టిడిపి నేత జీవి ఆంజనేయులు ఆరోపణ..
బొల్లాపల్లి భూముల అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు.
వినుకొండ లోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు బొల్లాపల్లిలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు ఇచ్చి కోట్లు దోచుకున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మార్వో ను అడ్డం పెట్టుకొని దాదాపు పది కోట్లకు పైగా వసూలు చేశారని చెప్పారు.
ఒక్కొక్క పాస్ పుస్తకానికి పది వేల రూపాయల చొప్పున ఏడు వేలకు పైగా పాసు పుస్తకాలు మంజూరు చేశారని అన్నారు. చుక్కల భూములు, పోరంబోకు ప్రభుత్వ భూములకు అడ్డగోలుగా తనకు కావలసిన వారికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
ఈపాస్ పుస్తకాలతో బ్యాంకులను కూడా మోసం చేసి లోన్ ల రూపంలో డబ్బులు కాజేశారు అన్నారు.
బొల్లాపల్లి మండలం లో అటవీ భూములకు కూడా పాసుపుస్తకాలు ఇచ్చారు అని చెప్పారు. ఈ మండలంలో పేదలైన ఎస్సీ ఎస్టీలు అధికంగా నివసిస్తున్నారని వివరించారు. అధికారం రాకముందు ఇదే బ్రహ్మనాయుడు పేదలకు సమగ్ర సర్వే చేసి రైతు హక్కు పత్రాలు ఇస్తామని వెల్లడించి దోపిడీకి తెర తీయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఇకపై ఎమ్మెల్యే బొల్లా బొల్లాపల్లి లో తిరిగే పరిస్థితి లేదని అన్నారు. పేద రైతుల దగ్గర పాసుపుస్తకాల కు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను చొక్కా ఊడదీసి కొడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అవినీతికి భూములను స్వాహా చేస్తున్నారని అన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ రంగనాథ్ రాజ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇల్లు కాలనీలు ఆయనకు కనిపించకపోవడం విడ్డూరమని అన్నారు. వినుకొండ కు వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన కాలనీలను మీ ఎమ్మెల్యే బొల్లా చూపిస్తారు అని అన్నారు. టిడిపి ప్రభుత్వం 5 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిందని అన్నారు. పట్టణాలలో పేదలకు కాలనీలు నిర్మించి మహానగరాలుగా మార్చామని అన్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా చేశారని విమర్శించారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా 18 కోట్లు కాజేశారని చెప్పారు. తాను గాని నా కుటుంబ సభ్యులైన బావ మరదలు అయినా గాని ప్రభుత్వ భూమిని కానీ ఆక్రమించుకొని ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొల్లా పై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.