ఒక‌టిగా చేయాల‌నే ఉద్దేశంతో డిజైన్ లు రూపొందించి 41 వేల కోట్ల‌తో ప‌నుల‌కు టెండ‌ర్లు కూడా పిలిచిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. గ‌త ఐదేళ్లు ప్ర‌భుత్వం ఉండి ఉంటే ప్ర‌పంచంలో టాప్ 5 లో కాకుండా టాప్ వ‌న్ గా అమ‌రావ‌తి ఉండేద‌న్నారు. నార్మ‌న్ ఫోస్ట‌ర్ డిజైన్ లు ప్ర‌కారం నిర్మాణం జ‌రిగితే ఖ‌చ్చితంగా ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ అయ్యేద‌న్నారు.

రాజ‌ధాని గ్రామాల్లో 17 అంగన్వాడీ సెంటర్లు,16 ఈ హెల్త్ సెంట‌ర్లు,14 పాఠ‌శాల‌లు,అన్ని స‌దుపాయాల‌తో కూడిన శ్మ‌శాన వాటిక నిర్మాణాలు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు..వచ్చే నెలాఖ‌రులోగా ఈ భ‌వ‌నాల‌న్నీ పూర్తిచేయాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ఆయా భ‌వ‌నాలు ప్రారంభిస్తామ‌ని అన్నారు. రాజ‌ధాని రైతుల‌కున్న స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. వంద‌రోజుల్లో అన్న క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. ఇప్ప‌టికే అన్న క్యాంటీన్ల భ‌వ‌నాల మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతున్నాయ‌ని. ఆగ‌స్ట్ 15 నాటికి క‌నీసం వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

సిటిస్ ప్రాజెక్ట్ అభివృద్ది ప‌నులు 
సిటిస్ ప్రాజెక్ట్ లో 17 మోడ‌ల్ అంగ‌న్వాడీ కేంద్రాలున్నాయి. చిన్నారుల‌ను ఆరోగ్య‌వంత‌మైన విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 17 మోడ‌ల్ అంగ‌న్వాడీ కేంద్రాల భ‌వ‌నాల కోసం 23.73 కోట్లు ఖ‌ర్చుపెడుతుండ‌గా ఆయా కేంద్రాల్లో ఇత‌ర వ‌స‌తులు, మౌలిక‌ సదుపాయాల కోసం 8.63 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇక రాజ‌ధాని గ్రామాల్లోని ప్ర‌జ‌లు వ్యాధులు బారిన ప‌డిన‌ప్పుడు ద‌గ్గ‌ర్లోనే నాణ్య‌మైన‌, అత్యాధునిక వైద్యాన్ని అందించేలా 16 ఈ హెల్త్ సెంట‌ర్లు, ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రాల‌ను నిర్మిస్తుంది ప్ర‌భుత్వం. ఆయా భ‌వ‌నాల నిర్మాణానికి 27.69 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌గా, మౌళిక వ‌స‌తులు, ఇత‌ర సామాగ్రి కోసం 12.18 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇక 14 పాఠ‌శాల భ‌వ‌నాల నిర్మాణానికి 28.5 కోట్లు,ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌న‌కు 11.32 కోట్లు ఖ‌ర్చు పెడుతుంది ప్ర‌భుత్వం. ఇక ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా ఉండే స‌మీకృత స్మ‌శాన వాటిక‌ను మొత్తం 12 కోట్ల‌తో నిర్మిస్తుంది. మొత్తంగా 138.62 కోట్ల‌తో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేపట్ట‌గా. వీటిలో ఫ్రెంచ్ డెవ‌ల‌ప్ మెంట్ ఏజెన్సీ 40 కోట్ల ఆర్ధికసాయం అందిస్తుంది. ఇక మ‌రో 40 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా ఫ్రెంచ్ డెవ‌ల‌ప్ మెంట్ ఏజెన్సీ రుణ స‌దుపాయం క‌ల్పించింది. మ‌రో 58.62 కోట్ల‌ను సీఆర్డీయే భ‌రిస్తుంది.

LEAVE A RESPONSE