– మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం
– రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మంచిర్యాల: ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు, ఎలక్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు మంచి ఆలోచన అన్నారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు.
వైద్య సేవల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం వైద్యం ఇదే ప్రాంతంలో ఉచితంగా అందించి ప్రజలలో భద్రత, నమ్మకం కలిగిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 6 పడకలను 30 పడకలకు అప్ గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, సుమారు 54 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు.
అత్యవసర సేవల సమయంలో వేగవంతమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాలలో 2, మండలానికి 1 చొప్పున అందించేందుకు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రతి 30-35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు ప్రాణాపాయానికి గురి కాకుండా బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలోని కిడ్ని డయాలసిస్ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో అదనంగా 29 ఉప కేంద్రాల ఏర్పాటుతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలోని వెంకట్రావుపేట, చెన్నూర్ నియోజకవర్గంలోని అంగ్రాస్ పల్లి లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉత్తర తెలంగాణలో 4 క్యాన్సర్ కేంద్రాలు, వస్కులర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
వైద్య సిబ్బంది సంఖ్యను పెంచి ప్రజలకు వైద్య సేవలను సంపూర్ణంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలను విద్యావంతులను చేసి సమాజంలో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు రాష్ట్ర అభివృద్ధిలో జవాబుదారీగా ఉండాలని, సిద్ధాంత పరంగా సమాజ అభివృద్ధిలో భవిష్యత్తు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ఐ.టి., పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వం సంవత్సర కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని, ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా 7 నియోజకవర్గాలు, మహారాష్ట్ర చత్తీస్ ఘడ్ నుండి వైద్య సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను అందించడం జరుగుతుందని, ప్రజలకు భారం కాకుండా ఉచితంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకుంఠిత దీక్షతో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపుకు గురికాకుండా 262 కోట్ల రూపాయల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో మొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు ఆర్థిక క్రమశిక్షణతో చర్యలు చేపడుతున్నామన్నారు.