విజయవాడ: శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను బుధవారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల రెండేళ్లు ఇళ్లకే పరిమితం అయ్యామన్నారు. క్రీడలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదగవచ్చునని, 48 క్రీడా అంశాలలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలుగులోకి తెస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తామన్నారు.
ఆక్రమణలో ఉన్న క్రీడా ప్రాంగణాలు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా స్పష్టం చేశారు. విశాఖలో వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి ఏడాది మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కేంద్రం నుంచి కూడా క్రీడలకు నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు.
కె బి ఎన్ కళాశాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన రోజా
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కె బి ఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వందల మందికిపైగా రక్తదానం చెయ్యటం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావనాతో ఉండటం మంచి విషయమని, ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణం నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వటంతో పాటు అవయవదానం చెయ్యాలని పిలుపిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపేది యువతేనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు.
మంత్రి రోజా సభకు బైరెడ్డి సిద్దారెడ్డి గైర్హాజరు
శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి గైర్హాజరయ్యారు. సభలో నాయకులు, అధికారులు బైరెడ్డి పేరే ఎత్తలేదు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అయన పేరును కూడా తీయలేదు. కాగా ఇప్పటికే బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే నాయకులు, అధికారులు బైరెడ్డి పేరు ఎత్తలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.