Suryaa.co.in

Telangana

తెలుగుదేశం పార్టీలో చేరిన మైనారిటీ నేతలు

తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రొ అన్వర్ ఖాన్ మరియు కార్వాన్ ముస్లిం మైనారిటీ నేతలు
ప్రొ అన్వర్ ఖాన్ నాయకత్వంలో కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు పలువురు , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. తన నివాసానికి తరలి వచ్చిన ముస్లిం మైనారిటీ నాయకులను చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి టిడిపి చేసిన కృషిని గుర్తుచేశారు. హైదరాబాద్ లో మతకలహాలను అరికట్టి మత సామరస్యానికి పెద్దపీట వేయడం, ఉర్దూను రెండో అధికార భాషగా చేయడం, హజ్ భవన్ నిర్మాణం, ముస్లింల సంక్షేమం కోసం అనేక వెల్ఫేర్ స్కీమ్ లు ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి బలోపేతానికి చేస్తున్న కృషిని వివరించారు. ప్రొ అన్వర్ ఖాన్ తోపాటు తెలుగుదేశం పార్టీలో చేరినవారిలో ముజాహిద్ ఖాన్, మీరజ్ ఖాన్, రిజవానుల్లా ఖాన్,శహబాస్ ఖాన్, జహంగీర్ ఖాన్, తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన రావు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామా భూపాల్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
2021 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా అన్వర్ ఖాన్ పోటీ చేసిన విషయం విదితమే. అన్వరుల్ ఉలూమ్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేశారు, 3దశాబ్దాలుగా లెక్చరర్ గా సేవలందించారు. లోక్సత్తాలో కూడా పనిచేశారు, జయప్రకాశ్ నారాయణ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE