– ఆమె పీఏ సతీష్‌ను తక్షణమే అరెస్టు చేయాలి
– పక్కలోకి రావాలంటూ మహిళా ఉద్యోగికి బెదిరింపులు
– అయినా స్పందించని మంత్రి సంధ్యారాణి
– మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్
విశాఖపట్నం: సాక్షాత్తూ మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఏ.. మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషమని మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఏకంగా పక్కలోకి రావాలంటూ బెదిరించినా.. సదరు పీఏపై మంత్రి సంధ్యారాణి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన హోం మంత్రి అనితతో పాటు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కూడా తక్షణమే భర్తరఫ్ చేయాలని, మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.
ఏకంగా మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పీఏ.. ఒక మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషం. ‘అధికార టీడీపీ నాయకులు నిన్ను కోరుకుంటున్నారు.. వారి పక్కలోకి రావాలని’.. పిలవడం అధికార పార్టీ నేతల బరితెగింపునకు నిదర్శనం. ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే.. ఆమెను రక్షించాల్సిన మంత్రి సంధ్యారాణి.. తన పీఏను వెనకేసుకుని రావడం సిగ్గుచేటు. వాట్సప్‌లో మంత్రి అనధికారిక పీఏ సతీష్ బాధిత మహిళతో అసభ్యకరంగా మెసేజ్ చేయడంతో పాటు, ఫోన్ లో బెదిరిస్తుంటే సదరు వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గం. మరోవైపు అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉమ అనే మహిళకు చెందిన జ్యోతి లేబోరేటరీని సీజ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రోద్భలంతోనే జ్యోతి ల్యాబ్‌ను సీజ్ చేశారని చెబుతున్నారు.
అంటే వాళ్ల అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టులు, వేధింపులుగు దిగుతున్నారు. మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం మంగాపురంలో అంగన్వాడీ హెల్పర్ మీద దుశ్వాసన పర్వం కొనసాగింది. స్థానిక టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కుమారుడు విష్టు ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించాడు. తమ పార్టీకి చెందిన వారికి ఉద్యోగమిప్పించుకోవానికే బెదిరింపులుకు దిగి.. ఆమె అంగీకరించక పోవడంతో భార్యాభర్తలపై దాడి చేసి, ఆమె చీర లాగి, బయటకు తీసుకెళ్లి కర్రలు, చీపురుతో దాడి చేశాడు. నెల్లూరు జిల్లా కావలిలో మైనర్ బాలికకు మద్యం పట్టించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
మహిళలపై ఇన్ని దారుణాలు జరుగుతుంటే మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి, హోం మంత్రి ఏం చేస్తున్నారు? ఆపదలో ఉన్న మహిళలకు న్యాయం చేయకుండా, వారిని రక్షించకుండా మీ శాఖలకు మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు?. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గుమ్మడి సంధ్యారాణి ఏనాడూ, గిరిజనుల సమస్యలు, వారి గోడుపై నోరు మెదపలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో కలుషిత నీటి వలన ఇద్దరు బాలికలు చనిపోగా… పెద్ద సంఖ్యలో బాలికలు అస్వస్థతకు గురైనా ఆమెకు పట్టదు.
అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆహారం కలుషితం కావడంతో పెద్ద సంఖ్యలో బాలికలు అనారోగ్యం పాలైనా మంత్రిగా పట్టించుకున్న పాపాన పోలేదు. మహిళల భద్రతపై నోరు మెదపని డిప్యూటీ సీఎం గత ప్రభుత్వ హయాంలో సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఊగిపోతూ.. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించిన పవన్ కళ్యాణ్… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 35వేల మంది ఆడపిల్లలు వాలంటీర్ వ్యవస్థ వల్ల మాయం అయ్యారు. దీనిపై తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సమాచారం వచ్చిందన్న పవన్‌కళ్యాణ్… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి బాథ్యతలు చేపట్టిన తర్వాత, వారిలో ఎంత మంది అమ్మాయిలను వెనక్కి రప్పించారో సమాధానం చెప్పాలి.