– మీ హయాంలో ట్యాక్సులు, సెస్సులు రూపేణా బాదేసి, ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే నమ్మేది ఎవరు..?
– పెట్రో, డీజిల్ పై బాబు హయాంలో విధించిన వ్యాటే ఇప్పుడూ ఉంది, ఈ ప్రభుత్వం పెంచలేదు
– రాకెట్ కంటే వేగంగా పెట్రో ధరలు పెంచి, రూ.5-10 తగ్గించి పండగ చేసుకోమంటే ఎలా..?
– రూ. 70 ఉన్న పెట్రోలు, డీజిల్ ను జాలి, దయ లేకుండా రూ. 118 వరకు పెంచింది బీజేపీ కాదా..?
– పెట్రో, డీజిల్ పై వీర బాదుడు బాది.. తగ్గించండి అని బీజేపీ సుద్దులు చెప్పడమేంటి..?
– మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో మరి ధరలు ఎందుకు తగ్గించలేదు?
– సెస్ రూపంలో కేంద్రం సాలీనా వసూలు చేస్తున్నది రూ 2.87 లక్షల కోట్లు.
– సెస్సులు, సర్ చార్జీల రూపంలో కేంద్రం వసూలు చేస్తున్న రూ. 2.87 లక్షల కోట్లలో రాష్ట్రాలకు రావాల్సిన 41 శాతం వాటా ఎగ్గొడుతున్నారు
– రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల పేరుతో పెట్రో, డీజిల్ మీద కేంద్రం వసూలు చేస్తున్న సెస్ రూ. 1.98 లక్షల కోట్లు
– గ్యాస్ సిలిండర్ ధర ఎంత అమ్ముతున్నారో బీజేపీ నేతలకు స్పృహ ఉందా..?
– ప్రభుత్వంపై నిత్యం విషం కక్కే ఓ వర్గం మీడియా ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి అడ్వర్టేజ్ మెంటు ఇస్తే తప్పేంటి..?
– ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలతో.. మిగతా రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా ఉంది
– ఉప ఎన్నికల్లో బీజీపీకి శృంగభంగం జరిగింది కాబట్టి.. బఠానీలు, బిస్కెట్లు వేస్తే ప్రజలు నమ్ముతారా..?
– రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రెస్ మీట్
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… ఇంకా ఏమన్నారంటే..రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తుంటే.. మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నాడు. ధర్నాలకు, నిరసనలకు కూడా ఇద్దరూ తమ చరిత్రలు మరిచి పోటీపడి పిలుపు ఇస్తున్నారు.
– వీరిలో ఒకరేమో ఇబ్బడిముబ్బడిగా పెట్రో ధరలు పెంచేసి, అరకొరగా తగ్గించి రాజకీయం చేస్తుంటే.. మరొకరేమో తమ హయాంలో ఎంత పెంచారన్నది కూడా మరిచిపోయి రాజకీయం చేస్తున్నారు. ఇద్దరూ కూడా నిజాయితీ లేని మనుషులు. పెంచినదంతా పెంచి ఇప్పుడు అయిదో.. పదో తగ్గించి.. రోడ్ల మీదకు వచ్చిన నిరసన చేస్తాం అంటున్నది కూడా ఆ పార్టీ వారే. ఇంతకంటే ఘోరంగానీ, సిగ్గుచేటుగానీ ఉంటుందా..?
శ్రీహరికోట నుంచి ఇస్రో వదిలిన రాకెట్ ఎత్తుకన్నా, రాకెట్‌కంటే వేగంగా గడిచిన ఏడు సంవత్సరాలుగా దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలును ఆకాశాన్ని అంటేలా తీసుకువెళ్లింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కాదా..? ఆ విషయాన్ని మరచి, రాష్ట్ర బీజేపీ పెద్దలు నీతుల వల్లించడం, ప్రత్యేకించి మా ప్రభుత్వానికి శుద్ధులు చెప్పడం, ఇంతకన్నా విడ్డూరం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు.
భారతదేశంలోని 28 రాష్ట్రాలలో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే వ్యయాన్ని మిగతా రాష్ట్రాలు కూడా గమనిస్తున్నాయి. గడిచిన రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో అమలవుతున్న సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి మన పథకాలను అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాలను కూడా మనం చూస్తున్నాం. మిగతా రాష్ట్రాలకు మార్గదర్శిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవడం మనమంతా గర్వించదగ్గ విషయం.
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద వసూలు చేస్తున్న పన్నులెంత? అందులో రాష్ట్రాలన్నింటికీ కలిపి వస్తున్న వాటా ఎంత? లీటర్ రూ.70 చిల్లర ఉన్న డీజిల్, పెట్రోల్ ను కంకణం కట్టుకుని మరీ భయం, బెరుకు లేకుండా సెంచరీ దాటించారు. దేశ ప్రజల మీద ఏమాత్రం జాలి, దయ అనేది లేకుండా పెట్రో, డీజిల్ ధరలను రూ.110. నుంచి రూ. 118 వరకూ తీసుకువెళ్లిన ఘనులు.. ఇవాళ రోడ్లమీదకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎడాపెడా వీర బాదుడు బాదేసి.. ఇవాళ రూ.5 తగ్గించారట. ఇక ప్రపంచం తల్లక్రిందులు అయిపోయినట్లు.. మీరెందుకు తగ్గించరంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి నెలా వారు పెంచినఇంధన ధరలు ప్రజలకు గుర్తు ఉండవని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు అనుకుంటున్నారేమో..!
విభజిత రాష్ట్రంగా.. హైదరాబాద్ రాజధానిని కోల్పోయి, రాష్ట్రానికి ఉన్న ఆదాయ లోటును పూడ్చేందుకు రూ.4 సెస్ విధించడం జరిగింది. అలానే రాష్ట్రంలో 8,900 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేయడానికి రూ. 2,205 కోట్లుతో కేవలం రూ.1 రోడ్ సెస్ ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనికి ధర్నాలు చేస్తాం, రోడ్ల మీదకు వస్తాం.. అని మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.
భారతదేశంలో పెట్రోలు, డీజిల్ మీద కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ రూ.47వేల కోట్లు అయితే.. అది కాకుండా మరో రూ. 2లక్షల 87వేల 500 కోట్లు సాలీనా వివిధ సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేస్తున్న విషయం వాస్తవమా, కాదా? దానిలో ఏమైనా పైసా తగ్గిస్తున్నారా?
పెట్రోల్, డీజిల్ పై కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటా చూస్తే..
కేంద్రం వసూలు చేస్తున్న ఈ పన్నులు, సెస్సులు, సర్ చార్జీలన్నింటిలో.. అంటే ఈ రూ. 3,35,000 కోట్లలో 28 రాష్ట్రాలకూ కలిపి వస్తున్న వాటా ఎంతో తెలుసా.. కేవలం రూ. 19, 475 కోట్లు. ఇది కేవలం 5.80 శాతమే. అదికూడా ఎక్సైజ్ డ్యూటీగా వసూలు చేస్తున్న రూ. 47,500 కోట్ల సొమ్ములో 41 శాతం వాటాగా మాత్రమే ఈ రూ. 19, 475 కోట్లు రాష్ట్రాలన్నింటికీ ఉమ్మడిగా దక్కుతుంది. మిగతాదంతా వెళ్ళేది కేంద్ర ప్రభుత్వానికే.
ధరలు తగ్గించామని చెబుతున్న బీజేపీ నాయకులు మరి రూ. 2లక్షల 87వేల 500 కోట్లు మాటేమిటి అని మేము ప్రశ్నిస్తున్నాం. మొత్తం కలిపితే రూ. 3,35,000 కోట్లు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, రాజకీయ నిబద్ధత ఉంటే పార్లమెంటు నార్త్ బ్లాక్ దగ్గరకు వెళ్లి ధర్నా చేయాలి. మీ ఊకదంపుడు ఉపన్యాసాలను మైక్ పెట్టి ఢిల్లీలో వినిపించండి. నిన్న తగ్గించిన రూ.5-10 కాకుండా మరొక రూ.20-25 తగ్గించమని ప్రధాని మోదీని అడగండి.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్రం వసూలు చేస్తున్న డబ్బులో రాష్ట్రాలకు ఎలాంటి వాటా దక్కకూడదన్న ఉద్దేశంతోనే సెస్సులు, సర్ చార్జీలు అంటూ వేర్వేరు పేర్లు పెట్టి కథ నడుపుతన్నారు. పన్నుల్లో అయితే వాటా ఇవ్వాలి కాబట్టి పన్నుల పరిధి బయట ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే కాకుండా, మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న రూ. 3.35 లక్షల కోట్లలో 41 శాతం రాష్ట్రాలకు రావాలి. అయితే పెట్రో ఆదాయన్ని డివిజబుల్ పూల్ లోకి రాకుండా చేసి, సెస్సుల రూపంలో, సర్ చార్జీల రూపంలో మిగతా రూ. 2.87 లక్షల కోట్లను కేంద్ర ఖజానాలో కలిపేసుకుని, రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన 41 వాటా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. సోము వీర్రాజుగానీ, బీజేపీ గానీ మన రాష్ట్ర ప్రజలకు చెప్పని నిజం ఇది.
రూ. 70 ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ రూ.116 ఉండటం ఏంటి? రూ.20 కాకపోతే రూ.30, అదీ కాకపోతే రూ.40. తగ్గించండి. తగ్గించవద్దని ఎవరు అన్నారు?. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకున్నా.. వీరబాదుడు బాది, ఇంధన ధరలను ఇక్కడవరకూ తీసుకువచ్చి, మీరేదో పెద్ద దయార్థ్ర హృదయులు మాదిరిగా, భారతీయ జనతా పార్టీకి ప్రజల మీద ప్రేమ, మమకారం, జాలి గల మహా ప్రభువుల్లాగా మాట్లాడుతున్నారు.
– ఇంతకన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా నీచమైన భావజాలం ఏముంటుంది? తగ్గించండి, మా రాష్ట్రానికి వచ్చే వాటా తగ్గిద్ది. అయినా మేము సిద్ధంగా ఉన్నాం. నార్త్ బ్లాక్ దగ్గర ధర్నా చేద్దామంటే అందరం కలిసి వెళదాం. కావాలంటే వ్యక్తిగతంగా నేను (పేర్ని నాని) కూడా వస్తాను. ఏది ధర్మం, ఏది న్యాయం అనేదానిపై మీరా మాట్లాడేది?
రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ ప్రభుత్వం వేసిన రూపాయి సెస్ ను తగ్గించండి అని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల పేరుతో పెట్రోల్, డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం సెస్‌ల పేరిట ఒక లక్షా 98వేల కోట్లు వసూలు చేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు… మీకు తెలియకుంటే కేంద్రంలోని పెద్దలను వాస్తవాలను అడగండి.
స్పెషల్ ఎడిషన్ ఎక్సైజ్ డ్యూటీ కింద సాలీనా రూ. 74,350 కోట్లు కేంద్రం వసూలు చేస్తోంది. రోడ్ల నిర్మాణం పేరిట రూ. ఒక లక్షా 98వేల కోట్లు, ఇతర సెస్‌ల పేరుతో రూ.15,150 కోట్లు వసూలు చేస్తోంది. మీరు మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను ఏ రాష్ట్రాలు తగ్గించాయో మీరే చెప్పండి…? మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో మరి ధరలు ఎందుకు తగ్గించలేదు? మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల శృంగభంగం చేశారు కాబట్టే.. ఒక్కసారిగా వారికి ప్రజలు గుర్తుకు వచ్చి, ఎక్కడవాళ్లు దూరం అవుతారనే భయంతో రూ.70 ఉండాల్సిన పెట్రోల్, డీజిల్‌ను రూ.118కి తీసుకువెళ్లి.. చివరకు రూ.5, రూ.10 తగ్గించారు. మీరు చేసే జిమ్మిక్కులు, మీరు వేసే బఠాణీలు, బిస్కెట్లు ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వాస్తవాలను గుర్తెరగాలి.
28 రాష్ట్రాల్లో…. 14 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దొంగచాటు చర్యలను గమనించి నవ్వుకుంటున్నాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా? ట్యాక్స్‌లు వేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్‌ల పేరిట కేంద్ర ప్రభుత్వం విపరీతంగా బాదుడు కార్యక్రమం చేపడుతోంది. ఇబ్బడిముబ్బడిగా ప్రజలపై భారాన్ని మోపుతూ పైపెచ్చు నీతివాక్యాలు, అహింసా మార్గాలు అంటూ అనుసరిస్తోందట.
బీజేపీకి తోడుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒకాయన(చంద్రబాబు) బయల్దేరాడు. ఆయన 2015 నుంచి పెట్రోలు మీద 31 శాతం ట్యాక్స్, డీజిల్ మీద 22. 5 శాతం ట్యాక్స్, 4 శాతం సెస్ వేశాడు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలోనూ వ్యాట్ ది అదే శాతం. ఇంతటి కోవిడ్ పరిస్థితుల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 వేలకోట్ల ఆదాయం కోల్పోయిన పరిస్థితుల్లోనూ.. ఈ వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. పూర్తిగా మేకను కోసి, కడుపు నిండా తిసేసి, బొమికలతో సహా నమిలేసి, ఇప్పుడు ఆరుబయట కూర్చుని, కాషాయ బట్టలు కట్టుకుని అహింస బోధిస్తున్నట్లుగా చంద్రబాబు ధర్నాలు చేస్తామంటూ సూక్తి ముక్తావళి చెబుతున్నాడు.
రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది ఏంటి అనే విషయ పరిజ్ఞానం, ఇంగితం అనేది ఉండాలి కదా? ప్రజలు ఏమీ గుర్తుపెట్టుకోరు అనుకుంటూ యథేచ్ఛగా, నిర్లజ్జగా తగుదునమ్మా… అంటూ తప్పుడు ఆలోచనలతో రాష్ట్రవ్యాప్తంగా 9న ధర్నాలు చేపడతామని చెబుతున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారనే దానిపై సిగ్గు, ఎగ్గూ ఉండాలి కదా?
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు, రాష్ట్రాలకు దేనికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో అయినా అమలు జరుగుతున్నాయో చెప్పగలరా? కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా అమలు జరుగుతున్నాయా?
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అభివృద్ధి చేయడానికి, అక్షరాశ్యత శాతాన్ని గణనీయంగా పెంచేందుకు వేలకోట్ల రూపాయలతో అనేక పథకాలు, మార్గాల ద్వారా జగన్‌గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది మీ కళ్ళకు కనిపించడం లేదా?
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్షా 30వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా అందించిన విషయం మీకు అర్థం కావడం లేదా?
నాడు-నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయడం, నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఈ ప్రభుత్వం ఖర్చు చేసే వేలకోట్ల రూపాయలు మీకు కనిపించడం లేదా? అలానే, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నది మీకు కనిపించడం లేదా..?
వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంత అమ్ముతున్నారో తెలుసా అని ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుతున్నాం. ప్రతి ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా అత్యవసరం అయిన గ్యాస్ సిలిండర్ ధర ఎంతో కనీసం మీకు స్పృహ ఉందా? దీనిపై ఢిల్లీ వెళ్ళి పెట్రోలియం శాఖ మంత్రి ఆఫీసు వద్ద ధర్నా చేయండి. భారతదేశంలో గ్యాస్ పొయ్యి లేనటువంటి ఇల్లు ఉంటుందా? ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు? గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇస్తున్నారా? తోబుట్టువులు అంటూనే వారి పర్సుల్లోని డబ్బులు లాగేసుకుంటారా? గ్యాస్ సిలిండర్‌తో పాటు డిజీల్, పెట్రోల్‌పై పెంచిన ధరలు తగ్గించాలని కోరుతున్నాం. మా ప్రభుత్వానికి నష్టమైనా కూడా.. అయిదు, పది కాదు… రూ.20 తగ్గించమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.
టీడీపీ హయాంలో పెట్రో, డీజిల్ ఉత్పత్తులపై ఎంత ట్యాక్స్ వసూలు చేశామనే దానిపై చంద్రబాబు స్పృహలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. ధర్నాలు చేయడం కాదు… విజ్ఞతతో ప్రవర్తిస్తే బాగుంటుంది. చంద్రబాబు సర్కార్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల మీద లెక్క చెప్పే పరిస్థితి అసలు ఉందా? ఇవాళ జగన్ గారు అత్యంత పారదర్శకంగా వచ్చిన రాబడి, చేస్తున్న వ్యయాన్ని ప్రజలకు సరాసరి చేరవేసే పరిస్థితి ఉంది.
చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కన్నా గొప్ప నటుడు అంటూ ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు ఆత్మక్షోభతో చెప్పిన మాటలు ఇవాళ్టికి మర్చిపోలేం. ఇవాళ చంద్రబాబులో నటుడు కాదు, మహా నటుడు కనిపిస్తున్నాడు. ఇష్టారాజ్యంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడేదానిలో ఇసుమంత కూడా బాబు విలువలు పాటించరు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఏమి చేశాను అనే నిబద్ధత లేకుండా ఒక నటుడుగా నిరూపించుకుంటున్నారు.
ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు. 2019 నుంచి ఇప్పటివరకూ ఏ ఎన్నిక జరిగినా.. ప్రతి ఎన్నికలోనూ వైఎస్ జగన్‌తో పాటు వైయస్సార్ సీపీకి ప్రజలు వారి గుండెల్లో స్థానం ఇచ్చారు. ఎంత పదిలంగా చూసుకుంటున్నారనే దానికి తార్కణమే వారిస్తున్న వరుస తీర్పులుగా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఈవిధంగా ఉంటే ఏమీ కనపడనటువంటి ధృతరాష్ట్రుడి వ్యవహారంలా చంద్రబాబు పరిస్థితి ఉంది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేందుకు, ఆయనను కాపాడేందుకు.. వైఎస్ జగన్ గారిని కూలదోసేందుకు, వారి అనుకూల మీడియా దోస్తులు అడ్డగోలు రాతలు, అవాస్తవాలతో ఎంత అన్యాయంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో ట్యాక్స్‌లతో పాటు సెస్ కూడా వసూలు చేసినప్పటికీ, కేవలం జగన్‌గారి ప్రభుత్వమే ట్యాక్స్‌ల రూపంలో ప్రజలపై భారం మోపుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. వారి పాపాలకు భగవంతుడే ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేస్తాడు.
చంద్రబాబుకు వత్తాసు పలికుతూ, జగన్ గారిపై విషం కక్కే ఓ వర్గం మీడియా ఉన్న పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు పెట్రో ధరలపై ప్రభుత్వం తరఫున అడ్వర్టేజ్ మెంటు ఇస్తే తప్పేంటి..? అందులో ఉన్నవన్నీ వాస్తవాలే కదా.. ? ఎందుకు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారు. ?
చివరగా… రాష్ట్ర బీజేపీ నాయకులకు చెప్పేది ఒక్కటే.. ప్రజలు మీ గురించి మరింత చులకనగా మాట్లాడకముందే ఇంధన ధరలు మరో రూ.20 నుంచి రూ. 25 తగ్గించాలని.. ఢిల్లీ వెళ్లి ధర్నాలు, పొలికేకలు, రంకెలు వేయమని చె బుతున్నాం. ప్రజలు కూడా వాస్తవాలు గమనించాలని కోరుతున్నాం.