పీకే కంటే జగనే గొప్ప!

– కేసీఆర్‌ ఫెయిల్‌, జగన్‌ సక్సెస్‌ వెనుక అదే కారణమా?
– టీఆర్‌ఎస్‌ పీకేను ఎందుకు పంపించివేసింది?
– పీకే పప్పులు తెలంగాణలో ఎందుకు ఉడకం లేదు?
– ప్రశాంత్‌కిశోర్‌ టీఆర్‌ఎస్‌లో ఎందుకు విఫలమవుతున్నారు?
– జగన్‌- పీకే బంధం ఎందుకు కొనసాగుతోంది?
( మార్తి సుబ్రహ్మణ్యం)

పాండవులు తమ తెలివి పక్కనపెట్టి శ్రీకృష్ణుడిపై ఆధారపడినట్లు.. ఇప్పుడు రాజకీయ పార్టీలు సొంత బుర్రలను పక్కనపెట్టి, వ్యూహకర్తలకు తమ మెదళ్లు అప్పగిస్తున్నాయి. దానితో సదరు వ్యూహకర్తలే నాయకత్వాలను ఆడిస్తున్నారు. ఎన్నికల యుద్ధంలో దిగే పార్టీలకు కూడికలు-తీసివేతలతోపాటు, లాభనష్టాలు కూడా వారే చెబుతున్నారు. కాకపోతే అందుకు వందల కోట్లలో ఫీజు వసూలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు చేయాల్సిందల్లా.. సదరు కన్సల్టెంట్లు చెప్పింది చేయడమే.

ప్రపంచం దృష్టిలో ప్రకాంత్‌ కిశోర్‌ అనే బీహారు ఎన్నికల బేహారి పనిమంతుడు. పెద్ద మేధావి. అంతకంటే అతి పెద్ద వ్యూహకర్త. ఆయన కేసు టేకప్‌ చేస్తే, ఎన్నికల కోర్టులో ఆయన క్లయింట్‌ గెలిచి తీరవలసిందే. అందుకు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ భారీ విజయమే నిలువెత్తు నిదర్శనం. బెంగాల్‌లో మమతాబెనర్జీ కూడా ఆయన ఐడియాలతో ఎన్నికల వైతరణి దాటింది. చివరాఖరకు కాంగ్రెస్‌ కూడా పీకేను శరణువేడాల్సి వచ్చింది. అంటే ఇక పీకే పనితనమేమిటో మీరే చూస్కోండి. ఇదీ పీకే ప్రతిభపై చాలామందిలో నాటుకుపోయిన బలమైన అభిప్రాయం.

కానీ.. సలహాలిచ్చిన పీకే కంటే దాన్ని పాటించిన జగనన్నే గొప్పవాడు. పీకే సలహాను అక్షరాలా అమలుచేసినందుకే, జగన్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. అలా పాటించనందుకే కేసీఆర్‌, చంద్రబాబు వద్ద కన్సల్టెంట్లు ఎక్కువకాలం పనిచేయలేకపోతున్నారన్నది సీనియర్ల అభిప్రాయం.

నిజానికి జగన్‌ తొలి ఎన్నికల అరంగేట్రమే భారీ స్థాయిలో జరిగింది. అప్పటికే ఆయన ఒక బలమైన నాయకుడిగా అవతరించారు. కాకపోతే సరైన యంత్రాంగం, ప్రణాళిక, శ్రేణులతో సమన్వయం లేక తొలిసారి ఓటమి పాలయ్యారు. అది కూడా 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలకు సిద్ధమయిన జగన్‌.. గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకున్నారు. విజయం కోసం ఏం చేయాలో మార్గదర్శనం కోసం, ప్రశాంత్‌కిశోర్‌ ఐప్యాక్‌ను నియమించుకున్నారు. నిజానికి జగన్‌కు అప్పటివరకూ తెలిసింది తక్కువ. రాజకీయ అవగాహన కూడా తక్కువ. వ్యాపారం మీద ఉన్న పట్టు రాజకీయాల్లో లేదు. అందుకే భారమంతా పీకేపై వేశారు. కుల-మత సమీకరణలో మొనగాడయిన పీకేకు.. కులపిచ్చితో కొట్టుకునే ఏపీ బాగా కలసివచ్చింది.

కమ్మ-కాపు, కాపు-బీసీ, కమ్మ-ఇతర కులాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని బాగా సొమ్ము చేసుకున్న పీకే.. కులవ్యవస్థను రెచ్చగొట్టారు. ప్రధానంగా టీడీపీని ప్రేమించే కమ్మ వర్గంపై మిగిలిన కులాలు రెచ్చగొట్టారు. కమ్మ వర్గానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు ఇచ్చారని రచ్చ చేరింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నివాసంలోనే టీడీపీకి చెందిన శ్రీవారి పింక్‌ డైమండ్‌ ఉందని నానా యాగీ చేశారు. కానీ తర్వాత అసలు శ్రీవారికి పింక్‌ డైమండే లేదని స్వయంగా, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారనుకోండి. అదే విషయం!

ఆవిధంగా ఎన్నికల యుద్ధంలో శ్రీకృష్ణుడి మాదిరిగా పీకే ఇచ్చిన సలహాలన్నీ అర్జనుడయిన జగన్‌jagan-pk పాటించారు. చివరకు అభ్యర్ధుల ఎంపిక భారం కూడా, పీకే భుజంపైనే పెట్టిన జగన్‌ ఇచ్చిన స్వేచ్ఛను పీకే సద్వినియోగం చేసుకున్నారు. కాబట్టే సరైన ఫలితం రాబట్టగలిగారు.ఈ విషయంలో మరి పీకే కంటే జగనే గొప్ప కదా?

స్వయంగా కేసీఆరే చెప్పినట్లు.. పదహారేళ్ల నుంచి మిత్రుడయిన పీకేను, మరి ఆయన వదిలించుకోవపడమే ఆశ్చర్యం. మనకు పీకే పనిచేస్తున్నారని చెప్పిన కేసీఆర్‌, ఆయనను అతిkcr-pk కొద్దికాలానికే వదిలించుకోవడ మే ఆశ్చర్యం. తెలంగాణ సంగతి తనకొదిలేసి.. జాతీయ రాజకీయ ప్రవేశానికి సంబంధించి, సోషల్‌మీడియా పోస్టుల ప్రమోషన్‌ సంగతి వరకూ పరిమితం కావాలని, పీకేకు చెప్పారన్నది బయట వినిపిస్తున్న ముచ్చట.

మరి కేసీఆర్‌ వద్ద పీకే ఎందుకు విఫలమయ్యారన్నది ప్రశ్న. ఎందుకంటే.. కేసీఆర్‌ ఆయనకు జగన్‌ మాదిరిగా స్వేచ్ఛ ఇవ్వలేదని ఒక పాయింటయితే, తన సర్వే విశ్లేషణ వినేందుకు కేసీఆర్‌ తగిన సమయం ఇవ్వకపోవడమన్నది రెండో పాయింటు. సీనియర్లను కూడా మార్చాలన్న పీకే సలహా కేసీఆర్‌కు నచ్చనందుకే, ఆయనను పక్కనపెట్టారన్నది ముచ్చటగా మూడో పాయింటు.

నిజమే. జగన్‌కు సలహాలిచ్చిన రోజుల్లో అయితే అంతా వైసీపీకి కొత్త ముఖాలే. పక్క పార్టీల నుంచి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కాబట్టి, ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. కానీ టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పీకే తప్పించాలంటున్న వాళ్లంతా బలమైన నాయకులే. వారిని మారిస్తే టీఆర్‌ఎర్‌కు, రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. పైగా బీజేపీ-కాంగ్రెస్‌ వంటి బలమైన పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. అందుకే.. తెలివైన కేసీఆర్‌, అంతకంటే తెలివైన పీకే మాట వినకుండా పక్కనపెట్టారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

‘ఈ సమయంలో అంతమంది సిట్టింగులను మార్చే ధైర్యం కేసీఆర్‌ చేయరు. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే వారి కోసం బీజేపీ-కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నాయి. నిజానికి వచ్చే ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు తొలి ఎన్నికలంత సవాలు వంటిది. ఇప్పుడాయన ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన అంతమందిని మార్చి రిస్కు తీసుకుంటారని భావించలేం. జగన్‌ తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పుడంటే ఆయనకేమీ తెలియదు. రెండోసారి ఓటమి ఎదురయిన తప్పులను విశ్లేషించుకుని, గెలిపించే బాధ్యతను పీకేపై పెట్టారు. అయితే అప్పటికే జగన్‌ కూడా కొంత అనుభవం సంపాదించిన వాస్తవాన్ని విస్మరించలేం. కానీ ఆ పాలసీ కేసీఆర్‌ దగ్గర వర్కవుట్‌ కాదు. ఎందుకంటే ఆయన కూడా వ్యూహరచయితే కాబట్టి’’ అని ఎన్నికల వ్యూహకర్త రవికుమార్‌ విశ్లేషించారు.

నిజానికి ప్రాంతీయ పార్టీల వద్ద ఎన్నికల వ్యూహకర్తలు స్థిమితంగా పనిచేయడం కష్టమన్నది విశ్లేషకుల మాట. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వారి ముందు.. ఎన్నికల కన్సల్టెంట్లు చెప్పే విశ్లేషణలు చెవికెక్కవు.ఎందుకంటే వాళ్లు అప్పటికే రాజకీయాల్లో తలపండినవాళ్లు కాబట్టి! వారు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లలో మార్పు-చేర్పులకు అంగీకరిస్తారే తప్ప, అసలు బిల్డింగునే మార్చమంటే ఒప్పుకోరు. కన్సల్టెంట్లు కొత్త తరం ఓటర్లపై, ఎలా గాలం వేయాలో చెబుతారు. దాన్ని కూడా సీనియర్లు తమ పాత అనుభవంతో బేరీజు వేసుకుని, తిరిగి కన్సల్టెంట్లకే ఎదురు సలహాలిస్తారు. పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు-ఆయన సలహాలు బెడిసికొట్టడానికి కూడా సరిగ్గా ఇవే కారణాలుగా అర్ధం చేసుకోవాలి.

ఇక సోషల్‌మీడియా-డిజిటల్‌ ప్రచారంపై ప్రాంతీయ పార్టీ నాయకత్వాలు, అప్పటికే ఒక టీమును పార్టీ ఆఫీసులలో నియమించుకుంటాయి. కొత్తగా వచ్చిన కన్సల్టెంట్లకు-అంతకుముందు నుంచే ఆఫీసులో పనిచేసే, సోషల్‌మీడియా టీముల ఆలోచనల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. దాని గురించి అధినేతలకు వివరించాలంటే వారు పూర్తి సమయం ఇవ్వరు. దానితో విసిగిపోయిన పీకే లాంటి మేధావులు పక్కకు తప్పుకోవలసి రావడం అనివార్యమవుతుంది.

ఇక ఏపీలో సక్సెస్‌ అయిన పీకే.. తెలంగాణలో ఎందుకు ఫెయిలయ్యారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఏపీలో కులం కంపు ఎక్కువ. ఏపీ ప్రజలు పీల్చే-వదిలే గాలిలో కూడా కులాన్నే చూస్తారు. తమ కులం కోసంjagan-pk-kcr-1 ఏమైనా చేస్తారు. మతపరమైన భావోద్వేగాలు అసలు ఉండవు. అందుకే బీజేపీ అక్కడ ఇప్పటికీ ఎదగలేదు. ప్రధానంగా ఆంధ్రులు స్వార్థపరులు. ఆలోచనలూ అలాగే ఉంటాయి. వ్యాపారధోరణి ఎక్కువ. ప్రతి దానిలోనూ లాభనష్టాలు బేరీజు వేస్తారు. సమాజానికేమైనా పట్టించుకోరు. తమకు ఏం ఒరిగిందన్నదే వారికి ప్రధానం. పీకే సరిగ్గా ఈ బలహీనతలనే వజ్రాయుధంగా సంధించి, టీడీపీని ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.

కానీ తెలంగాణ సమాజం అందుకు భిన్నం. తెలంగాణలో కులానికి అతి తక్కువ ప్రాధాన్యం. తెలంగాణలో అద్దె ఇళ్ల కోసం వెళితే ఏ కులం అని ఎవరూ అడగరు. వారికి నెలకు అద్దె కట్టడమే ముఖ్యం. కానీ అదే బెజవాడకు వెళితే, ముందు వచ్చే ప్రశ్న నీదే కులం అని. తమ కులం వారికే ఇళ్లు అద్దెకిచ్చే అనాగరిక సంస్కృతిలోనే వారు ఇంకా జీవిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా అలాంటి కులభావనలున్నాయంటే, దానికి కారణం ఆంధ్రా నుంచి వచ్చి సెటిలయిన వారి పుణ్యమే.

కాబట్టి పీకే తెలంగాణలో కులాల మధ్య చిచ్చు పెట్టినా ఫలితం శూన్యం. తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ ఉండే కీలకమైన ప్రాంతాల్లో మాత్రమే, మతపరమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ మాత్రమే బీజేపీ ఉనికి ఎక్కువగా కనిపిస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ ఎదగలేదంటే, అక్కడి ప్రజల్లో మతకోణం లేకపోవడం. పీకే లాంటి ఎన్నికల వ్యూహకర్తలు ఏం చేసినా.. మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలే చేస్తారే తప్ప, కులం కోణం కుదరదు. ఇప్పుడు అది కూడా కష్టమే. వివిధ రాష్ర్టాల నుంచిహైదరాబాద్‌లో నివసించే వారంతా ప్రశాంతతనే కోరుకుంటారు తప్ప, మతోన్మాదాన్ని అంగీకరించరు. ఎవరి హయాంలో తాము సురక్షితంగా ఉంటామన్న కోణంలోనే ఓటు వేస్తారు.అందుకే తెలంగాణలో మత వ్యూహం కూడా పారదు. ఈ విషయంలో మరి పీకే కంటే జగనే గొప్ప కదా?

Leave a Reply