-అల్లర్లు సృష్టించి న్యాయస్థానానికి వెళ్లాలని ప్రభుత్వ వ్యూహం
-పాదయాత్రను ఒక రాజకీయ పార్టీ యాత్రగా చూపించే విస్తృత ప్రయత్నంలో సక్సెస్
-పాదయాత్ర నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. సమిష్టి ఆలోచనలతో ముందుకు పోవాలి
-లేకపోతే కడివెడు పాలు నేలపాలు
-అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
అరసవల్లి పాదయాత్రను అడ్డుకునేందుకే మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అడుగడుగునా అల్లర్లు సృష్టించి అమాయకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసే వ్యూహ రచన ప్రభుత్వం చేస్తుందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు బొత్స సత్యనారాయణ పాదయాత్రను అడ్డుకోవడం ఐదు నిమిషాల పని అన్నా, మంత్రి సీదిరి అప్పలరాజు ఉత్తరాంధ్ర పై దండయాత్ర అన్నా, మంత్రి అంబటి రాంబాబు బలిసినోళ్ల యాత్ర అన్నా పాదయాత్ర చేస్తున్న మహిళలను రెచ్చగొట్టేందుకే అని చెప్పారు.
రేపల్లెలో మూడు రాజధానులు అంటూ, గుడివాడలో నరుకుతాం అంటూ ఫ్లెక్సీలు పెట్టినా, ఏలూరులో జై జగన్ నినాదాలు చేసినా ఉద్రిక్తతలు సృష్టించేందుకే అని తెలిపారు. వీటిపై పాదయాత్ర మహిళల స్పందనలను, వీడియో క్లిప్పింగులతో కోర్టులో పెట్టి నిబంధనల అతిక్రమించినట్లుగా పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. పాదయాత్ర ఒక పార్టీయాత్రగా చూపే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారని,పాదయాత్ర నిర్వాహకులు గమనించాలని గుర్తు చేశారు. అమరావతికి మూడు ప్రాంతాల అపూర్వ మద్దతు దేవస్థానం పాదయాత్ర తోనే రాష్ట్రానికి ఏనాడో తెలిసిందని చెప్పారు. ఒక యజ్ఞం విజయవంతం కావాలంటే, ఓర్పు, సహనంతో పాటు, సమిష్టి ఆలోచనలు ఉండాలని, నిర్దిష్ట ప్రణాళిక అవసరమని, లేకపోతే కడివెడు పాలు నేల పాలయ్యే ప్రమాదం ఉందని పాదయాత్ర నిర్వాహక పరిరక్షణ సమితి నాయకులకు బాలకోటయ్య సూచించారు.