ప్రతి విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం

రూ. కోటితో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి
గుడివాడ, నవంబరు 8: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. సోమవారం గుడివాడ పట్నం గౌరీశంకరపురంలోని ముసిపల్ ఇంగ్లీషు మీడియం ప్రాధమిక పాఠశాల(పార్క్ స్కూల్)లో రూ. కోటి రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పునులను బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా రాణించాన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన కోరిక అని అన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలలను నాడు-నేడు ద్వారా కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరిస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. రూ. కోటి రూపాయలతో రెండు అంతస్తుల సామర్థ్యం గల అదనపు భవనాన్ని పార్కు స్కూల్లో నిర్మిస్తున్నామన్నారు. ఎంపీ బాలశౌరి చోరవతో కంటైనర్ కార్పోరేషన్ న్యూఢిల్లీ వారి ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ మంజూరు అయ్యాయన్నారు. మరో కోటి రూపాయలతో స్థానిక గాంధీ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రెండు భవనాలకు సంబందించి ప్రస్తుతం రూ.12.5 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయన్నారు. గ్రౌండ్ ప్లోర్ లో 2 అడిషినల్ క్లాస్ రూములు, సైన్స్ ల్యాబ్, ఇండోర్ ప్లే గ్రౌండ్, 2 టాయిలెట్స్, మొదటి అంతస్తులో 4 క్లాస్ రూములు, లైబ్రరీ, 2 టాయిలెట్స్, రెండవ ప్లోర్ లో 4 క్లాస్ రూమ్ లు ఒక డిజిటల్ లైబ్రరీ, 2 టాయిలెట్స్ నిర్మిస్తున్నామన్నారు. పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విద్యార్థులకు అనువుగా, సౌకర్యంగా ఉండే విధంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు పాఠశాల అదనపు భవన నిర్మాణంలో తమ సహకారం అందించాలన్నారు. పాఠశాల అదనపు భవన నిర్మాణానికి కావలసిన నిధులను ఏమాత్రం ఆలస్యం లేకుండా అందించడం జరుగుతుందని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ బాలశౌరి మున్సిపల్ ఇంజనీర్లును ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమీటీ సభ్యులతో మాట్లాడి పాఠశాల అభివృద్ది కృషి చేస్తున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌరీశంకరపురంలోనే నిర్మాణంలో ఉన్న డిఎస్పీ భవనాన్ని మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, మున్సిపల్ ఈఈ శేఖర్, డీఈ ప్రవీణ్, డిఎస్పీ సత్యానందం, పేరేంట్స్ కమీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.