Suryaa.co.in

Andhra Pradesh

రామతీర్థం ఆలయ నిర్మాణం జరగటం ఇష్టం లేకే..అశోక్ గజపతిరాజు వీరంగం

– రామతీర్థం రాములోరి గుడికి శంఖుస్థాపన చేస్తుంటే.. సర్కస్ కంపెనీ అని నీచంగా మాట్లాడతారా..?
– ఆలయ ధర్మకర్తగా ప్రభుత్వం తరఫున గౌరవంగా ఆహ్వానించడమే అశోక్ గజపతిరాజుకు జరిగిన అవమానమా..!?
– టీడీపీ హయాంలో రామతీర్థం కొండపైన ఒక్క వీధి దీపానికి కూడా కరెంటు ఇవ్వలేదు.
– రామతీర్థం ఘటనపై విచారణ జరుగుతుంటే అశోక్ గజపతిరాజుకు ఎందుకు కంగారు..!?
– ఆలయ ధర్మకర్తగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అశోక్ గజపతిరాజు ఏనాడైనా ప్రభుత్వానికి ఒక్క లేఖ రాశారా?
– ఇది రాజరికం కాదు… ప్రజాస్వామ్యం. ఎవరైనా సంప్రదాయాలను గౌరవించాలి
– మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్‌

దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఏమన్నారంటే…శ్రీరామ నవమి పర్వదినం రోజున ఆలయాన్ని ప్రారంభించాలన్నది లక్ష్యం.ప్రసిద్ధి చెందిన రామతీర్థంలో కొండపైన ఉన్న రామాలయానికి రూ.3 కోట్లు, దిగువన ఉన్న రామాలయానికి కోటి రూపాయలు ప్రభుత్వం తరపున నిధులు కేటాయించి, ఈరోజు రాష్ట్ర మంత్రులుగా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తే.. ఆలయ ధర్మకర్తగా స్వాగతించాల్సిందిపోయి, అశోక్ గజపతిరాజు సర్కస్ అంటూ వీరంగం వేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ ఒక దురదృష్టకర సంఘటన జరిగింది.

దాంతో, నెలరోజులలోపే విగ్రహాలు తయారు చేయించాం. అనుకున్న ప్రకారం శ్రీరామనవమికి ఆలయాన్ని పునఃప్రారంభించాలనే సంకల్పంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. నిర్మాణానికి కావల్సిన మెటీరియల్‌ అంతా పైకి తీసుకువెళ్లెందుకు పనులు జరుగుతున్నాయి. ఇవాళ మంచిరోజు కాబట్టి శంకుస్థాపన చేసి, శ్రీరామ నవమి పర్వదినం రోజు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపట్టాం.

ఆలయ నిర్మాణం జరగటం అశోక్ గజపతిరాజుకు ఇష్టం లేదా..?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడలో అనేక పురాతన దేవాలయాలను కూల్చివేయడం జరిగింది. వాటన్నింటిని తిరిగి సీఎం చేతుల మీదగా మళ్లీ శంకుస్థాపన చేసి… తిరిగి వాటిని నిర్మించి, ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలానే, రామతీర్థంలోని దిగువ ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ, ప్రభుత్వం కృషి చేస్తుంది.

ఆలయ ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఆహ్వానించడం జరిగింది. ప్రోటోకాల్‌ ప్రకారమే శిలా ఫలకాన్ని ఏర్పాటు చేస్తే.. అంత పెద్ద వయసు ఉన్న అశోక్‌ గజపతిరాజు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం ఆయనకు ఇష్టంలేదనే భావన కనిపిస్తోంది.

అశోక్ గజపతిరాజుకు అవమానం ఎక్కడ జరిగింది..? మీడియా వాస్తవాలు చూపించాలి
పది గంటల ఎనిమిది నిమిషాలకు శంకుస్థాపన ముహుర్తం పెడితే అశోక్‌ గజపతిరాజు గంట ముందే కొండ మీదకు వెళ్లడం, వీరంగం వేయడం చూశాం. దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడ జరిగిన వాస్తవాలను ప్రజలకు చూపించాలి. కొన్ని మీడియా సంస్థలు, ఓ పార్టీకి అనుకూలంగా, రాజకీయంగా చూపించాలనుకుంటే అది వారి ఇష్టం కానీ, జరిగిన సంఘటనను కట్‌ అండ్‌ పేస్ట్‌ లేకుండా చూపించాలని కోరుతున్నాం. ఇక్కడ ఏం జరిగిందన్నది విజువల్స్‌ లో అందరూ చూశారు. మరి ఎక్కడ అశోక్‌ గజపతిరాజుకు అవమానం జరిగింది? ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని తీసివేయడం చట్టరీత్యా నేరం కాదా? శిలా ఫలకాన్ని పక్కన పారేసి, ఇది ఒక సర్కస్‌ కంపెనీ, ఇక్కడ సర్కస్‌ చేస్తారా? అంటూ ఆయన మాట్లాడటం దురదృష్టకరం.

ఆలయం అభివృద్ధి చేయడం ఆయనకు ఇష్టం లేదు
రాములవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలి. ఒకవేళ అశోక్‌ గజపతిరాజుగారికి ఇష్టం లేకుంటే రాకుండా ఉండాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయ ధర్మకర్తగా ఉన్న ఆయన హయాంలో రామతీర్థం ఆలయ అభివృద్ధికి ఒక్క రుపాయి అయినా ఖర్చు పెట్టారా? ఆలయ అభివృద్ధికి అసలు సంకల్పించారా?
– బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే తప్ప టీడీపీ సర్కార్‌ ఈ ఆలయానికి ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టిందా? అశోక్‌ గజపతిరాజు విగ్రహానికి రూ. 1.15 లక్షలు ఇస్తున్నట్టు షరతులు పెట్టి విరాళం ఇస్తే ఏవిధంగా తీసుకుంటాం. ఆయన మనసున్న మహరాజు అయితే దేవాలయ అభివృద్ధికి తోడ్పడేందుకు ఇవాళ ఎంత ఇస్తారో, అంత చెక్‌ ఇమ్మని చెప్పండి.

ఆలయానికి చైర్మన్‌గా ఉన్న ఆయనకు మా కంటే ఎక్కువగా ఆలయ పరిరక్షణ బాధ్యత ఉంది. ఎక్కడా ప్రోటోకాల్‌ ఉల్లంఘనలు జరగలేదు. అమర్యాద చేయలేదు. రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం వస్తుంటే.. ఆయన్ని అవమానించారని వ్యవహరించిన తీరు చూస్తుంటే రాములవారి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టు ఉంది. నిర్మాణ పనులను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయం అభివృద్ధి చేయడం ఆయనకు ఇష్టం లేదు, ప్రభుత్వం మంచి చేస్తుంటే చూడలేరు. దయచేసి అన్ని మీడియాలు కూడా వాస్తవాలు చూపించాలని కోరుకుంటున్నాం.

రామతీర్థం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది
రామతీర్థం ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. నివేదిక ఇంకా రాలేదు. దొంగలు తేలాల్సిన అవసరం ఉంది. టీడీపీ హయాంలో, కొండపైన కనీసం వీధి దీపం కూడా లేని దుస్థితి ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్‌ కనెక్షన్‌తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అసలు ఆ విగ్రహాలను ధ్వంసం చేసే అవసరం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వంగా దేవాలయాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.

విగ్రహాలు ధ్వంసం చేసే అవసరం కానీ, అక్కడ విద్యుత్‌ సౌకర్యం లేదన్న విషయం కానీ వారికి మాత్రమే తెలుసు. విచారణ జరుగుతుంది కదా… మరి ఎందుకు అశోక్‌ గజపతిరాజు హడావుడి పడిపోతున్నారు. ఎందుకు ఓ పదిమందిని తీసుకువచ్చి వీరంగం సృష్టించారు? ఓవైపు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటే సర్కస్‌.. సర్కస్‌ అంటూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏవిధంగా మంచి జరుగుతుంది. ఆలయ అభివృద్ధికి అడ్డుపడుతున్న అశోక్‌ గజపతిరాజును అందరూ ప్రశ్నించాలి. ప్రొటోకాల్‌ ప్రకారం ఆయనకు గౌరవం కూడా ఇచ్చాం. ఎందుకు ఆయన ఆవిధంగా ప్రవర్తించారో అర్థం కాలేదు.

ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్న రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజు… నిధులు ఏమైనా ఆయన సొంత ఖజానా నుంచి ఇచ్చారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆలయ చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజు కోదండ రామాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏనాడైనా ఒక లేఖ అన్నా రాశారా, ఎందుకు రాయలేదు. లీగల్‌గా లాయర్‌ నోటీసులు పంపించడం తప్ప, ఆలయ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. ఆలయంలో విగ్రహాలు ధ్వంసం అయితే వెళ్లి చూశారా? అశోక్‌ గజపతిరాజును ఆహ్వానించబట్టే కదా శిలా ఫలకంపై ఆయన పేరు వేసేది? ఆయన ఆ విలువను కాపాడుకోలేకపోతున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
అశోక్‌ గజపతిరాజు ఎలా మాట్లాడుతున్నారంటే ఆయన ఒక బ్రహ్మకొండ… మిగతావాళ్లంతా అమయాకులు అన్నట్లుగా వ్యవహరించారు. రామతీర్థం ఆలయ అభివృద్ధి మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారం అయినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రూ.3కోట్లు మంజూరు చేయాల్సి వచ్చింది. మరి ఆలయ అభివృద్ధికి మాన్సాస్‌ నుంచి ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? భూములను ఎందుకు సొంతానికి వాడుకున్నారు? దీనికి అశోక్‌ గజపతి రాజు సమాధానం చెప్పాలి. ఆయనకు ఉన్న దుర్బుద్ధి, నీచమైన ఆలోచన రాములవారి సాక్షిగా ఈరోజు బయటపడింది.

30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి ఘటన, పరిస్థితులు ఇన్నేళ్లుగా ఎప్పుడూ విజయనగరం జిల్లాలో జరగలేదు. అధికారంలో వారూ ఉన్నారు, మేము కూడా ఉన్నాం. కానీ ఇటువంటి నీచమైన, క్రిమినల్‌ ఆటిట్యూడ్‌తో ప్రవర్తించలేదు. ఆయనది చిన్నవయసు కాదు కదా? ఇదేం సంప్రదాయం, ఇదేనా సంస్కృతి, ఇదేనా పెంపకం, ఇదేనా వారి తల్లిదండ్రుల తాలూకా వంశ చరిత్ర. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా? ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు, సంఘటన జరిగినా, దేవాలయ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఎంతో హుందాగా ప్రవర్తించాలి.

ఎందుకు ఆయన ఇలా వీరంగం వేశారని ఆరా తీస్తే… అశోక్ గజపతిరాజును ఆహ్వానించేందుకు వెళ్లిన ఈవో, ఆలయ అర్చకులను ఆయన ఇంటి దగ్గరే తూలనాడారు. వారిని గౌరవిస్తున్నామని చెప్పి, ఇలా ప్రవర్తించడం సరికాదు. మనసులో తప్పుడు ఆలోచనలు ఉంటే, ఇలాగే పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తారు. సంప్రదాయం, పద్ధతి, బాధ్యత ఉన్న వ్యక్తి, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తారా? జిల్లా పరువును తీసేస్తున్నారు. ఇదా సంప్రదాయం…? ఆయన వ్యవహరశైలిని, అశోక్‌ గజపతిరాజు చేసింది సరైనదే అని చూసిన వారు ఎవరైనా ఒక్కరన్నాఅంటే … నేను తల దించుకుంటాను. అహంభావంతోనే ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమే కానీ, రాజరికం కాదు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి. ఎవరు తప్పు చేసినా ఆ శ్రీరాముడే చూసుకుంటాడు. అన్నింటికీ అతీతులం అని వ్యవహరించడం సరికాదు.

ఆలయ చైర్మన్‌గా ఆలయ అభివృద్ధి ఆయన బాధ్యత కాదా? వారం క్రితమే పిలవడానికి వెళ్లిన ఆలయ అర్చకులు, ఈవోను దూషిస్తారా? వాళ్లు తిట్లు తినేందుకు ఉన్నారా? ఇలాంటి సంఘటన ఇప్పటివరకూ జిల్లాలో జరగలేదు. ఇలాంటివి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. అశోక్‌ గజపతిరాజు దుర్మార్గాలు, అరాచకాలు మాకు తెలియవు అనుకుంటున్నారా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరికీ తెలియదు అనుకున్నట్టు, ఈయన దుర్మార్గాలు, అరాచకాలు ప్రజలకు తెలియవు అని అనుకుంటున్నారా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యంలో ఎవరూ క్షమించరు. భగవంతుడే శిక్ష వేస్తాడు.

ఎంతసేపటికీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పితే.. ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న బాధ్యత అశోక్ గజపతిరాజుకు లేదా..? రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయాన్ని రెండో భద్రాద్రి ఆలయంగా అభివృద్ధి చేయాలని ఈ జిల్లావాసులుగా మేం కోరితే, ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విజయనగరం జిల్లా సంస్కతి, సంప్రదాయాలను కాపాడాలని కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తులు వ్యవస్థకే వినాశనం. రాబోయే తరానికి ఇలాంటి అలవాట్లు, ఆలోచనలు రాకూడదని భగవంతుడిని కోరుతున్నాం.. అని బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీమతి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే శ్రీ రాజన్న దొర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE