Suryaa.co.in

Andhra Pradesh

రుషికొండపై భవనాలకు రూ.420 కోట్ల దుర్వినియోగం

హైకోర్టులో వ్యాజ్యం.. విచారణ 21కి వాయిదా

పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాలు నిర్మించారంటూ జూన్ 23న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేసేలా మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి, మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.420 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. గంగాధర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

జగన్మోహన్రెడ్డి, అప్పటి సీఎస్ జవహర్రెడ్డి, అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, జోగి రమేష్, బుగ్గన రాజేంద్రనాథెడ్డి, అంబటి రాంబాబు, ఇతర మంత్రులు, అధికారులు నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు లేవని వివరించారు. కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీకి సైతం విన్నపమిచ్చామన్నారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ముందుకు బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.

LEAVE A RESPONSE