– రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల కుంభకోణంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు భాగస్వామ్యం
– శనివారం అసెంబ్లీ మీడియా పాయింటులో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్దం
– డేట్, టైమ్, వేదికను మంత్రి ఖరారు చేసినా అభ్యంతరం లే దు
– ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమే
– బీఆర్ఎస్ పెద్దలతో మీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్
హైదరాబాద్ : ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ (HILT) పాలసీ ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాళాకోరుతనానికి నిదర్శనం అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని అన్నారు. హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్, ఈ విధానంపై బహిరంగ చర్చకు సిద్దమా అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు . ఓపెన్ డిబేట్ కు మంత్రి సిద్దపడితే శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింటులో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్దం అని తెలిపారు. లేదంటే డేట్, టైమ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమే అని సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గతబీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ … బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామిక భూముల బదలాయింపులలో జరిగిన తప్పిదాలను బయటపెడుతామని మీ క్యాబినెట్ సబ్ కమిటీ సహచరులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడారు కదా? మరి ఎందుకని బయటపెట్టడం లేదు.? బీఆర్ఎస్ పెద్దలతో మీకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలను నగరం బయటకుపంపుతున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సరే, పరిశ్రమలను ఎక్కడికి తరలిస్తున్నారో, వారికి ఎక్కడ భూములను కేటాయించారో ఎందుకని చెప్పడం లేదన్నారు.
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూముల్లో నిర్మాణాలు చేసుకోవచ్చంటూ, వాటిని ఆ ల్యాండ్ ఓనర్లకే అడ్డికి పావుశేరు ధరలకే ఎందుకు కట్టబెడుతున్నారు. రూ 6 లక్షల30 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ. 5 వేల కోట్లకే కట్టబెట్డడం కుంభకోణం కాక మరేంటని ప్రశ్నించారు. రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల కుంభకోణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మొత్తం క్యాబినెటుకు, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు భాగస్వామ్యం ఉంది. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ల్యాండ్ కన్వర్షన్ కాదు, ల్యాండ్ లూటీకి పాల్పడుతోంది. రాష్ట్రాన్ని ల్యాండ్ లూటీ మాఫియా రాజ్యమేలుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ల్యాండ్ లూటీ మాఫియా డాన్ లా, మంత్రులు ల్యాండ్ లూటీ గ్యాంగ్ స్టర్లుగా వ్యవహరిస్తున్నారు. హిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి లేదంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించి తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలి. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే హిల్ట్ పాలసీని అమలు చేయాలి. ఈ పాలసీని అమలు చేసేందుకు జారీ చేసిన జీవో-27ను తక్షణమే రద్దు చేయాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలసీ రద్దుకు భారీ ఉద్యమం చేపడతామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.