విజయవాడ : రాష్ట్ర రవాణా శాఖామంత్రి పేర్ని నాని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ లో ఆర్టీసీ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ తర్వాత మెరుగైన పరిస్థితుల నేపధ్యంలో సమీక్ష జరిపి భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాల గురించి దిశానిర్దేశం చేశారు.ప్రయాణికుల రద్దీ క్రమేపి పుంజుకుంటున్న తరుణంలో ఓ.ఆర్. మరింతగా పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ప్రయాణికుల అవసరాల మేరకు బస్సు సర్వీసులను నడపాలని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి ఇటు సంస్థకు, అటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజన వలన ఆయా జిల్లాల కేంద్రాలకు బస్సులు నడిపే విషయంలో తగు నిర్ణయాలు త్వరితగతిన తీసుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించాలన్నారు. మారుమూల ప్రాంతాల వాసులకు కూడా ఇబ్బంది తలెత్తకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు , రవాణా శాఖ కమిషనర్ భాస్కర్, ఆర్టీసీ ఎం.డి సి.హెచ్. ద్వారకాతిరుమల రావు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ.కోటేశ్వర రావు, పి.కృష్ణ మోహన్, బ్రహ్మానందరెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజరు రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.