అమరావతి : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై వెనుకబడిన తరగతుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆయా సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. వెనుబడిన తరగతులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సాగిస్తున్నారన్నారు. పదవులు, సీట్లు కేటాయింపుల్లోనూ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
మరింత మంది బీసీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించాలన్న ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పన కృషి చేస్తామంటూ ఇచ్చిన హామీని సైతం సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎం మూర్తి, బీసీ సంఘ నేతలు దేవుళ్ల మురళి, ఆదినారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.