-శక్తికి మించి చేశాం. అర్ధం చేసుకోండి
-వాస్తవ పరిస్థితులను గుర్తించి అర్ధం చేసుకొండి
-ఉద్యోగుల పట్ల సీఎంకి ఎంతో ప్రేమ, సానుభూతి
-అందుకే 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ప్రకటించారు
-కాంట్రాక్ట్ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు
-ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఎంఎన్ఓల జీతాలు పెంచారు
-కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి
-ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. అటు వ్యయం పెరిగింది
-అందువల్ల సానుభూతితో ఆలోచించమని కోరుతున్నాం
-ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చు
-అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది.
-నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతున్నారు
-మొసలి కన్నీరు కారుస్తూ, నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు
-మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తొడేళ్లలా వ్యవహరిస్తున్నారు
-వారి ట్రాప్లో ఉద్యోగులు పడకూడదు. ఇది మీ ప్రభుత్వం
-సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడి
ప్రెస్మీట్లో మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..:
మేలు చేయాలన్న తపన:
భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా నింపాదిగా వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎంకి ప్రేమ, సానుభూతి లేకపోతే, అధికారం చేపట్టిన 30 రోజుల్లోనే పీఆర్సీ నివేదిక రాకముందే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించారు. ఉద్యోగులకు మేలు చేయాలని మనసులో ఉంది కాబట్టే, ఆయన అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదు. అయినా ఆయనకు ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమ, సానుభూతి ఉండడం వల్లనే ఐఆర్ ఇచ్చారు. ఇది వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మనసు పెట్టి ఆలోచించండి:
సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను కన్నబిడ్డల మాదిరిగా చూసుకుంటోంది. తొలి రోజు నుంచి అలాగే ఉంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులు మాత్రమే అని అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. కన్నబిడ్డల కోరికలు తీర్చలేనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తలడిల్లుతారో జగన్ కూడా బాధ పడుతున్నారు.
మీ భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు.
సీఎంకి ఉద్యోగుల మీద ప్రేమ ఉంది కాబట్టే, అధికారం చేపట్టిన తర్వాత నెల లోపే ఐఆర్ ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మనసు పెట్టి ఆలోచించమని కోరుతున్నాను.
వారందరి వేతనాలు పెంచారు:
అంగన్వాడీ వర్కర్లు, యానిమేటర్ల వేతనాలు కూడా పెంచారు. ప్రేమతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. వారి వృత్తిని గౌరవిస్తూ సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించండి. ఆశావర్కర్లు, ఎంఎన్ఓల జీతాలు పెంచారు. వారి జీతాన్ని రూ.6700 నుంచి రూ.17,746 కు పెంచారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచారు. అలాగే హోంగార్డులకు అలవెన్సులు పెంచి, జీతాలు పెంచడం జరిగింది.
అలాగే కుక్ కమ్ హెల్పర్ల జీతాలు రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు.
ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏటా రూ.1100 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు మనందరి ప్రభుత్వం రూ.3 వేల కోట్లు చెల్లిస్తోంది. మరి ఈ నిర్ణయం తీసుకున్నది మన సీఎం జగన్ కాదా. ఒక్కసారి ఆలోచించండి.అలాగే ఆర్టీసి ఉద్యోగులు 57 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా, మనస్సుతో ఆలోచించండి.
ఆనాడసలు ఉద్యోగాలు ఇచ్చారా?:
కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ లోగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మీపట్ల నక్క వినయాలు పోతూ, మొసలి కన్నీరు కారుస్తున్న కొందరు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ ప్రభుత్వం నడిపాయి కదా. కనీసం ఒక్కరినైనా నియమించారా. అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు.
మరి మనందరి ప్రభుత్వం సచివాలయాల్లో 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను ఎక్కడా అవినీతికి తావు లేకుండా నియమించడం జరిగింది. వారి సర్వీసును కూడా జూన్లో రెగ్యులరైజ్ చేస్తాం. అయినా దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి మధ్య మనం బతుకుతున్నాం. దీన్ని గమనించాలి.
ఆదాయం దారుణంగా తగ్గింది:
ఇవాళ కోవిడ్ వల్ల కుటుంబాలు, వ్యవస్థలు తలడిల్లుతున్నాయి. మన రాష్ట్ర సొంత ఆదాయం.. జగన్ సీఎం అయ్యే నాటికి, అంటే 2018–19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు అయితే, ఆయన సీఎం అయిన తర్వాత తొలి ఏడాది, అంటే 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, అంతకు ముందు ఏడాది కంటే కూడా దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది. 2020–21లో ప్రభుత్వ ఆదాయాన్ని రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఒకవైపు పెరగాల్సిన రీతిలో ఆదాయం పెరగలేదు. కోవిడ్ వల్ల దాదాపు రూ.21 వేల ఆదాయం కోల్పోగా, కోవిడ్ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఒకవైపు ఆదాయం తగ్గగా, మరోవైపు ఖర్చులు మితిమీరి పెరిగాయి.
కేంద్ర నిధులూ రాలేదు:
మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కూడా సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను నుంచి పూర్తిగా రాలేదు.
2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు పడిపోయాయన్న విషయాన్ని వాస్తవాన్ని అందరూ గమనించాలి.
ఆదాయం–జీతభత్యాలు:
2018–19లో ప్రభుత్వ సొంత ఆదాయం దాదాపు రూ.62,500 కోట్లు కాగా, ఆరోజు ఉద్యోగుల జీతభత్యాల కింద రూ.52,513 కోట్లు చెల్లించడం జరిగింది, అంటే ప్రభుత్వ ఆదాయంలో దాదాపు రూ.10 వేల కోట్లు మిగిలాయి. అలాగే 2020–21 లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.60,688 కోట్లు కాగా, సీఎం నిర్ణయం మేరకు ఐఆర్ ఇవ్వడంతో ఉద్యోగులకు ఆ ఏడాది జీతభత్యాల కింద రూ.67,340 కోట్లు చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని మించి 111 శాతం చెల్లించిన విషయాన్ని గమనించాలని కోరుతున్నాను.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏనాడూ సీఎం వెనక్కు తగ్గలేదు.
ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. అంటే రూ.10 వేల కోట్లకు పైగా ఎక్కువ చెల్లింపు జరగనుంది. కాబట్టి, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. పిల్లల కోరికలు తీర్చడంలో ఒక అడుగు వెనక్కి వేయడంలో తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో, సీఎం కూడా అలాగే బాధ పడుతున్నారు.
‘పెద్దలు’…గతి తప్పిన మాటలు:
సందట్లో సడేమియాలో కొందరు పెద్దలు మాట్లాడుతున్నారు. వారు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అయ్యా పెద్ద లాల్చీ వేసుకున్న పెద్దమనిషి , చంద్రబాబు ఏలుబడిలో మీరూ అధికారంలో పాలుపంచుకున్నారు. స్థానిక సంస్థల ఉద్యోగులు ఏ శాఖలో పని చేస్తే, అక్కడే డీఏ తీసుకోవాలని ఆనాడు సీఎం చంద్రబాబు జీఓ ఇస్తే, ఉద్యోగులంతా రోడ్డెక్కారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అయితే, స్థానిక సంస్థల నుంచి డీఏలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వారు ఆందోళనకు దిగితే దారుణంగా వ్యవహరించారు. కేసులు పెట్టారు. వేధించారు. ఉద్యోగస్తులను చంద్రబాబు వేధించిన మాదిరిగా గతంలో గడీలలో కూడా వేధించలేదు.
వాస్తవమా… కాదా:
సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తే, వారిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఉద్యోగులపై కేసులను సీఎం వైయస్ జగన్, 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేసిన మాట వాస్తవమా. కాదా.
అలాంటి మీరు ఇవాళ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. పైన మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్న విషయం ఉద్యోగులకు తెలియదని మీరు భ్రమపడితే ఇంతకన్నా ఏముంటుంది.
మీరు అధికారం ఉన్న చోట్ల చేశారా?:
ఇక బీజేపీ వారు. 5 ఏళ్లు మీరూ టీడీపీతో ప్రభుత్వంలో ఉన్నారు కదా. మీరు కూడా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు. యూపీ, గుజరాత్లో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్ఆర్ఏ ఎలా ఇస్తున్నారు. కేంద్రంతో సమానంగా ఇస్తున్నారా. తెలుసుకోండి. మీరు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి దొంగ రాజకీయాలు, లాభం కోసం చేసే రాజకీయాలను ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు.
మరోసారి విజ్ఞప్తి:
నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలైన ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం ఏ రోజు అయినా చర్చలు జరుపుతుంది. మీపట్ల సానుభూతి, మెండైన ప్రేమ ఉన్న ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా నింపాదిగా ఆలోచించండి.
నివృత్తి చేస్తాం:
ఒక్కసారి గుర్తు చేసుకొండి. చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లలో టీచర్లను రెగ్యులరైజ్ చేస్తానని. ఏళ్లు గడిచినా ఆ పని చేయలేదు.
ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎవరికి, ఎలాంటి అనుమానం ఉన్నా, నివృత్తి చేస్తాం. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు రావొచ్చు. ప్రభుత్వం అందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.